‘దిశా’సుర సంహారం

పోలీసు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన దిశ అత్యాచార నిందితులు

-తెల్లవారుజామున 5.30-6.00 మధ్య ఎన్‌కౌంటర్‌
-సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ కోసం నిందితులు తీసుకెళ్లిన పోలీసులు
-పోలీసుల చేతిలో గన్‌ లాక్కుని నిందితుల కాల్పులు
-పారిపోవడానికి ప్రయత్నించిన నిందితులు
-వారిని పట్టుకునే క్రమంలో కాల్పులు జరిపిన పోలీసులు
-ఘటన వద్దే పోలీసు కాల్పులకు 4గురు నిందితులు మృతి
-దిశ మృతిచెందిన కూతవేటు దూరంలోనే నిందితులు మృతి
-ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా సంబురాలు
-తెలంగాణ పోలీసులకు సెల్యూట్‌ చెబుతున్న నెటిజన్స్‌

హైదరాబాద్‌:
దిశకు న్యాయం జరిగింది..ఆమె ఆత్మకు శాంతి చేకూరింది…పది రోజుల క్రితం పాశవికంగా పశువుల కామవాంఛకు బలైపోయి విగతజీవిగా మారిన దిశకు దశదిన కర్మలు జరిగేలోపే ఆమెను సజీవ దహనం చేసిన కీచకుల పీచమణిచేశారు తెలంగాణ పోలీసులు. ఏడేళ్లుగా నిర్భయ హంతకులకు మరణ శిక్ష అమలు కాక ఇంకా కొనసాగుతునే ఉండగానే దిశకు ఫాస్ట్‌ ట్రాక్‌ న్యాయం అంటే ఇదీ అంటూ ధీటైన ముగింపు ఇచ్చారు పోలీసులు. ఎక్కడైతే దిశకు అన్యాయం జరిగిందో అక్కడ రాళ్లు వేయించుకున్న నాటి పోలీసులే నేడు అదే జనాలతో పూలు జల్లించుకోవడం విశేషం.
శంషాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలు ‘దిశ’ హత్యోదంతానికి పోలీసులు ముగింపు పలికారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్‌ ఆరిఫ్‌ పాషా, జొల్లు శివ, నవీన్‌, చెన్న కేశవులను శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ చేశారు. గత నెల 27న దిశను నిందితులు అత్యాచారం చేసి ఆ తర్వాత తగులబెట్టిన చాటాన్‌పల్లి వంతెన వద్దే నిందితులు మతి చెందారు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ కోసం నిందితులను ఘటాస్థలికి తీసుకెళ్లిన క్రమంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. దిశను తగులబెట్టిన స్థలంలో పోలీసులపై దాడి చేసి.. నిందితులు పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు.
న్యాయం జరిగింది.. మనషులకు హక్కులుంటాయి మగాళ్లకు కాదు.. ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి అదీ పోలీసోడై ఉండాలి.. నిద్రలేవగానే మంచి వార్త తెలిసింది.. ఇకమీదట ఘోరాలు జరగకుండా రక్షించుకోవాలి.. రాముడు, కష్ణుడిని పూజించడం కాదు అవసరమైతే ఆ అవతారమెత్తాలి.. ఇవీ దిశను పాశవికంగా అత్యాచారం చేసి కాల్చేసిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన తర్వాత ప్రజలు, సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు చేస్తున్న వ్యాఖ్యలు. ఎన్‌కౌంటర్‌ చేసిన తీరుపై చర్చలెన్ని జరుగుతున్నా అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట ‘దిశకు న్యాయం జరిగింది’
ఇక దిశ నిందితులకు ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. నిందితులకు సరైన శిక్ష పడిందని మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. కళాశాలల విద్యార్థినుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దిశ ఆత్మకు శాంతి కలిగిందని, కామాంధుల ఎన్‌కౌంటర్‌తో జనజీవన స్రవంతిలో ఉన్న మానవ మగాల గుండెల్లో దడ పుట్టించేలా ఉందని అన్నారు. టపాసులు పంచుతూ, స్వీట్లు తినిపించుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని, లేదా బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్లు వచ్చాయి. ఈ ఘటనను సవాల్‌గా తీసుకున్న సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ కేసును స్వయంగా పర్యవేక్షించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి సంఘటన జరిగిన 48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించేలా.. నెల రోజుల్లోనే కేసును కొలిక్కి తెచ్చేలా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నాలుగు బందాలుగా ఏర్పడి కేసులో కీలక ఆధారాలు సేకరించారు. నిందితులు చెప్పిన వివరాల ప్రకారం బలమైన ఆధారాల కోసం శోధిస్తున్న క్రమంలోనే నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.
