జన(తా) సేనాని!!
కమలనాధులకు దగ్గరవుతున్న పవన్ కళ్యాణ్…ఏపీలో నాయకత్వ బాధ్యతలు!
- -ఉనికి కోల్పోతున్న జనసేన పార్టీ
- -కొత్తగా చేరేవారి సంఖ్య కరువు
- -ఉన్న కొద్దిమందీ పార్టీకి దూరం
- -ఒంటరిగా ఉండి ఏం చేయలేని నిస్సహాయత
- -జాతీయ పార్టీతో జతకట్టేందుకు సిద్ధం
- -బీజేపీలో జనసేనను కలిపేసే యోచన
- -ఏపీ కమలం పార్టీలో క్రియాశీలక పాత్ర
- -పావులు కదుపుతున్న కమలనాధులు
- -వచ్చే ఎన్నికల నాటికి కసరత్తు
(హైదరాబాద్ జ్యోతి ప్రత్యేక ప్రతినిధి)
కమలం దరికి పవనం చేరుతుందా? లేక పవనం చెంతకే కమలం వస్తుందా? ఏమో ఏదైనా జరగొచ్చు. కేంద్రంలో ఏకచ్ఛత్రాధిపత్యం వహిస్తూ రెండోసారి కూడా అధికారపీఠం దక్కించుకున్న బీజేపీ ఈ సారి బలంగా దక్షిణాదిలోనూ పాగా వేయాలని భావిస్తోంది. ఒకప్పుడు కేంద్రంలో కీలక రాజకీయాలకు కేరాఫ్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలకే మద్దతిస్తోంది. అయితే దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి నాయకత్వ లోపమే పెద్ద శాపంగా మారింది. అందుకే కొద్దోగొప్పో జనాకర్షణ ఉన్న నేతలకు గేలం వేస్తోంది. అటు తమిళనాట రజనీకాంత్‌కు ఇటు ఏపీలో పవన్‌కళ్యాణ్‌కు తమ పార్టీలో కీలక స్థానం కల్పించనున్నట్లు సమాచారం. ఆ దిశగానే ప్రస్తుతం వేగంగా పావులు కదుపుతున్నారు కమలనాధులు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయంటూ మళ్లీ బాంబ్ పేల్చారు.. మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. తాను బీజేపీకి ఎప్పుడూ దూరంగా లేనంటున్నారు పవన్ కళ్యాణ్. ప్రత్యేక హోదా విషయంలోనే బీజేపీతో విభేదించానని.. అందుకే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశానని వ్యాఖ్యానించారు. తిరుపతిలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మరోసారి ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా స్పీడ్ పెంచారు. వైఎస్ జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నారు. వరుస ట్వీట్లతో వైసీపీ సర్కార్‌పై విరుచుకుపడుతున్నారు. జగన్ నిర్ణయాలను ఎండగడుతున్నారు. అయితే, ఇటీవలి పరిణామాలు మాత్రం పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారనే ఊహాగానాలకు తావిస్తున్నాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బీజేపీలో చేరిన రిటైర్డ్ సీఎస్ ఐవైఆర్ కష్ణారావు పవన్ కళ్యాణ్ బీజేపీలోకి వస్తే బాగుంటుందని చెప్పారు. అయితే, ఇందుకు గానూ పై స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఆయన స్పష్టంగా చెప్పారు. అంతకుముందు అమెరికాలో జరిగిన ప్రవాసాంధ్రుల సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరుకాగా, ఈ కార్యక్రమానికి వెళ్లిన బీజేపీ కీలక నేత రాంమాధవ్‌తో చర్చలు జరిపారనే వార్తలు వచ్చాయి.
ఇటీవల పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని పదేపదే కేంద్రం, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా పేరు చెప్పి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. జగన్‌పై కేసులు ఉన్నందున కేంద్రానికి ఫిర్యాదు చేస్తానంటే జగన్ భయపడతారని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు ఆయన మాటలను బట్టి స్పష్టమవుతోంది.
నరేంద్ర మోడీ తనను ఎంతో అభిమానిస్తారని, మోడీని సైతం తాను అభిమానిస్తానని ఇటీవల పవన్ కళ్యాణ్ పలుమార్లు గుర్తు చేశారు. ఇక, వారం క్రితం ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్లివచ్చారు. ఈ పర్యటన వివరాలను జనసేన ఎక్కడా భయటకు రానివ్వలేదు. పవన్ ఢిల్లీలో ఎవరెవరిని కలిసిందీ చెప్పలేదు. అయితే, పవన్ కళ్యాణ్‌కు అక్కడ ఎవరి అపాయింట్‌మెంట్‌లు దొరకలేదని వైసీపీ ప్రచారం చేస్తున్నా.. పవన్ ఢిల్లీ పర్యటన వెనుక వ్యూహం వేరే ఉండొచ్చనే అనుమానం ఆ పార్టీలోనూ ఉంది.
ఇటీవల పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో, ట్వీట్లలో తెస్తున్న మత ప్రస్తావన కూడా ఆయన బీజేపీకి దగ్గర అవుతున్నారా అనే అనుమానాలను కలగజేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ క్రైస్తవుడు అని పవన్ కళ్యాణ్ పదేపదే గుర్తు చేస్తున్నారు. జగన్ తిరుపతి లడ్డూలు తింటారో, తినరో అనే ఓ అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇక, జగన్ నిర్ణయాలు కూడా హిందుత్వానికి, ఆలయాలకు నష్టం చేసే విధంగా ఉన్నాయనేలా పవన్ ట్వీట్లు చేస్తున్నారు.
