ట్రస్ట్‌లో 15 మంది సభ్యులు

రామమందిరంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడి

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామమందిరంపై పార్లమెంట్‌ వేదికగా కీలక ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మందిర నిర్మాణం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ట్రస్ట్‌లో 15 మంది సభ్యులు ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. ఇందులో ఒకరు దళిత కమ్యూనిటీ నుంచి ఉంటారన్నారు. లోక్‌సభలో నరేంద్రమోదీ ప్రకటన చేసిన కొద్దిసేపటి తర్వాత అమిత్‌ షా ట్విటర్‌ వేదికగా దీనిపై స్పందించారు. ‘రామ జన్మభూమి తీర్థ క్షేత్రలో 15 మంది ట్రస్టీలు ఉంటారు. ఇందులో ఒకరు దళిత వర్గానికి చెందిన వారు ఉంటారు. ఈ ట్రస్ట్‌ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది’ అని షా ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
‘ఈ రోజు యావత్‌ దేశ ప్రజలకు ఎంతో ఆనందమైన, గర్వకారణమైన రోజు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ ఏర్పాటు చేశాం. సామరస్యాన్ని బలపర్చేలా ఇంతటి అపూర్వ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి కోటి కోటి ధన్యవాదాలు. శతాబ్దాలుగా కోట్లాది మంది ఎదురుచూపులు త్వరలోనే ఫలించనున్నాయి. భగవాన్‌ శ్రీరాముడి జన్మస్థలంలో భక్తులు ఆయనను పూజించనున్నారు’ అని షా వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
మసీదు కోసం ఐదెకరాలు..
సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌కు ఐదు ఎకరాల స్థలం కేటాయించినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది. అయోధ్యలోని సోహావల్‌ తహసీల్‌ పరిధిలోని ధన్నీపూర్‌ గ్రామంలో ఈ స్థలం ఇచ్చినట్లు పేర్కొంది.