భారత్ లో 543 మరణాలు..

17 వేల కేసులు 80 శాతం మందిలో కనిపించని కరోనా వైరస్ లక్షణాలు

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి ఇటు భారత్ లోనూ తన ప్రతాపాన్ని రోజు రోజుకీ ఉద్ధృతం చేస్తోంది. గత 24 గంటల్లో 1,533 కొత్త కేసులు నమోదుకావడంతో దేశంలో వైరస్ బారినపడ్డవారి సంఖ్య 17,265కు పెరిగింది. ఇక కొత్తగా 36 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 543కు చేరింది. ఇప్పటి వరకు 2,546 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని ఇళ్లకు చేరారు. మరో 14,175 మంది ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు. ఇక అత్యధిక కేసులు ఉన్న మహారాష్ట్రలో వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. అక్కడ ఇప్పటి వరకు 4,203 కేసులు నమోదయ్యాయి. వీరిలో 507 మంది కోలుకోగా.. మరో 223 మంది మృతిచెందారు. ఇక దిల్లీలో 2,003 కేసుల్ని నిర్ధారించారు. 72 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 45 మంది ప్రాణాలొదిలారు. ఇటు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 858 కేసులు నిర్ధారణ కాగా, 21 మంది మరణించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కేసుల సంఖ్య 647కు పెరిగింది. 18 మంది మరణించారు. ఇక ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ నుంచి నాన్ కంటైన్మెంట్ జోన్లకు ఆంక్షల నుంచి స్వల్ప మినహాయింపులు ఇవ్వనున్న విషయం తెలిసిందే. అయితే, వైరస్ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణ, దిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. దేశంలోని కొవిడ్-19 బాధితుల్లో 80 శాతం మందిలో లక్షణాలేమీ కనిపించడం లేదని ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగాబేడ్కర్ అన్నారు. ఇది కలవర పెట్టే అంశమని ఆయన పేర్కొన్నారు. ’80 శాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదు. అలాంటి వారిని ఎలా గుర్తించాలన్నదే మా ఆందోళన. కాంటాక్టులను వెతికి పట్టుకోవడం మినహా మరో అవకాశం లేదు’ అని గంగాఖేడ్కర్ అన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల సంఖ్య 17,000 దాటేసింది. 543 మంది వ్యాధితో చనిపోయిన సంగతి తెలిసిందే. లక్షణాలు కనిపించని వారిని గుర్తించడం చాలా కష్టమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పాజిటివ్ గా తేలినవారి కాంటాక్టులను గుర్తిస్తున్నామని వెల్లడించారు. అందరినీ పరీక్షించడం కుదరని స్పష్టం చేశారు. కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం లేదని భావిస్తున్నామన్నారు. మే రెండో వారానికి దేశం ఏ పరిస్థితుల్లో ఉందో తెలుస్తుందని వివరించారు. పరీక్షల వ్యూహంలో మార్పులేమన్నా చేస్తారా అని ప్రశ్నించగా ‘ఏం మార్పు చేయాలి? అందుకు అవకాశం లేదు. ఏ ప్రదేశంలో వైరస్ సోకిందో లేదా హాట్ స్పాట్లలో ఇన్ ఫ్యూయెంజా తరహా లక్షణాలను పరీక్షించాలి. మున్ముందు ఏం చేస్తామన్నది ఇప్పుడే చెప్పలేం’ అని గంగాబేడ్కర్ అన్నారు.