వాస్తవానికి జనసేన సిద్ధాంతానికి ఇది వ్యతిరేకం. కులం, మతం ఆధారంగా తన రాజకీయాలు ఉండవని పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పారు. ఇప్పుడు ఇందుకు భిన్నంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన బీజేపీకి దగ్గర అవుతున్నారనే సంకేతాలు పంపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయం అవ్వాలని వ్యూహాలు పన్నుతున్న బీజేపీకి ప్రజల్లో ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చాలా అవసరం. అందుకే ఐవైఆర్ లాంటి బీజేపీ నేతలు పవన్ తమ పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారు.
అయితే, సొంతంగా జనసేన పార్టీని స్థాపించి ఆరేళ్లుగా పవన్ కళ్యాణ్ నడిపిస్తున్నారు. ఇప్పుడు తన పార్టీని బీజేపీలో కలిపేందుకు ఆయన సిద్ధపడకపోవచ్చు. తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన నిర్ణయం తప్పుగా పవన్ కళ్యాణ్ భావిస్తుంటారు. కాబట్టి, పవన్ కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోకపోవచ్చనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే, బీజేపీలో గతంలో పని చేసిన అనుభవం ఉండటం వల్ల ఇప్పుడు కూడా కలిసి పనిచేసే అవకాశాలు మాత్రం లేకపోలేదు.
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో జనసేన పార్టీ లాంగ్ మార్చ్ నిర్వహించింది. అనంతరం బహిరంగ సభను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా.. బీజేపీ, కమ్యూనిస్టులు, టీడీపీలను పవన్ ఆహ్వానించారు. కానీ బీజేపీని పిలిచారని కమ్యూనిస్టులు, టీడీపీని పిలిచారని బీజేపీ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. కానీ పవన్ సభకు మాత్రం నైతిక మద్దతు ప్రకటించాయి. ఈ సభలో టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు పాల్గొనగా.. గంటా శ్రీనివాస్ దూరంగా ఉన్నారు.
లాంగ్ మార్చ్‌లో టీడీపీ మాత్రమే పాల్గొనడం ద్వారా.. టీడీపీ, జనసేన ఒక్కటేనన్న వైఎస్‌ఆర్సీపీ వాదనకు మరింత బలం చేకూరినట్టయ్యింది. వైజాగ్ సభలో వైఎస్‌ఆర్సీపీ నేతలపై పవన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్డిని టార్గెట్‌గా చేసుకొని మాట్లాడారు. కన్నబాబు, బొత్సలపైనా సెటైర్లు వేశారు. వైఎస్‌ఆర్సీపీ నేతలు మాత్రం.. టీడీపీ, బీజేపీలను కలపడం కోసం పవన్ ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు.
విజయసాయిరెడ్డి చిందులు వేస్తే ఆయన్ను ఎలా నియంత్రించాలో తనకు తెలుసని.. ఈ దేశాన్ని పాలించే బలమైన వ్యక్తులు తనకు తెలుసని పవన్ చెప్పారు. బీజేపీ పెద్దలకు తనంటే ఇష్టమనేలా జనసేనాని వ్యాఖ్యానించారు. ఇసుక సమస్యపై ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తానన్నారు. బీజేపీ పట్ల సానుకూలంగా పవన్ మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత.. రాజధానిలో పర్యటించిన అనంతరం.. పవన్ మాట్లాడుతూ.. మోదీ, అమిత్ షాలను కలుస్తానన్నారు. అంతకు ముందు అమెరికాలో బీజేపీ కీలక నేత రామ్ మాధవ్‌ను కలిశారు. దీంతో పవన్ బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరిగింది.
తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పవన్ బీజేపీతో దోస్తీకి సిద్ధంగా ఉన్నారని సంకేతాలు పంపారని భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా పవన్ పట్ల సానుకూలంగానే ఉంది. కానీ జనసేనను తమలో కలిపేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రజారాజ్యం అనుభవాల కారణంగా జనసేనాని ఇందుకు సిద్ధంగా లేరు. బీజేపీకి మిత్రపక్షంగా ఉండేందుకు మాత్రమే జనసేన సుముఖంగా ఉందనే వార్తలొస్తున్నాయి. టీడీపీతోనూ పవన్ సన్నిహితంగానే మెలుగుతున్నారు. లాంగ్ మార్చ్‌లో జనసేనతో కలిసొచ్చిన ఏకైక పార్టీ తెలుగు దేశమే. అటు టీడీపీ కూడా బీజేపీతో దోస్తీ కోసం ప్రయత్నిస్తుందనే వార్తలొస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో స్నేహం చేసేది లేదంటోంది. పవన్ విషయంలో మాత్రం సానుకూలంగా వ్యవహరిస్తోంది. పవన్ అవినీతి పరుడు కాదంటూ.. బీజేపీ నేతలు క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఇప్పటికైతే అటు బీజేపీ, ఇటు టీడీపీ.. మధ్యలో పవన్ కళ్యాణ్ అన్నట్టుగా పరిస్థితి ఉంది. మరి కొన్నాళ్లు ఆగితే.. ఈ మూడు పార్టీల దోస్తీ విషయంలోనే కాదు.. ఏపీ భవిష్య