జనవరి 3 నుంచి ‘అంతర్జాతీయ తెలుగు సంబరాలు’!

  • అంగరంగవైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు
  • భీమవరంలో 3న ‘తెలుగు వైభవ శోభా యాత్ర’
  • మూడు రోజుల పాటు భీమవరంలో తెలుగు వెలుగులతో అలంకరణ
  • తెలుగు సాహిత్య పక్రియలకు చెందిన 20 శకటాల ప్రదర్శనలు
  • అంతర్జాతీయ,జాతీయ,తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల ప్రతినిధులు హాజరు
  • నాలుగు వేల మంది ప్రతినిధులు హాజరు…అన్నీ ఏర్పాట్లు పూర్తి
  • అమ్మ ఒడిగా..ఆత్మగౌరవంగా…‘ తెలుగు భాష’ ముందుకు సాగాలి
  • ‘జ్యోతి’ జాతీయ తెలుగు దినపత్రిక ప్రత్యేక ఇంటార్వ్యులో ఆంధప్రదేశ్‌ ఆం‌ధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షులు డాక్టర్‌. ‌గజల్‌ ‌శ్రీనివాస్‌ ‌వెల్లడి

(భీమవరం నుంచి నాంపల్లి శ్రీనివాస్‌ )
‌భీమవరం,జ్యోతిన్యూస్‌:-

‌ప్రశ్న : ఆంధ్ర సారస్వత పరిషత్‌,ఆం‌ధప్రదేశ్‌ ‌నేపథ్యం ఏమిటీ ?
గజల్‌ ‌శ్రీనివాస్‌ : 60 ‌సంవత్సరాలు పైబడి ఎంతో అద్భుతంగా తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన అంధ్ర సారస్వత పరిషత్‌ ,‌హైదరాబాద్‌, ‌రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణా సారస్వత పరిషత్‌ ‌గా మారిన తరువాత, ఆంధప్రదేశ్‌ ‌లో భీమవరం పట్టణం ప్రధాన కేంద్రంగా ఆంధ్ర సారస్వత పరిషత్‌-ఆం‌ధప్రదేశ్‌ ‌గా 2017 సంవత్సరం రిజిస్టర్‌ ‌కాబడి పరిషత్‌ ‌కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నాము.
ప్రశ్న : పరిషత్తు కార్యవర్గంలో ఎవరెవరు ఉన్నారు ?
గజల్‌ ‌శ్రీనివాస్‌ : ‌నేను అధ్యక్షుడిగా, డా.కడిమిళ్ల వరప్రసాద్‌ ‌గురు సహస్రావధాని, మేడికొండ శ్రీనివాస్‌ ‌చౌదరి లు ఉపాధ్యక్షులుగా, రెడ్డప్ప ధవెజి కార్యదర్శిగా, శ్రీ రాయప్రోలు భగవాన్‌ ‌కోశాధికారిగా,మంతెన రాంకుమార్‌ ‌రాజు, పొన్నపల్లి రామారావులు సంయుక్త కార్యదర్శిలుగా పరిషత్‌ ఏర్పడింది.
ప్రశ్న : ముఖ్య లక్ష్యాలు ఏమిటి ?
గజల్‌ ‌శ్రీనివాస్‌ : ఆం‌ధ్రమేవ జయతే! అన్న నినాదం తో, తెలుగు భాషా సమగ్ర వికాసానికి కృషి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము. బాల బాలికలకు, యువతరానికి మాతృ బాష యెడల అనురాగాన్ని కలిగించి, మాతృ భాషలో సంభాషించడం ఒక ఆత్మ గౌరవం గా భావించేటట్టు మా కార్యక్రమాలు సాగుతున్నాయి.
ప్రశ్న : ఇంతవరకూ ఏమి కార్యక్రమలునిర్వహించారు ?
గజల్‌ ‌శ్రీనివాస్‌: అనేక కార్యక్రమాలు నిర్వహించాము. ముఖ్యంగా కవితా రచనలు, పద్య గాన, పఠన పోటీలు, కథా రచన పోటీలు, అవధానాలు, గ్రంథ ముద్రణ, సదస్సులు ఇలా వివిధ సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. అనేక కార్యక్రమాలు చేబట్టనున్నాము.
