12 గంటల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సూచించిన అధికారులు

అమరావతి: కరోనా వైరస్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి హాజరయ్యారు. సమీక్షా సమావేశానికి ముందు.. దేశంలో కరోనా విస్తరణ, నమోదవుతున్న కేసులు, అనుసరిస్తున్న వైద్య విధానాలు, వివిధ అధ్యయనాలకు సంబంధించి వివరాలను ముఖ్యమంత్రికి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి అందించారు. అనంతరం రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరణ స్థితిగతులు, నివారణా చర్యల వివరాలను సీఎం కు అధికారులు నివేదించారు. కి పోలీసు శాఖ పనితీరు పై ప్రశంసలు.. ఉదయం 9 గంటల వరకూ గడచిన 12 గంటల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని.. ఢిల్లీ వెళ్లినవారు, వారి ప్రైమరీ కాంటాక్టులు వల్లే కేసుల సంఖ్య పెరగడానికి కారణాలని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వీరి పరీక్షలు పూర్తవుతున్న కొద్దీ… వాటి కేసుల సంఖ్య తగ్గుతుందన్నారు. ఢిల్లీ వెళ్లినవారు, వారితో కాంటాక్టు అయిన వారి వివరాల సేకరణలో రాష్ట్ర పోలీసు విభాగం పనితీరు పై అధికారులు ప్రశంసలు కురిపించారు. డీజీపీ నేతృత్వంలో సిబ్బంది అద్భుతంగా పనిచేసి ఢిల్లీ వెళ్లినవారివే కాకుండా వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను కాపాడుకున్నట్టయిందని అధికారులు తెలిపారు.