మగవారికి ధీటుగా లేడీ రైల్వే కూలీ

”నా భర్త చనిపోయాక నా పిల్లలు, నేను ఒంటరి వాళ్లమయ్యాం. అప్పుడే నేను ఇక్కడ పనిచేయడానికి పూనుకున్నాను. నా దష్టిలో ఏపని కఠినమైనది కాదు. మగ, ఆడ అంటూ తేడా ఏముండదు. కాని.. మొదట్లో చాలా ఇబ్బందిగా ఉండేది. నాకు హిందీ, ఇంగ్లీష్‌ రాకపోయేవి. కాని.. నెమ్మదిగా లగేజ్‌ మోయడం సులువయింది. ఇప్పుడు నేను హిందీ, ఇంగ్లీష్‌ రెండూ అర్థం చేసుకుంటాను. వేరే పోర్టర్లు కూడా నాకు సహాయపడుతుంటారు..” -మంజుదేవి.

రైల్వేస్టేషన్లలో కూలీ అని పిలవగానే కూలీ ఒకతను పరుగెత్తుకు వస్తాడు. చేతిలో వున్న బ్యాగు, లగేజి అందుకుని ఆటో వరకు మోసుకు వెళతాడు. కానీ రాజస్థాన్‌లోని జైపూర్‌లో కూలీ అని పిలవగానే ఓ మహిళ వస్తుంది. మగ కూలీలకు దీటుగా ఈ ఆమె కూడా మూటలు మోస్తుంది. బతుకు పోరాటంలో ఎవరు ఎప్పుడు ఎలా మారతారో మనం చెప్పలేం. అలాగే ఈ మహిళా కూలీ మంజు దేవి కూడా తన బతుకు పోరులో రైల్వే కూలీగా మారాలని నిర్ణయించుకుంది.మహిళ కూలీగా ఎలా మారింది..

అయితే మంజుదేవిరైల్వే కూలీగా మారడానికి గల బలమైన కారణం ఏంటంటే.. ఆమె భర్త కొన్ని రోజుల క్రితం మరణించడమే. భర్త చనిపోయాడని ఆమె అందరు మహిళల్లా ఏడుస్తూ నిస్సహాయురాలిగా కూర్చోలేదు. పిల్లల భవిష్యత్తు కోసం తను భర్త బాధ్యతను కూడా తీసుకోవాలనుకుంది. రైల్వే కూలీగా మారింది. అంతకుముందు చిన్నా చితకా పనులు చేసింది కానీ అవేవీ తన కడుపు, తన పిల్లల కడుపు నింపలేకపోయాయి. దీంతో తన భర్త చేసిన రైల్వే కూలీ పనినే తానెందుకు చెయ్యకూడదని బలంగా అనుకుంది. ఆడవాళ్ళు ఇంటి బాధ్యతల బరువులు మోయగా లేంది రైల్వే స్టేషన్‌లో మూటలు మోయలేదా అనుకుంది.తక్షణమే తన భర్త పోర్టర్‌ లైసెన్స్‌తోనే జైపూర్‌ రైల్వే స్టేషన్‌లో కూలీగా పనిచేయడం ప్రారంభించింది. కష్టపడాలనే నైజం కలవారు ఎక్కడా దగాపడరు, రాజీపడరు నిజాయితీగా బతకాలనుకుంటారు. ఈమె కూడా ఆ దారిలోనే సాగుతోంది.

చాలా అవమానాలు..

