రైతుబంధు ‘సాయం’..రైతన్నకు ‘వరం’
- రైతుబంధు సాయంతో అన్నదాతల ఆనందం
- ఏటా కొనసాగుతున్న పథకంతో రైతులకు ఆసరా
- ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన దిగుబడులు
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అభివృద్దికి బాటలు వేస్తున్న తరుణంలో కెసిఆర్ మదిలో పుట్టిన ఆలోచనే రైతుబంధు పథకంలాంటి ఆటంకాలు లేకుండా దానిని సాకారం చేయడమే గాకుండా నిరాఘాటంగా రైతులకు పెట్టుబడి సాయం అందేలా చేస్తున్నారు. జనాభాలో 70శాతం ఉన్న రైతన్నల కష్టాలు తెలిసిన నాయకుడిగా చేస్తున్న ఆలోచనలు, కార్యక్రమాలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్న వేళ రైతుబంధు అమలు అయ్యింది. ఎవరి ఊహలకు కూడా తట్టని విధంగా రైతులకు పెట్టబడి పథకం రైతుబందు పథకాన్ని ప్రకటించడం, వేలాదిగా రైతులకు చెక్కులను పంపిణీ చేయడం..వారు డబ్బులను డ్రా చేసుకోవడం ఏటా సాగిపోతోంది. తాజాగా మరోమారు రైతులకు పెట్టుబబడి సాయం ఖాతాల్లో జమ అవుతోంది. ఇది కలా నిజమా అన్న రీతిలో ఏటేటా దీనిని కొనసాగి స్తున్నారు. రైతు సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చిన సీఎం కేసీఆర్.. దేశ వ్యవసాయ రంగ చరిత్రలోనే పెను సంచలనమైన రైతుబంధు పథకాన్ని ప్రకటించారు. సాగుపెట్టుబడి కోసం రైతుకు నేరుగా ఎకరానికి రూ5వేలు ఇస్తామని ప్రకటించి అమలు చేస్తున్నారు. దేశ రైతాంగం సంబురపడిపోతే.. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇదెలా సాధ్యమంటూ తెలంగాణ వైపు దృష్టి సారించారు. సీఎం కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం ఈ వానకాలం పెట్టుబడి కోసం ప్రతి రైతుకు సకాలంలో ఎకరాకు రూ.5వేల సాయం కచ్చితంగా జమ అవుతోంది.మనకింత అన్నం పెడుతున్న అన్నదాత భుజం తడితే చాలు.. ఇంకా కష్టపడ తాడు.. కాయకష్టం చేసి కనీస మద్దతు దరకోసం చూస్తున్న రైతులకు పెట్టుబడి సాయం ఎంతోకొంత అందితే అంతకన్నా కావాల్సిందేముంది. ఇప్పుడదే జరుగుతోంది. రైతును వెన్నుతట్టి ముందుకు నడిపించే మహానాయకుడిగా తెలంగాణలో కెసిఆర్‌ను రైతులంతా ఆశీర్వదిస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు పలు కీలక నిర్ణయా లు ఇప్పుడు ఇతరులకు ఆదర్శం కాబోతున్నాయి. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్న నినాదంతో ముందుకు సాగుతూ అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, వాటిని శరవేగంగా ఓ వైపు పూర్తి చేయిస్తూనే ..మరో వైపు రైతుల కోసం చేపట్టిన రైతుబంధు పథకం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయేలా చేశారు. అందుకే ఎవరు కూడా దీనిని విమర్శించడానికి ఆస్కారం లేకుండా అమలు చేశారు. మాక్కూడా అమలు చేయాలని కౌలు రైతులు తదితరులు అడుగుతున్నారే తప్ప విమర్శించడం లేదు. ఇప్పటికే మిషన్ కాతీయతో చెరువుల పునరుద్దరణ అన్న మహాయజ్ఞం నడుస్తోంది. దీంతో ఎప్పుడూ లేని విధంగా వేలది చెరువులు మళ్లీ జలకళ సంతరించు కున్నాయి. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు రాబోతున్నది. ఇకపోతే నిరంతర విద్యుత్‌తో అటు ప్రజలను, ఇటు రైతులను ఆశ్చార్యానికి గురి చేశారు. అలాగే ప్రాజెక్టులను శరవేగంగా నడిపిస్తూ కృష్ణా, గోదావరి నదులను తెలంగాణ భూములకు చేరేలా చేస్తున్నారు. ఈ దశలో రైతులకు అండగా వారి వ్యవసాయంలో సాయం చేసే పథకంగా ఇది ఆదరణకు నోచుకుంది. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా చూడాలన్న కల సాకారం దిశగా సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటూ ముందుకుసాగుతున్న తీరు అందరినీ అధ్యయనం చేసేలా చేస్తోంది. తొలుత మిషన్ కాకతీయ పథకంతో చెరువుల్లో పూడిక తీయించి భూగర్భ జలాల స్థిరీకరణపై దృష్టిపెట్టారు. బోర్లకింద ఎక్కువ సాగు భూమి ఉన్నందున రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా అందిస్తున్నారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నారు. యాంత్రీకరణకు పెద్దపీట వేస్తూ ఆధునిక వ్యవసాయం వైపు మళ్లించారు. రైతులకు సాంకేతిక అంశాల్లో అండగా ఉండేలా ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించారు. గోదాంల నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టారు. వ్యవసాయ బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ యాంత్రీకరణకు నిధులను ఏటా పెంచుతూ వస్తున్నారు. అడ్డగోలు ఎరువుల వినియోగాన్ని తగ్గించడంతో పాటు రైతు పొలానికి ఏ పోషకాలు ఎంత అవసరమో తెలియజేసే అత్యంత ముఖ్యమైన భూసార పరీక్ష కార్డుల పంపిణీపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. భూసార పరీక్షలు చేయించి రైతులకు భూసార పరీక్ష ఫలితాల కార్డులను అందజేసే కార్యక్రమం కొనసాగుతున్నది. రాష్ట్ర వ్యవసాయరంగం మరింత పురోగతి సాధిస్తుందనడంలో సందేహం లేదు.
