ధరల పెరుగుదలతో సామాన్యుల విలవిల

  • పెరుగుతున్న చమురు,వంట గ్యాస్‌ ‌ధరలు
  • లాక్‌డౌన్‌ ‌పేరిట వ్యాపారుల మాయాజాలం
  • బ్లాక్‌మార్కెట్‌ ‌చేసి అధిక ధరలకు విక్రయాలు

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌పేదలు మరోమారు సమిధలు అవుతున్నారు. కరోనా వేళ వారే బలవుతున్నారు. వారి ఇళ్లే గుల్లవుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రాణాలను బలిగొనడమే కాకుండా ఎన్నో కుటుంబాలను ఆకలి కేకలతో అలమటించేలా చేస్తోంది. రెక్కాడితేకాని డొక్క నిండని సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతన్న వేళ ధరలదాడి రోకటిపోటులా మారింది. లాక్‌డౌన్‌ ‌వేళ ఉపాధి లేక అల్లాడుతున్న పేద ప్రజలపై ధరల పెరుగుదల రోజురోజుకూ మోయలేని భారంగా మారుతోంది. లాక్‌డౌన్‌ ‌వేళ వ్యాపారులు అడ్డంగా దోచు కుంటున్నారు. నిత్యావసర సరుకుల ధరలను ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతున్నా అడిగే వారు లేకుండా పోయారు. రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో జనం విలవిలలాడుతున్నారు. గడిచిన వారం రోజుల్లోనే లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ.99.09 పెరుగగా డీజిల్‌ ‌ధర రూ.93.67కు చేరింది. అలాగే వంట నూనెలు, గ్యాస్‌ ‌ధరలు అమాంతంగా పెరిగి వినియోగదారుల నడ్డివిరుస్తున్నాయి. ఒక పక్క కరోనా పరిస్థితులతో ఉపాధి లేక అల్లాడుతున్న ప్రజలపై ధరల పెరుగుదలతో మోయలేని భారం పడుతుంది. మొన్నటి వరకు రూ.850 ఉన్న గ్యాస్‌ ‌ధర ప్రస్తుం రూ.880కి చేరింది. అలాగే బియ్యం, నూనెలు, పప్పుల ధరలు అమాంతంగా పెరిగిపో వడంతో తక్కువ కొని సరిపెట్టుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధిక ధరలతో జనం గగ్గోలు పెడుతున్నా అధికారులు మాత్రం ధరల నియంత్రణకు కనీస చర్యలు తీసుకోవడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిత్యా వసర ధరలు చుక్కలు చూపుతున్నాయి. అవసరమైన డిమాండ్‌ ‌మేరకు అన్ని రకాల సరుకులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నా ధరలు మాత్రం భగ్గుమనడం అర్థం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో కొందరు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తూ అడ్డగోలుగా దండుకుంటున్నారు. ధరలకు అడ్డూ అదుపే లేకుండా పోవడంతో ప్రజలకు భారంగా మారింది. సెకండ్‌వేవ్‌లో ఎన్నో మిన హాయింపులను ఇస్తూ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధిస్తున్న ధరలు మాత్రం అదుపులోకి రావడం లేదు. ఉదయం పూట నాలుగు గంటలే మినహాయింపు ఇవ్వడంతో ఆదరబాదరగా సరుకులు కొనుగోలు చేయాల్సి రావడం వ్యాపారులకు వరంగా మారింది. ఏ మాత్రం ధరలను పరిశీలించకుండానే ప్రజలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అన్ని రకాల వ్యాపారాలు, సరుకుల రవాణాకు ప్రభుత్వం అనుమతించినా సరిపడా సరుకులు లేవంటూ వ్యాపారులు అధిక ధరలకు అమ్మేసుకుంటున్నారు. నిత్యావసర సరుకుల రవాణాపై లాక్‌డౌన్‌ ‌పరిస్థితుల ప్రభావం పడుతుందని వ్యాపారులు పేర్కొంటు తప్పించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల లోనూ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడంతో రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. వాహనాల అద్దె భారం, పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల పెరుగుదల, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను కారణంగా చూపుతున్నారు. లాక్‌డౌన్‌ ‌మొదలైనప్పటి నుంచి వివిధ సరుకుల పై ప్రత్యేక ధరలను విధిస్తున్నారు. కొందరు వ్యాపా రులు సిండికేటుగా మారి ధరలను నిర్ణయిస్తున్నారు. లాక్‌డౌన్‌లో సరుకుల రవాణాకు అదనంగా ఆర్థిక భారం పడుతుందని దీంతో ధరలను పెంచాల్సి వస్తుందంటున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం ధరలు తగ్గి పోయే అవకాశం ఉందంటున్నారు.వ్యాపారులు ఇష్టా రాజ్యంగా ధరలను నిర్ణయిస్తున్న అధికారులు మాత్రం ప్రేక్షక పాత్రలో కనిపిస్తున్నారు. తూనికలు, కొలతల అధికారులు పత్తా లేకుండానే పోవడంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. లాక్‌ ‌డౌన్‌ ‌విధిస్తున్నట్లు ముందస్తు సమాచారంతో సరుకులను బ్లాక్‌ ‌మార్కెట్‌లోకి తరలించి అమ్మేసుకుంటున్నారు. దీనికి తోడు వివాహాలు, శుభకార్యాలు కూడా జరుగడంతో భారీ డిమాండ్‌ ఏర్పడుతోంది.