అలాంటప్పుడు మేం ఎందుకు?!

లాక్ డౌన్ సడలింపుల పై రాష్ట్రాల వైఖరి పై కేంద్రం అసహనం

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా హాట్ స్పాట్ కాని ప్రాంతాల్లో లాక్ డౌన్ మినహాయింపులు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర మోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా మరో లేఖ రాశారు. ఈ నెల 15న జారీ చేసిన మార్గదర్శకాలను తప్పక పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. లాక్ డౌన్ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారం అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు. అత్యవసరం కాని సేవలు, కార్యకలాపాలకు పలు రాష్ట్రాలు అనుమతిస్తున్నట్లు సమాచారం వస్తోందన్నారు. దేశమంతా విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాలు పాటించాలని ఆదేశించిన కేంద్ర హెూంశాఖ.. రాష్ట్రాలు అనుసరించాల్సిన వైఖరి పై గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తుచేసింది. ఎవరికి వారి నిర్ణయాల వల్ల దేశమంతా నష్టపోయే పరిస్థితి రాకూడదని హెచ్చరించింది. రెస్టారెంట్లకు, బస్సు సర్వీసులకు అనుమతిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై కేంద్ర హోంశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ప్రత్యేకంగా హోం శాఖ కార్యదర్శి లేఖ రాశారు. అత్యవసరం కాని సేవలకు అనుమతివ్వడం పై అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ముంబయి, పుణె, ఇండోర్, జైపుర్, కోల్‌కతా, పశ్చిమ్ బంగాలోని మరికొన్ని ప్రాంతాల్లో కొవిడ్-19 పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘిస్తే, సరైన చర్యలు తీసుకోకుంటే నావెల్ కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తుందని హెచ్చరించింది. కొవిడ్-19 పై పోరాడుతున్న వైద్యులు, వైద్య , సహాయకులపై దాడులు చేస్తున్నారని, వ్యక్తిగత దూరం నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఘటనలను ఉదహరిస్తూ కేంద్ర హెూం మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. వెంటనే వీటిని అడ్డుకోవాలని సూచించింది. సోమవారం మధ్యాహ్నానికి దేశంలో 17,265 మందికి కొవిడ్ సోకగా 543 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్, మహారాష్ట్రలోని ముంబయి, పుణె, రాజస్థాన్‌లోని జైపుర్, పశ్చిమ్ బంగాలోని కోల్ కతా, హౌరా, తూర్పు మేదినిపుర్, ఉత్తర 24 పరగణాలు, డార్జిలింగ్, కలింపాంగ్, జల్ పాయ్ గుడిలో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉ 0దని కేంద్రం తెలిపింది. ‘లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని నివేదికలు అందాయి. ఇది ప్రజారోగ్యానికి ప్రమాదకరం. వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంది’ అని వెల్లడించింది. ఒక్క మహారాష్ట్రలోనే 4,203 కొవిడ్-19 కేసులు నమోదవ్వగా 223 మంది మరణించారు. రాజస్థాన్లో 1,478 (14 మరణాలు), పశ్చిమ్ బంగాలో 339 (12 మరణాలు) కేసులు నమోదవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రమాదకర ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించేందుకు ఆరు అంతర్ మంత్రిత్వ కేంద్ర బృందాలు (ఐఎంసీటీ) ఏర్పాటు చేశామని కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ్ బంగాలో వీరు అవసరమైన దిశానిర్దేశం చేస్తారని వెల్లడించింది. ప్రజా ప్రయోజనార్థం ఈ బృందాలు తమ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తాయని స్పష్టం చేసింది. ‘మార్గనిర్దేశాల ప్రకారం లాక్ డౌన్ నిబంధనల అమలు, నిత్యావసర సరుకుల పంపిణీ, వ్యక్తిగత దూరం, వైద్యపరమైన మౌలిక సదుపాయాల సంసిద్ధత, వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత, సహాయ కేంద్రాల్లో కూలీలు, పేద ప్రజల యోగ క్షేమాలను ఈ బృందాలు పర్యవేక్షస్తాయి’ అని కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడులో వైద్యసిబ్బంది, పోలీసుల పై దాడి ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.