యావద్దేశం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌ పట్ల ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. దిశ తండ్రి మాట్లాడుతూ.. ఎన్‌కౌంటర్‌ ఒక మంచి నిర్ణయమన్నారు. పాప ఆత్మకు శాంతి చేకూరిందని భావిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు సత్వర న్యాయం చేశారంటూ.. దేశవ్యాప్తంగా తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రజలకు క తజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు అండగా నిలిచారన్నారు. దిల్లీలో నిర్భయ కేసులో ఏడేళ్లైనా దోషులకు శిక్ష పడలేదు అని ఈ సందర్భంగా గుర్తుచేశారు. నా కుమార్తె విషయంలో 10రోజుల్లో మంచి నిర్ణయం తీసుకున్నారని పోలీసులను అభినందించారు. ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మకు శాంతి చేకూరుతుందని వ్యాఖ్యానించారు.
ఇలాంటి ఘటనలు పునరావతం కాకూడదు: దిశ సోదరి
దిశ హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్‌ కౌంటర్‌ చేయడంపై ఆమె సోదరి స్పందించారు. పోలీసులు చాలా వేగంగా చర్య తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారంటూ పోలీసు చర్యను కొనియాడారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావ తం కాకుండా చూడాలని అన్నారు. ఎన్‌కౌంటర్‌ విషయంపై ప్రభుత్వం నుంచి మాకెలాంటి సమాచారం రాలేదని, తాము కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నామని ఆమె చెప్పారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) దర్యాప్తునకు ఆదేశించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్‌హెచ్‌ఆర్సీ.. తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఎన్‌కౌంటర్‌లో నిజానిజాలు తెలుసుకునేందుకు వెంటనే ఒక బందాన్ని ఘటనాస్థలానికి పంపాలని ఎన్‌హెచ్‌ఆర్సీ డీజీ(దర్యాప్తు)ని ఆదేశించింది. ఘటనాస్థలాన్ని పరిశీలించి వెంటనే నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో ఎస్‌ఎస్పీ నేతత్వంలోని దర్యాప్తు బందం మరికాసేపట్లో హైదరాబాద్‌ బయల్దేరనున్నట్లు తెలుస్తోంది. దిశ హత్యకేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద శుక్రవారం తెల్లవారుజామున నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులను ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ పోలీసులు జిందాబాద్‌ అంటూ పూల వర్షం కురిపిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ ద్వారా సరైన సమాధానం చెప్పారంటూ స్థానికులు వ్యాఖ్యానించారు. ఆడపిల్లలు ఉన్న తండ్రులుగా…నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడమే సరైన చర్య అని అభిప్రాయపడ్డారు.
దిశ నిందితులు.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన వార్త తెలియడంతో సంఘటనా స్థలానికి స్థానికులు తండోపతండాలుగా చేరుకున్నారు. తెలంగాణ పోలీసులతో పాటు ముఖ్యమంత్రి జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు పెద్ద సంఖ్యలో జనాలు తరలి రావడంతో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ అయింది. స్థానికుల్ని నియంత్రించడం ఓ దశలో పోలీసులకు సమస్యగా మారింది. ఇక హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్‌కౌంటర్‌ను పెద్ద ఎత్తున సమర్థిస్తున్నారు. పలుచోట్ల సంబరాలు జరుపుకుని, స్వీట్లు పంచుకుంటు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా దిశ అత్యాచారం, హత్యకేసును దేశం మొత్తం ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహారించిన ఆ నలుగురు మ గాళ్లకు భూమ్మీద బతికే హక్కు లేదని జనం నినదించారు. మగాళ్ల హేయమైన చర్యకు బలైపోయిన దిశకు న్యాయం జరగాలంటే ఆ నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ షాద్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా ఎంపీలే ఈ నినాదాలు చేయడం.. ఘటన తీవ్రతకు అద్దం పట్టింది. దీంతో అన్ని వైపులా నుండి పోలీసులపై ఒత్తిడి పెరిగింది.
ఈ క్రమంలోనే నిందితులను సీన్‌ రీకనస్ట్రక్షన్‌కు తరలించడం..అక్కడ వారు తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. పోలీసులపై మొదట ప్రధాన నిందితుడు ఆరిఫ్‌ దాడికి యత్నించాడు. అనంతరం అతడికి మిగిలిన నిందితులు జత కలిశారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు…కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారు జామున మూడున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌ జరిగిన ఘటనా ప్రాంతాన్ని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పరిశీలించారు.