ప్రశ్న : ఆంధ్రమేవ జయతే నినాదం స్పూర్తి దాయకంగా వుంది.. ఈ ఆలోచన ఎవరిది!
గజల్‌ ‌శ్రీనివాస్‌ : ‌సభ్యుల మందరమూ మేధో మధనం చేస్తూ వుండగా, చర్చలలో ఆంధ్రము అంటే తెలుగు భాషకు పర్యాయపదం అని ఆలోచిస్తూ నేనే ‘‘ఆంధ్రమేవ జయతే’’ అనే టాగ్‌ ‌లైన్‌ ఉం‌టే బాగుంటుందని సూచన చేశా. అందరూ అభినందించారు. ఏంతో మంది పండితులూ హర్షం వ్యక్తం చేశారు. నాకు కూడా చాలా గర్వం గా అనిపించింది. ఆ నినాదం ఆంధ్ర వ్మాయ వైభవానికి స్ఫూర్తి దాయకంగా వుంటుందని మా అందరి అభిప్రాయం.
ప్రశ్న : అంతర్జాతీయ తెలుగు సంబరాల వివరాలు చెప్పండి!
గజల్‌ ‌శ్రీనివాస్‌: అం‌తర్జాతీయ తెలుగు సంబరాలు 2022 జనవరి 6,7,8 తేదీలలో కవిత్రయ వేదికపై ఘనంగా నిర్వహించనున్నాము.ఈ సంబరాలు రెండేళ్ల క్రితమే నిర్వహించాలి. కోవిడ్‌ ‌కారణంగా వాయిదా వేస్తూ వచ్చాము. ఇప్పడు కాస్త తగ్గుముఖం పట్టడం, 90శాతం వాక్సినేషన్‌ ‌పూర్తి కావడం తో ధైర్యంగా సంబరాలు నిర్వహించవచ్చు అన్న విశ్వాసంతో ముందుకు కదిలాం.ఆంధ్ర సారస్వతానికి చరిత్రలో ఏంతో కృషి చేసిన భీమవరంలో నిర్వహించాలి అన్న అందరి అభిప్రాయం తో ముందుకు సాగుతూ అన్ని విధాలా సౌకర్యాలు కలిగిన వెస్ట్ ‌బెర్రీ హై స్కూల్‌ను వేదికగా ఎంచుకుని,నాలుగువేలకు పైగా ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చేలా సంబరాల ప్రాంగణాన్ని రూపొందిస్తున్నా ము. ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి సభ్యులందరికి బాధ్యతలు అప్పగించడం జరిగింది.
ప్రశ్న : సంబరాల ప్రధాన లక్ష్యం ఏమిటి !?
గజల్‌ ‌శ్రీనివాస్‌: ఆం‌ధ్ర వ్మాయం యొక్క ఉజ్వల భవిష్యత్‌ ‌మా లక్ష్యం. గత వైభవాన్ని అమృత వైభవం గా ఎలా చేయాలి ! రాబోయే తరాలకు ఈ తెలుగు భాషను, పక్రియలను మహోన్నతం చేసి అందించాలన్నది మా ఆశ. అందుకే ఈ తెలుగు సంబరాల నిర్వహణ.
ప్రశ్న : సంబరాల రూపం ఎలా వుండబోతోంది ?
గజల్‌ ‌శ్రీనివాస్‌ : అనేక సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము. సదస్సులలో గత వైభవం గురుంచి ఎక్కువ చర్చ లేకుండా, ప్రతీ పక్రియను ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలి! వనరులు ఏమిటి! సమీకరణ ఎలా! ప్రతి జిల్లాలో తెలుగు భాషా వికాసం, దానికి తగ్గ వేదికలు ఏర్పాటు, సామాజిక మాధ్యమాల ఏర్పాటు, సరి కొత్త సాంకేతిక పరిజ్ఞాన అవగాహన ఇలా ఎన్నో అంశాలపై సదస్సులలో చర్చలు జరుగనున్నాయి. అమెజాన్‌, ‌ఫ్లిప్కార్ట్ ‌లాంటి సంస్టలతో సంప్రదింపులు జరిపి వారిని ఆహ్వానిస్తున్నాము. వారి సేవలు తెలుగు భాషా వికాసానికి, ఆన్‌ ‌లైన్‌ ‌లో గ్రంధాల అమ్మకాలు, సదుపాయాలు వంటి విషయాలపై అవగాహన కలిగిస్తాము.
