నేను ఉగ్రవాదినయితే

బీజేపీకి ఓటేయండి
అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన తనని ఓ ఉగ్రవాది అనడం చాలా బాధించిందని దేశ రాజధాని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. మరో రెండు రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. ఎంపీ పర్వేశ్‌వర్మ నన్ను ఉగ్రవాది అనడం చాలా బాధించింది. నేను నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం ఏమీ చేయలేదు. నా జీవితాన్ని దేశం కోసం అంకితం చేశాను. నాతో పాటు ఐఐటీ చదివిన 80శాతం మంది బ్యాచ్‌మెట్స్‌ విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. ఆదాయ పన్ను శాఖ కమిషనర్‌ ఉద్యోగాన్ని నేను వదులుకున్నాను. అలాంటి నన్ను ఉగ్రవాది అన్నారు. దీన్ని నేను దిల్లీ వాసులకే వదిలేస్తున్నాను. నేను ఉగ్రవాదినయితే ఫిబ్రవరి 8న కమలం గుర్తుకు ఓటేయండి. లేదు దిల్లీ కోసం నేను శ్రమించాను అనుకుంటే.. చీపురు గుర్తుకు ఓటేయండి’ అని కేజ్రీవాల్‌ ఓటర్లను అభ్యర్థించారు. ‘తనని హిందూ వ్యతిరేకంటూ భాజపా చేసిన విమర్శలపైనా ఆయన స్పందించారు. నేను ఏ విధంగా హిందూ వ్యతిరేకిని? హనుమాన్‌కు నేను అపరభక్తుడిని. హనుమాన్‌ చాలీసాను చెప్పగలను కూడా’ అని ఆయన అన్నారు. రాజకీయాల కోసం దిల్లీ పోలీసులను కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఉపయోగించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
జామియా ఇస్లామియా వద్ద కాల్పులు జరిపిన కపిల్‌ గుజ్జర్‌ ఆమ్‌ఆద్మీ పార్టీ సభ్యుడంటూ ఢిల్లీ పోలీసులు ఆరోపించడంపై సీఎం కేజ్రీవాల్‌ స్పందించారు. కపిల్‌ గుజ్జర్‌ ఆమ్‌ఆద్మీ సభ్యుడైతే ఆయనకు రెండింతల శిక్షను విధించాలని ఆయన తేల్చి చెప్పారు. ”అలాంటి తప్పులకు పదేళ్ల జైలు శిక్ష ఉంటే ఆయనకు ఇరవై ఏళ్ల జైలు శిక్షను విధించండి” అని అన్నారు. కపిల్‌ గుజ్జర్‌ ఆప్‌ సభ్యుడంటూ పోలీసులు చేస్తున్న ఆరోపణలను ఆయన మరోసారి ఖండించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చర్చలు జరపడానికి సదా సిద్ధంగా ఉంటానని, బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలో కూడా చెప్పాలని కేజ్రీవాల్‌ సవాల్‌ విసిరారు.