పెరిగిన పంట పెట్టుబడులతో రైతుల్లో ఆందోళన…
నిజామాబాద్ జిల్లాలో ఏటా పసుపు,మిర్చి, మక్కజొన్న పంటలు పండించిన రైతులు అమ్మకాలు సక్రమంగా లేక..ఉన్నా గిట్టుబాటు ధరలు రాక నానా యాతన పడుతున్నారు. దీనికితోడు పెట్టబుడుల పెరగడంతో దిగుబడుల సమయంలో గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. జిల్లాలో వానాకాలం సాగు రైతులపైన అధికభారం మోపుతోంది. ఈ యేడాది విత్తనాలపై సబ్సిడీ ఎత్తివే యడంతో రైతులపైన అదనపు భారం పడింది. సోయా బీన్ విత్తనాల బ్యాగును సబ్సిడీతో రూ.1,100 నుంచి రూ.1,300లోపు ధరకు కొనుగోలు చేయగా.. ఈ వానాకాలంలో రూ.3వేల నుంచి రూ.3,500ల వరకు వెచ్చించారు. వరితో పాటు ఇతర విత్తనాలకు కూడా రేట్లు పెంచడంతో రైతులపై అధికభారం పడింది. కరోనాతో కూలీల రేట్లు కూడా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం తో ఆ ప్రభావం వ్యవసాయంపై పడింది. డీజిల్ రేట్లు పెరగడంతో ట్రాక్టర్ యజమానులు రేట్లు పెంచారు. ఒకేసారి అన్ని రేట్లు పెరగడంతో రైతులు పెట్టుబ డులకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. అడపాదడపా ఆందోళనలు చేస్తున్నారు. పసుపు గిట్టుబాటు కోసం చేసిన ఆందోళనలు అలాగే ఉన్నాయి. తాజాగా వానాకాలం సాగు మొదలైంది. జూన్ ఆరంభం నుంచి వర్షాలు కురుస్తుండడంతో రైతులు విత్తనాలు వేయనారంభించారు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో 5లక్షల పైచిలుకు ఎకరాలలో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో ఇప్పటివరకు పసుపు, సోయా, మొక్కజొన్న, కంది, పెసర పంటలతో పాటు వరినాట్లు వేస్తున్నారు. వరి నాట్లు వేస్తుండగా ఇతర మండలాల్లో నారు మడులను సిద్ధం చేస్తున్నారు. ఈ వానాకాలంలో దుక్కులు దున్నేందుకు, విత్తనాల కొనుగోలు, కూలీల వరకే ఎకరాకు గత సంవత్సరం కం టే రూ.1,500 నుంచి రూ.2వేల వరకు అదనపు భారం పడుతోంది. రైతులకు ప్రభుత్వం నుంచి ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుబంధు అందుతున్నా పెరిగిన ధరలతో పెట్టుబడులకు సరిపోవడం లేదు. ఈ యేడు బ్యాంకుల నుంచి రుణాలు కూడా ఇవ్వడంలేదని అంటున్నారు. జిల్లా రుణా ప్రణాళికను ఇంకా ఖరారు చేయలేదు. కరోనాతో కొన్ని బ్యాంకులలో వాయిదా వేశారు. రైతులు మాత్రం పెట్టుబడుల కోసం వ్యాపారులు, ఇతరుల నుంచి అప్పులు తెచ్చు కుంటున్నారు. అన్ని ధరలు పెరగడంతో రైతుకు పెట్టుబడి పెరిగింది.