ప్రశ్న : ఏ ఏ పక్రియలపై సదస్సులు వుంటాయి?
గజల్‌ ‌శ్రీనివాస్‌: అవధానం, పద్యం, గద్యం, కథ-నవల, నాటకం, సంపాదకీయం, వాగ్గేయకార, ప్రదర్శనాత్మక, ఆధునిక, జానపద, బాల, చలనచిత్ర, హాస్య వ్యంగ్య సాహిత్యాలు ఇలా మరికొన్ని కలిపి ఒకే వేదికపై 2022 జనవరి 7,8 తేదీల్లో మునుపటి, నేటి తరం లబ్ధ ప్రతిష్టులతో నిర్వహిస్తాము.ఒక్కో సదస్సు ఒక గంట పది నిమిషాల నిడివి వుంటుంది. ప్రతి సదస్సు ఆయా పక్రియల భవిష్యత్‌ ‌కు మార్గదర్శనం చేస్తాయి. ఎప్పటికప్పుడు యువతకు తెలుగు సాహిత్యం లొ తర్ఫీదు ఇచ్చె దిశగా ప్రణాళికను రూపొందిస్తాయి.
ప్రశ్న :ఈ అంతర్జాతీయ సంబరాలకు ఏ ఏ దేశాలనుండి, ప్రాంతాల నుండి ప్రతినిధులు వస్తున్నారు ?
గజల్‌ ‌శ్రీనివాస్‌: అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ‌దుబాయ్‌, ‌షార్జా, అబుదాబి, బహరైన్‌, ‌ఖతార్‌, ఒమాన్‌, ‌కువైట్‌, ‌సింగపూర్‌, ‌మలేషియా, మారిషస్‌, ‌డెన్మార్క్, ఇం‌డోనేషియా, జర్మనీ, ఐర్లాండ్‌, ‌యునైటెడ్‌ ‌కింగ్డమ్‌, ఆ‌ఫ్రికా , టాంజానియా, ఉగాండా, కెన్యా, ఫిలిఫైన్స్, ‌జపాన్‌ ‌నుండి తెలుగు సంఘాల ప్రతినిధులు వస్తున్నారు.
ఆలాగే బెంగళూరు, మైసూర్‌, ‌బళ్ళారి, హోస్పెట, హోసూర్‌, ‌చెన్నై, కోయంబత్తూరు, అహ్మదాబాద్‌, ‌బరంపురం, ఖరగపూర్‌, ‌లక్నో, వారాణాసి, ముంబై, పూణే, నాసిక్‌, ‌త్రివేండ్రమ్‌, ‌కొచ్చిన్‌, ‌మంగళూరు, చండీగఢ్‌, ‌ఢిల్లీ, హర్యానా, భోపాల్‌, ‌డెహ్రడూన్‌ ఇలా అనేక తెలుగు సంఘాల ప్రతినిధులు తెలుగు రాష్ట్రేతర సంఘాల సమాఖ్య సమన్వయం తో హాజరవుతున్నారు .
ప్రశ్న :ఈ సంబరాలలో ప్రత్యేక అంశాలు ఏమిటి!?
