భాగ్యనగరం భయం భయం!
హాట్ స్పాట్స్ లో అంతకంతకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
- జీహెచ్ఎంసీ పరిధిలో 280కి పైగా కేసులు నమోదు
- 12 హాట్ స్పాట్ కేంద్రాలలో తనిఖీలు ముమ్మరం
- నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్ సీరియస్
- సగటున 30 కేసులు ఒక్క గ్రేటర్ పరిధిలోనే
- అధికారుల వెన్నులో వణుకు
- సైబరాబాద్ పరధిలో 39 కంటైన్మెంట్ జోన్లు
- హైదరాబాద్ పరిధిలో 126కు పైగా కంటైన్మెంట్ జోన్లు
- హాట్ స్పాట్ గా గుర్తించిన ప్రాంతాలలో కఠినంగా నిషేధాజ్ఞలు
హైదరాబాద్: కరోనా వైరస్ హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తోంది. హాట్ స్పాట్లలో పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అధికారుల వెన్నులో చలి పుట్టిస్తోంది. నియంత్రణా చర్యలు నగరంలో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. మరిన్ని పకడ్బందీ చర్యలకు ఆదేశించారు. ముఖ్యమంత్రి సీరియస్ కావడంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రేటర్లో పాజిటివ్ కేసులేకాదు అనుమానితుల సంఖ్య కూడా పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో 12 హాట్ స్పాట్స్ గుర్తించి కాంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. ఆయా ప్రాంతాల నుంచి ప్రజలకు బయటకు వెళ్లకుండా, ఇతరులు లోపలికి రాకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. దరాబాద్ లోని రాంగోపాల్ పేట్, షేక్ పేట్, రెడ్ హిల్స్, మలక్ పేట్ సంతోష్ నగర్, కూకట్ పల్లి, యూసుఫ్ గూడ, చందానగర్, మూసాపేట్, కుత్బుల్లాపూర్ గాజులరామారం, అల్వాల్, మయూరినగర్, చాంద్రాయణగుట్ట వంటి 12 ప్రాంతాలను కరోనా హాట్ స్పాట్స్ గా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం… వీటిని కంటైన్ మెంట్ క్లస్టర్స్ గా ప్రకటించింది. రెండు రోజుల క్రితమే ఖాళీ అయిన క్వారంటైన్ సెంటర్లు అనుమానితులతో మళ్లీ నిండుకుంటున్నాయి. విదేశాల నుంచివచ్చిన వారు సహా మర్కజ్ వెళ్లి వచ్చిన వారందనీ ఇప్పటికే క్వారంటైన్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 280కి పైగా కేసులు నమోదు కాగా, వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యుల నుంచి 50 కేసులు నమోదైతే.. మిగితా మర్కజ్ బాధితులు, వారికి సన్నిహితంగా మెలిగిన వారివే. వైరస్ ఇంకుబేషన్ పీరియడ్ కూడా అయిపోయినట్లు ప్రభుత్వం భావించింది. క్రమంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని భావించింది. కానీ అనూహ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. సోమవారం 61 కేసులు నమోదు కాగా, వీటిలో 35 కేసుల వరకు గ్రేటర్లోనే ఉన్నట్లు తెలిసింది. ఒకవైపు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం, మరో వైపు దగ్గు, జలుబు, జ్వరం వంటి అనుమానిత లక్షణాలతో బాధపడుతూ క్వారంటైన్ సెంటర్లకు చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మంగళవారం చార్మినార్ యునానీ ఆస్పత్రి ఐసోలేషన్ సెంటర్లో 93 మంది చేరగా, ఫీవర్ ఆస్పత్రిలో 19 మంది చేరారు. ఎర్ర గడ్డ ఛాతీ ఆస్పత్రిలో ప్రస్తుతం 28 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 11 మంది పాజిటివ్ బాధితులు ఉన్నారు. ప్రస్తుతం గాంధీలో మరో 472 మందికి పైగా పాజిటివ్ కేసులకు చికిత్సలు అందుతున్నాయి. రాజధాని పరిధిలోని సైబరాబాద్లో 39 కంటైన్మెంట్ జోన్స్ గుర్తించారు. ఈ జోనక్కు రాకపోకలను పూర్తిగా నిషేధించి, పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాలానగర్, మాదాపూర్, శంషాబాద్ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను గుర్తించారు. అల్వాల్, అస్మక్ పేట్, జీడిమెట్ల అపూర్వకాలనీ, ధర్మారెడ్డికాలనీ, తుర్కపల్లి, కళావతినగర్, గచ్చిబౌలి, అయ్యప్ప సొసైటీ, ఇజ్జత్ నగర్, హఫీజ్ పేట్ లో ఈ కంటైన్మెంట్ జోన్లున్నాయి. వణుకు పుట్టిస్తున్న హాట్ స్పాట్స్ సంఖ్య తెలంగాణలో మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో ఒక్క హైదరాబాద్ సిటీలోనే ఏకంగా 270 పాజిటివ్ కేసులు రికార్డయ్యా యి. ప్రతి సర్కిల్ లో ఒక్కో హాట్ స్పాట్ ని గుర్తించిన అధికారులు.. ఒక్క పాజిటివ్ కేసు ఉన్న ప్రాంతాన్ని క్లస్టర్ గా ఐడెంటి ఫై చేసి పూర్తి స్థాయిలో దిగ్భంధం విధించారు. హైదరాబాద్ నగరంలో కంటైన్మెంట్ జోన్ల సంఖ్యను 15 నుండి 123కి పెంచారు. ఆ తర్వాత దాన్నిపుడు 126కి పెంచారు. ఒక్కో కంటైన్మెంట్ క్లస్టరు జోనల్ ఆఫీసర్, పోలీస్ అధికారి, నోడేల్ ఆఫీసర్లను ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో హాట్ స్పాట్ లో నలుగురు సభ్యులతో కూడిన అధికారుల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్ గా తేలి.. డిశ్చార్జ్ చేసిన వారికి మరోసారి పరీక్షలు జరి పేందుకు శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 14న) అన్ని జోన్లలో కలిపి 190 మంది శాంపిల్స్ సేకరించనున్నాయి జీ హెచ్ఎంసీ బృందాలు. కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగించింది. ఇప్పటికే పూర్తయిన 21 రోజుల లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారంగా కేంద్రం ‘హాట్ స్పాట్’ విధానాన్ని అనుసరించనుంది. ఏప్రిల్ 20 తర్వాత ఈ ప్రాంతాల్లోనే పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లో ఉ ండనున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో షరతులతో కూడిన మినహాయింపులు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో హాట్ స్పాట్ లుగా ఏ ప్రాంతాలను పరిగణిస్తారు..? అలా గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటీ..? ఇప్పుడు చూద్దాం…! హాట్ స్పాట్ అంటే… ఏ ప్రాంతంలోనైనా ఆరు పాజిటివ్ కేసుల కంటే ఎక్కువ నమోదైతే దాన్ని ప్రభుత్వం హాట్ స్పాట్ గా గుర్తిస్తుంది. ఒకవేళ ప్రస్తుతానికి అన్ని కేసులు లేకపోయినా.. భవిష్యత్తులో ఆరు మించితే దాన్ని హాట్ స్పాట్ గా పరిగణించాల్సిందే. ప్రజల పై ఎలాంటి ప్రభావం ఉంటుంది.. – దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్నప్పటికీ.. బ్యాంకులు, ఔషధాలు సహా నిత్యావసర వస్తువులు, ఎమర్జెన్సీ పనుల కోసం ప్రజలు బయటకు వచ్చే వెసులుబాటు ఉంది. కానీ, హాట్ స్పాట్ లుగా గుర్తించిన ప్రాంతాల్లో ఈ మాత్రం వెసులుబాట్లు కూడా ఉండవు. పూర్తిగా ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రజలకు కావాల్సిన వస్తువుల్ని నేరుగా ఇంటికే సరఫరా చేసే ఏర్పాట్లు స్థానిక యంత్రాంగమే చూసుకుంటుంది. ఎలాంటి అదనపు జాగ్రత్తలు తీసుకుంటారు.. హాట్ స్పాట్ గా గుర్తించిన ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువ మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. నిత్యం పరిశుభ్రంగా ఉండేలా క్రిమిసంహారిణిలు జల్లుతారు. ప్రజలకు అన్ని రకాల వస్తువులు, సేవలు అందించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటుంది. ప్రయోజనం ఏంటి.. హాట్ స్పాట్ గా గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల సామూహిక వ్యాప్తి దాదాపు పూర్తిగా అరికట్టవచ్చు. అలాగే ఆ ప్రాంతంలో కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తులు ఎవరెవరిని కలిశారో గుర్తించి వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు మీ ప్రాంతం హాట్ స్పాట్ కిందకి వస్తుందో.. లేదో.. మీకే అర్థమయి ఉంటుంది. లేదా, స్థానిక యంత్రాంగాన్ని అడిగి మీ ప్రాంతం హాట్ స్పాట్ అవునో కాదో తెలుసుకోండి. ప్రభుత్వ మార్గదర్శకాల్ని తు.చ తప్పకుండా పాటించి మీ ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడండి. కరోనా వైరస్ నియంత్రణా పోరులో బాధ్యతాయుతమైన సైనికులుగా నిలవండి!