తొలుత ఆమెను చూసి చాలా మంది విమర్శించారు, కొందరు జాలిపడ్డారు. ఇళ్లలో పాచిపనులు చేసుకోవచ్చుగా మగరాయుడిలా ఇదేంటి అని కొందరు అవమానించారు. కానీ మంజుదేవి ఎవరినీ పట్టించుకోలేదు. తన పిల్లలే తనకు ముఖ్యం అనుకుంది. తన పని తాను చేసుకుంటూ పోతోంది. తొలుత లగేజ్‌ మొయ్యటం ఇబ్బందిగా వుండేది. హిందీ, ఇంగ్లీష్‌ వచ్చేవి కావు. నెమ్మది నెమ్మదిగా ప్రయాణికులతో మాట్లాడుతూ ఆ భాషలు నేర్చుకుంది. ఈమె గురించి తెలిసి సోషల్‌ మీడియాలో ఆదర్శ మహిళగా పొగిడేస్తున్నారు. ‘సెల్యూట్‌ మంజుదేవి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘నువ్వు చాలామంది బడుగు జీవులకు ఆదర్శురాలివి’ అని పోస్టులు పెడుతున్నారు. ‘ఈ ప్రపంచంలో ఇది ఆడవారు చేసేపని, ఇది మగవారు చేసేపని అని తేడాల్లేవని నిరూపించిన మంజుదేవికి జేజేలు’ అని ఇంకొక నెటిజన్‌ పోస్ట్‌ చేశాడు.రాష్ట్రపతి ప్రెసిడెంట్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా ఆమెను మెచ్చుకున్నారు. మహిళ, శిశు అభివ ద్ధి మంత్రిత్వ శాఖ కూడా తనను సత్కరించింది నిజాయితీగా కష్టపడేవారికి ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది అనటానికి మంజుదేవియే ఉదాహరణ.

ఏ సంస్థలోనైనా , ఏ ప్రాంతంలోనైనా ఉద్యోగాల్లో పురుషులు, మహిళలు ఉమ్మడిగా పని చేస్తారు. కానీ ఈ రైల్వే స్టేషన్లో మాత్రం అందరూ మహిళా ఉద్యోగులే కనిపిస్తారు. మహిళ చేతుల్లోనే ఈ రైల్వే స్టేషన్‌ నడుస్తున్నది. జైపూర్‌లోని సుందర్‌పురాలో భర్త, ముగ్గురు పిల్లలతో జీవించేది ముప్ఫై నాలుగేళ్ల మంజూదేవి. పూలపానుపు లాంటి జీవితం కాకపోయినా… కడుపు నిండా తిండి, కట్టుకోవడానికి బట్టకు లోటు లేదు. ఉన్నదానితో త ప్తిపడే తత్వం ఆమెని ఏనాడూ దిగులు పడనివ్వనూ లేదు. మంజు భర్త మహదేవ్‌ జైపూర్‌ రైల్వేస్టేషన్లో కూలీ. సరిపడానే సంపాదించేవాడు. దాంతో కుటుంబం బాగానే గడిచిపోయేది. అయితే విధి వక్రించడంతో వారి జీవితాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి.

మహదేవ్‌ కాలేయ వ్యాధితో హఠాత్తుగా కన్నుమూశాడు. దాంతో బతుకంతా అంధకారమైపోయింది మంజుకి. సంపాదించే భర్త లేడు. తనకేమో సంపాదించే మార్గాలే తెలియదు. పిల్లలదేమో పరిస్థితులు అర్థం చేసుకునే వయసు కాదు. ఇప్పుడేం చేయాలి? తనలో తనే కుమిలిపోయింది. అప్పుడే ఆమెకు ఎవరో సలహా ఇచ్చారు… మీ ఆయన పని నీకిస్తారేమో అడుగు అని! ప్రాణం లేచొచ్చింది మంజుకి. భవిష్యత్తు మీద చిన్న ఆశ చిగురించింది. తన భర్త స్నేహితులతో కలిసి పోర్టర్‌ యూనియన్‌ని సంప్రదించింది. వారి సాయంతో ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంది. మంజుకి ఉద్యోగమివ్వడానికి వారికి పెద్ద అభ్యంతరాలేమీ కనిపించలేదు. దాంతో భర్త స్థానం మంజుకి దక్కింది. అతడు ధరించిన బ్యాడ్జి ఆమె చేతిమీదికి చేరింది. దానిమీద రాసివున్న ‘పోర్టర్‌ నంబర్‌ 15’ అన్న అక్షరాలు చూసినప్పుడల్లా… భర్త జ్ఞాపకం వచ్చి కళ్లు చెమ్మగిల్లుతాయి మంజుకి. ‘నా భర్త ఈ రూపంలో నాకు అండగా ఉన్నాడు’ అంటుంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో!