గజల్‌ ‌శ్రీనివాస్‌: ‌తెలుగు సంబరాల సన్నాహాల సంబరాన్ని జనవరి 3న తెలుగు వైభవ శోభా యాత్ర ద్వారా ప్రజల్లో అవగాహన, ఉత్సాహాన్ని నింపబోతున్నాము.విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానంద స్వామి వారి చేతుల మీదుగా శోభా యాత్ర ప్రారంభం అవుతుంది. తెలుగు సాహిత్య పక్రియల 20 శకటాలను ఆకర్షణీయమైన సమాచా రం తో అలంకరించి , తప్పేటగుళ్లు, కోలాటం, సంచార జాతుల కళా రూపాల ప్రదర్శనలతో భీమవరం పురవీధులలో శోభా యాత్ర సాగుతుంది. ఇది ఎంతో విశేషంగా వుండబోతోంది. అలాగే, సంబరాల్లో తెలుగు భాషలోని వివిధ ప్రకీయ ల పై ప్రముఖులు అందించిన వ్యాసాల సంచిక ‘‘ ఆంధ్ర వ్మాయ వైజయంతి’’ గ్రంథ ఆవిష్కరణ వుంటుంది. ఇది ఒక అరుదైన గ్రంధం కాగలదు. పొన్నపల్లి రామారావు, రాయప్రోలు భగవాన్‌,‌కడిమిళ్ల వరప్రసాద్‌ ‌గురు సహస్రావధాని, రెడ్డప్ప ధవెజి లు ఈ సంచికను అద్భుతంగా రూపొందిస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు.
ప్రశ్న : పురస్కారాలు ఏమైనా ఉన్నాయా?
గజల్‌ ‌శ్రీనివాస్‌: ‌భలే గుర్తు చేసారే ! జనవరి 6 సాయంత్రం డాక్టర్స్ ‌కాలనీలోని కళా ప్రాంగణంలో ఒక ప్రత్యేక కార్యక్రమంలో తెలుగును అభివృద్ధి చేసిన రాజవంశీయుల వారసులకు, మునుపటి ప్రముఖ కవుల కుటుంబీకులకు, కొన్ని తెలుగు సంఘాల ప్రతినిధులకు,చిన్న పత్రికలకు,కొన్ని తెలుగు సామాజిక మాధ్యమాల సమూహాలకు ‘‘ ఆంధ్ర వ్మాయ పూర్ణకుంభ పురస్కరాలు’’ అందజేస్తున్నాము.
ప్రశ్న :అతిథులు ఎవరు వస్తున్నారు!?
గజల్‌ శ్రీ‌నివాస్‌ : ‌విశాఖ శారదా పీఠం స్వామి వారు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారి మంగళాశాసనాలతో సంబరాలు జనవరి 7 వ తేదీ ప్రారంభమవుతాయి. తెలుగు తేజాలు ఉపరాష్ట్రపతి ఏం.వెంకయ్య నాయుడు గారిని, సుప్రీంకోర్ట్ ‌ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ఎన్‌.‌వి రమణ,ఆంధప్రదేశ్‌ ‌గవర్నర్‌ ‌బిశ్వభూషణ్‌ ‌హరిచందన్‌, ‌మిజోరం గవర్నర్‌ ‌కె.హరిబాబు, హర్యానా గవర్నర్‌ ‌బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి, అంధ్ర ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వై.ఎస్‌.‌జగన్మోహన్‌ ‌రెడ్డి,తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖరరావులకు ఆహ్వాన లేఖలు పంపాం. వారి సమ్మతి కోసం ఎదురు చూస్తున్నాము. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ సంబరాల్లో వారు అందరూ పాల్గొంటారని మా విశ్వాసం.ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర మంత్రులను, రాష్ట్ర అధికార భాష అధ్యక్షులను, తెలుగు అకాడమీ అధ్యక్షులను, సాహిత్య అకాడమీ అధ్యక్షులను.పార్లమెంట్‌ ‌సభ్యులను, శాసనమండలి సభ్యులను, ప్రజాప్రతినిధులను, వివిధ రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించాము. చలనచిత్ర, చిన్నితెర ప్రముఖులను కూడా ఆహ్వానించాము. ప్రముఖ కళాకారులను ప్రదర్శనలకై తెలుగు రాష్ట్రాల నుండి ఆహ్వానించాము.. కవి సమ్మేళనం రెండు రోజులూ ఏర్పాటు చేసాము.
ప్రశ్న : పాల్గొనేవారు ఎలా నమోదు చేసుకోవాలి?
గజల్‌ ‌శ్రీనివాస్‌: ‌మా వెబ్సైట్‌ ‌ద్వారాగాని,వాట్సాప్‌ ‌నెంబర్‌…8125955633‌కుగాని డిసెంబర్‌ 25 ‌లోపు సమాచారం ఇచ్చి నమోదు చేసుకోవచ్చు.
