కళతప్పిన పాతబస్తీ
కరోనా ప్రభావంతో ఐదు వేల కోట్ల రూపాయల వరకూ నష్టం అంచనా
- కరోనా దెబ్బకు ఇళ్లకే పరిమితమైన ముస్లిం సోదరులు..
- దుకాణాలన్నీ మూసివేతతో వ్యాపారులకు తీరని నష్టం
- నైట్ బజార్ సందడి మటుమాయం
- హలీం ప్రియులకు ఈ సారి నిరాశే…
- 3 వేల కోట్ల రూపాయల వస్త్ర అమ్మకాల పై ప్రభావం
- కనీస అవసరాల కోసం మాత్రమే సడలింపులు
- తీవ్రంగా నష్టపోయిన టైలర్లు, అత్తరు వ్యాపారులు
- సేమియా అమ్మకాలు లేక వ్యాపారుల గిలగిల
హైదరాబాద్: కరోనా దెబ్బకు రంజాన్ కళ తప్పింది. ఏడాది జరిగే వ్యాపారం కేవలం ఒక్క నెల రోజుల్లోనే జరిగే అద్భుత అవకాశం పై కరోనా నీళ్లు చల్లింది. హైదరాబాద్ నగరంలో రంజాన్ సందర్భంగా పాతనగరంలో భారీగా షాపింగ్ జరుగుతుంటుంది. ఈ 30 రోజుల వ్యవధిలో దాదాపు 5 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతుంది అయితే ఈ ఏడాది కోవిడ్ మహమ్మారి కారణంగా చరిత్రలోనే తొలిసారిగా రంజాన్ మార్కెట్ కళ తప్పింది. ఇఫ్తార్ విందులు, వస్త్రాలు, సూటళ్లు, అత్తరు పరిమళాలు, లాడ్ బజార్ గాజుల దుకాణాలు అన్నీ మూతపడ్డాయి దీంతో రంజాన్ ప్రారంభం అయినా మార్కెట్లన్నీ బోసిపోయాయి. పాతబస్తీలోని పటేల్ మార్కెట్, మదీనా మార్కెట్, రికాబ్ గంజ్, ఘాన్సీబజార్, చార కమాన్, హైకోర్టు రోడ్డు, పత్తర్ గట్టి, మీరాలంమండి తదితర ప్రాంతాల్లోని వస్త్ర వ్యాపారాలకు పెట్టింది పేరు . వీటి వ్యాపారం మామూలు కన్నా రంజాన్ నెలలో మూడు రెట్లు ఉంటుంది. అయితే కోవిడ్ మహమ్మారి దెబ్బకు ఇవన్నీ మూతపడ్డాయి. రంజాన్ మాసంలో ప్రతి ఏడాది వస్త్ర వ్యాపారాలు 3 వేల కోట్ల రూపాయలు జరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. ఇక చీరలు, వస్త్రాలకు పాతబస్తీలోని పటేల్ మార్కెట్ కేంద్రబిందువు. అయితే ఈ రంజాన్ మాసంలో వస్త్ర దుకాణాలు తెరుచుకునే పరిస్థితులు లేవు. దాదాపు 2 వేల వరకు ఇక్కడ దుకాణాలున్నాయి. దాదాపు 50 టెక్స్ టైల్స్ ఫ్యాక్టరీల అనుబంధ వ్యాపారాలు వుంటాయి. లాక్ డౌన్ కారణంగా కొత్త బట్టలు కుట్టించుకునేవారే కనిపించడంలేదు. దీంతో టైలర్లు ఉపాధి కోల్పోయారు. మక్కా మసీదు, లాడ్ బజార్, చార కమాన్, గుల్జార్‌హౌజ్, పత్తర్ గట్టి, మదీనా, నయాపూల్, బహదూర్‌పురా, శాలిబండ,శంషీర్ గంజ్ తదితర ప్రాంతాలలోని వ్యాపార కేంద్రాలన్నీ వెలవెలబోతున్నాయి. రంజాన్ మాసానికి రెండు నెలలకు ముందు నుంచే సేమియాల తయారీ కొనసాగుతుంది. గత నెల నుంచి లాక్ డౌన్ కొనసాగుతుండడంతో సేమియా తయారీకి అవసరమైన ముడిసరుకు లభించడం లేదని. ఈసారి సేమియా మార్కెట్లో అంతగా కనిపించకపోవచ్చంటున్నారు. అలాగే ఖర్జూరం కూడా ఇతర దేశాలనుంచి దిగుమతి అవుతుంది. కరోనాతో ఖర్జూరం దిగుమతులు దాదాపు పడిపోయాయి. సహర్, ఇఫ్తార్, తరావీలతో పాటు జుమ్మాకీ నమాజ్ లను ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలని ఇప్పటికే మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఉ త్తర్వులు జారీ చేసింది. రంజాన్ సందర్భంగా రంగురంగుల గాజులు లాడ్ బజార్లో అమ్ముతారు. ముస్లింలే కాదు ఇతర మతస్తులైన మహిళలు కూడా ఇక్కడి గాజులు కొనుగోలుచేస్తారు. ఈసారి మాత్రం గాజుల గలగలలు వినిపించడం లేదని వ్యాపారులే అంటున్నారు. నగర సాంస్కృతిక, చారిత్రక వైభవానికి ప్రతీక రంజాన్ పండగ. నెలవంక కనిపించిన రోజు నుంచి ముప్పై రోజుల దాకా నగరమంతా పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రత్యేకంగా పాతబస్తీ కళకళలాడుతుంది. ఎటు చూసినా హలీం బట్టీలు, అత్తరు వాసనల ఘుమఘుమలు.. లాడ్ బజార్ మట్టిగాజులు.. ఇఫ్తార్ విందులు.. ఇవీ.. పాతబస్తీ వీధుల్లో అంది మతసామరస్యపు పరిమళాలు.. ఈ నెలరోజుల సంబరం కేవలం ముస్లిం వర్గానికే కాదు ఇతర మతాలవారూ ఈ వేడుక కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తారు. కరోనా దెబ్బతో ఇప్పుడా పరిస్థితి మారింది. వీధులన్నీ బోసిపోయాయి. అంతా ఇళ్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఈ పరిస్థితి మార్కెట్లను నైరాశ్యంలోకి నెట్టింది. పాతబస్తీ మూగబోయింది పాతబస్తీలో ఐదురోజుల ముందే రంజాన్ సందడి ప్రారంభం అవుతుంది. చార్మినార్ పరిసరాల్లో రద్దీ మొదలవుతుంది. సుర్మా దుకాణాలు, జానిమా లు, ఖర్జూరాలు, పండ్ల దుకాణాలతో ప్రాంగణమంతా విపరీత రద్దీ ఏర్పడుతుంది. పటేల్ మార్కెట్ లోని వస్త్ర దుకాణాలు, లాడ్ బజార్ లోని మట్టి గాజుల అంగళ్లు కిటకిటలాడుతాయి. ఈ నెలరోజుల్లోనే ఇక్కడ రూ.వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. నగరం పై కొవిడ్-19 దెబ్బ ఇప్పుడు ఈ మార్కెట్లను కుదేలు చేసింది. ఎక్కడికక్కడ లాక్ డౌన్ విధించడంతో ఎవరూ బయటికి వచ్చే పరిస్థితి లేదు. పాతబస్తీ వాతావరణమంతా బోసిపోయింది. పర్వదినాన్ని ఇళ్లలోనే ప్రత్యేకంగా జరుపుకునేందుకు నగర ముస్లింలు సిద్ధమయ్యారు. మార్గదర్శకాలను ఇప్పటికే మత పెద్దలు జారీ చేశారు. అందుకు కట్టుబడే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇళ్లలో నమాజ్ చేయాలి నమాజ్ ఇళ్లలోనే చేసుకోవాలి. ఇంట్లోనూ ఎడం పాటించాలి. మక్కా మసీదులో నమాజ్ కు ఎవరికీ అనుమతి లేదు. సూపరింటెండెంట్ మరో నలుగురు సిబ్బంది మాత్రమే ప్రార్థనలు చేస్తారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఈసారి రంజాన్ మార్కెట్ కు అవకాశాలు లేవు. మార్కెట్లన్నీ బోసిపోయి కనిపించనున్నాయి. రంజాన్ మాసంలో సాధారణంగా అన్ని రకాల వ్యాపారాలు కలిసి దాదాపు 5 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ బిజనెస్ అంతా ఈ సంవత్సరం లాస్ అయినట్లే. పాతబస్తీలోని పటేల్ మార్కెట్, మదీనా మార్కెట్, రికాబ్ గంజ్, ఘాన్సీబజార్, చార్ కమాన్, హైకోర్టు రోడ్డు, పత్తర్ గట్టి, మీరాలంమండి తదితర ప్రాంతాల్లోని వస్త్ర వ్యాపారాలన్నీ దెబ్బతిననున్నాయి. రంజాన్ మార్కెట్ లో ప్రతి ఏడాది వస్త్ర వ్యాపారాలు 3 వేల కోట్ల రూపాయలు జరుగుతాయని ఇక్కడి వ్యాపారులు అంటున్నారు. మక్కా మసీదు, లాడ్ బజార్, చార కమాన్, గుల్జార్ హౌజ్, పత్తర్ గట్టి, మదీనా, నయాపూల్, బహదూర్‌పురా, శాలిబండ, శంషీర్ గంజ్ తదితర ప్రాంతాలలోని వ్యాపార కేంద్రాలన్నీ వెలవెలబోనున్నాయి. జానిమాజ్ మార్కెట్ కు బ్రేక్…. ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రాచుర్యంలో ఉన్న జానిమా లను పాతబస్తీ మదీనా సర్కిల్ లోని మహ్మద్ క్యాప్ మార్ (ఎంసీఎం) ఒకే వేదిక పైకి తీసుకు వచ్చి నెల రోజుల పాటు కొనసాగే అంతర్జాతీయ జానిమాజ్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచుతోంది. అయితే ఈసారి జానీమాజ్ ల మార్కెట్ పై కరోనా ప్రభావం పడింది. లక్షలాది రూపాలయల వ్యాపారం దెబ్బతింటోంది. దీంతో పాటు కుర్తా, ఫైజామా, టోపీలను కూడా మార్కెట్లలో అందుబాటులో ఉండేవి. ఇవేవీ ఈసారి రంజాన్ మాసంలో కనిపించవు. సేమియా మార్కెట్ కు కష్టకాలం నిజానికి రంజాన్ మాసానికి రెండు నెలలకు ముందు నుంచే సేమియాల తయారీ కొనసాగుతుంది. గత నెల నుంచి లాక్ డౌన్ కొనసాగుతుండడంతో సేమియా తయారీకి అవసరమైన ముడిసరుకు లభించకపోవడంతో సేమియా తయారీ నిలిచిపోయింది. ఈసారి రంజాన్ పండుగకు సేమియా మరింత డిమాండ్ అయ్యే పరిస్థితులున్నాయి.