అయితే తొలినాళ్లలో ఆమె పని చేసినదాని కంటే ఏడుస్తూ గడిపిందే ఎక్కువ. అంతమంది మగవారి మధ్య కూర్చోవడం, తన వంతు కోసం ఎదురు చూడటం నరకంలా అనిపించేదామెకి. పైగా అందరూ తనని వింతగా చూస్తుంటే సిగ్గుతో చితికిపోయేది. దుఃఖాన్ని అదిమిపెట్టుకుని మౌనంగా చూస్తూ ఉండేది. సాయంత్రం ఇంటికి వెళ్లాక వెక్కి వెక్కి ఏడ్చేది. అలా చాలా రోజులు గడిపింది. అయితే ఓసారి మంజుని చూడటానికి వచ్చిన ఆమె తల్లి ఓ మాట చెప్పింది. ”ఒక పని చేయడానికి సిద్ధపడిన తర్వాత దానిలోని మంచి చెడులను ఎదుర్కోవడానికీ సిద్ధపడాలి. విధి నీకు అన్యాయం చేసింది. నువ్వు నీ పిల్లలకు అన్యాయం చేయకు’ అని. ఆ మాటలు మంజుని ఆలోచింపజేశాయి. ఆ క్షణమే నిర్ణయించుకుంది… తన పిల్లలను పెంచుకోవడానికి దొరికిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని!

మగవారికి దీటుగా…

కూలీగా పని చేయాలనుకోవడం సులభమే. కానీ చేయడం మాత్రం చాలా కష్టం. ఆ సంగతి పనిలో చేరిన కొన్ని రోజులకే తెలిసివచ్చింది మంజుకి. చిన్న చిన్న సూట్‌కేసులు కూడా ఎత్తలేక తూలిపోయేది. ఎక్కువ లగేజ్‌ ఉన్నప్పుడు వాటిని చక్రాలబండి మీద వేసి లాక్కెళ్లడానికి కూడా ఆమె బలం సరి పోయేది కాదు. ఆమె అవస్థ చూడలేక ఒక్కోసారి తోటి కూలీలు వచ్చి సహకరించేవారు. అది ఆమెకు చాలా సంతోషమనిపించేది. వారితో పని చేయడానికి తనే అనవసరంగా మొహమాటపడుతున్నాను, వాళ్లు మంచి మనసున్నవాళ్లు అని అర్థం చేసుకుంది. ‘అన్నా..’ అంటూ అందరితో స్నేహంగా ఉండటం మొదలుపెట్టింది. పని సులభంగా చేసే మెళకువల్ని వాళ్ల దగ్గర నేర్చుకుంది. ఆ వాతావరణానికి అలవాటు పడింది. వారికి దీటుగా పనిచేసే స్థితికి చేరుకుంది.

ఇప్పుడు జైపూర్‌ రైల్వేస్టేషన్‌కి మంజు ఓ పెద్ద అట్రాక్షన్‌. ఆమె అంటే అక్కడి కూలీలకే కాదు, దుకాణదారులకి కూడా చాలా ఇష్టం, గౌరవం. అందరూ బెహన్‌ (సోదరి) అంటూ ప్రేమగా మాట్లాడుతుంటారు ఆమెతో. అయితే ఇప్పటికీ కొందరు ప్రయాణికులు మాత్రం ఆడమనిషి పోర్టరేంటి అని ముఖమ్మీదే జోకులేస్తుంటారు. నువ్వేం మోయగలవు అంటుంటారు. అలాంటప్పుడు ఏమీ మాట్లాడదు మంజు. నవ్వుతూ తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడర్థమయ్యిందా చేయగలనో లేదో అన్నట్టుగా చూస్తుంది. నిజమే… చేయాలి అనుకోవాలేగానీ చేయలేనిది ఏదీ లేదు. పనికి పురుషుడు, స్త్రీ అన్న తేడా లేదు. శారీరక బలానికి ఆత్మబలం తోడైతే… మనల్ని ఆపగలిగే శక్తి దేనికీ ఉండదు. ఆ విషయాన్ని మంజు నిరూపించి చూపించింది!