ప్రశ్న : వచ్చే ప్రతినిధులకు వసతి, బస ఏర్పాట్లు ఎలా ?
గజల్‌ ‌శ్రీనివాస్‌: ‌భీమవరం పట్టణం చిన్నది అయినా అతిధులకు హోటళ్ల సదుపాయం, రిజిస్ట్రేషన్‌ ‌చేయించుకు న్న వారికి వివిధ కళాశాల, విద్యాలయాల హాస్టల్‌ ‌వసతి సౌకర్యం మహిళలకు, పురుషులకు వేరు వేరుగా ఏర్పాటు చేస్తున్నాము. 70 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రదేశాలనుండి వచ్చె వారికి రోజూ వెళ్లి రావడం కోసం ఆయా రూట్లలో స్కూల్‌ ‌బస్‌ ‌లు ఏర్పాటు చేస్తున్నాము.ఎన్నో ప్రైవేట్‌ ‌స్కూల్‌ ‌యాజమాన్యాలు ఈ సేవకు ముందుకు రావడం గర్వకారణం.
ప్రశ్న :భోజన సదుపాయాలు ఏ విధంగా చేస్తున్నారు?
గజల్‌ ‌శ్రీనివాస్‌: ‌భీమవరం పట్టణం అతిద్యానికి గొప్ప పేరు. 7,8 తేదీలు ఆల్పాహారం, లంచ్‌, ‌డిన్నర్‌ ‌లు ఘనంగా ఏర్పాటు చేస్తున్నాము.పలు శాఖాహారా ఆంధ్ర వంటకాలను రుచిగా అతిథులకు అందించనున్నాము. అనుభవజ్ఞులు మా ఉపాధ్యక్షులు మేడికొండ శ్రీనివాస్‌ ‌గారి నేతృత్వంలో తెలుగు వంటకాలు అందరినీ అలరించనున్నాయి.
ప్రశ్న: ఇంత ఘనంగా నిర్వహిస్తున్న సంబరాలకు నిధులు ఎలా ?
గజల్‌ ‌శ్రీనివాస్‌: ‌తెలుగు భాష ప్రజలది. వారి సౌజన్యం తోనే జరుగుతున్నాయి. ప్రభుత్వం నుండి ఏమీ ఆశించకుం డా ఎంతో మంది వదాన్యుల సహృదయం తో ఈ సంబరాలు నిర్వహిస్తున్నాము. ఆ మూడు రోజులు భీమవరం పట్టణాన్ని తెలుగు వెలుగులతో అలంకరణ చేయనున్నాము. గొప్ప ప్రచారం చేస్తాము. ఇప్పటికే పలు పత్రికల సహకారంతో గొప్పగా ప్రచారం జరుగుతోంది.ఇది పెద్ద తెలుగు పండుగ. ఇది వరుకెన్నడూ జరుగనట్లుగా నిర్వహిస్తు న్నాము. ప్రతి రెండు ఏళ్లకూ ఒక్కసారి వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తాము. 2024లో విశాఖపట్నంలో, 2026 కడపలో నిర్వహిస్తాము.ఇప్పటికే అన్ని జిల్లాల్లో, వివిధ రాష్ట్రాలలో ఆంధ్ర సారస్వత పరిషత్‌ ‌శాఖలను ఏర్పాటు చేసాము. అనేక దేశాలలో ఏర్పాటు చేయనున్నాము. తెలుగును అమ్మ ఒడి భాష గా ముందుకు తీసుకు వెళతాము.ప్రతి నెల ఒక్కొక్క జిల్లాలో ఒక్కో పక్రియపై రెండు రోజుల సదస్సుల ఏర్పాటు కు ఇప్పటినుండే సన్నాహాలు చేస్తున్నాము.రాయప్రోలు భగవాన్‌ ‌సంబరాల కార్యదర్శిగా వున్నారు.వందలమంది ఉత్సవ కమిటీ సభ్యులు అహర్నిశలు కష్టించి సంబరాల విజయం కోసం కృషి చేస్తున్నారు. వారికి పాదాభివందనం.