సీఎంల మధ్య పెరుగుతున్న దూరం
ఏపీలో ఆర్టీసీ విలీనంతో ఇద్దరి మధ్య
అంతకంతకూ పెరిగిపోతున్న అంతరం
- -నిన్న మొన్నటిదాకా ఇచ్చిపుచ్చుకునే ధోరణి
- -ఇప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య విమర్శల దాడి
- -ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య ఆర్టీసీ చిచ్చు
- -ఆంధ్రా ఆర్టీసీ తరహాలో విలీనానికి కార్మిక సంఘాల పట్టు
- -సీఎం కేసీఆర్‌కు తలనొప్పిగా మారిన జగన్ వ్యవహారం
- -కాళేశ్వరం వ్యవహారంపై జగన్‌పై ఒత్తిడి
- -కేంద్ర నిధుల కోసం రెండు రాష్ట్రాల పోటీ
- -రెండు రాష్ట్రాల మధ్య సెగ రాజేస్తున్న కేంద్రం
హైదరాబాద్:
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్-జగన్ మధ్య దూరం పెరిగినట్లుగా అనిపిస్తుంది. జగన్ ఏపీ సీఎం అయ్యాక.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మంచి సత్సంబంధాలు నెలకొన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వారి మధ్య అగాధం ఏర్పడినట్టుగా చెబుతున్నారు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారినట్లుగా తెలుస్తోంది. ఆ క్రమంలో ప్రెస్ మీట్లలో కేసీఆర్ జగన్ మీద, ఆర్టీసీ విలీనం మీద చేస్తున్న కామెంట్లు ఆయనకు కోపం తెప్పించిందట. దానితో గోదావరి కష్ణాలను కలిపే ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల సంయుక్త ప్రాజెక్టును జగన్ అటకెక్కించారు. ప్రతిగా ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే పూర్తిగా ఉండే ప్రాజెక్టుకు జగన్ శ్రీకారం చుట్టారు. అలాగే కొంతమంది తెలంగాణ అధికారులను అనధికారికంగా తీసుకోవడంపై కూడా కేసీఆర్‌కు కోపం పుట్టించనట్లుగా సమాచారం. జగన్ చేపడుతున్న వివిధ పథకాలు తెలంగాణాలో అమలు చెయ్యాలని కూడా కేసీఆర్ మీద ఒత్తిడి రావడంతో ఆయనకు చిరాకు రప్పిస్తుంది. తెలంగాణపై కొన్ని విషయాలలో ఆంధ్రప్రదేశ్ విభేదించి కేంద్రం వద్ద కంప్లయింట్ చేసింది. ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య స్నేహం దెబ్బతిన్నట్లుగా అధికార వర్గాలు అంటున్నాయి. ఇద్దరి సీఎంల సఖ్యత వల్ల ఎన్నో పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయని అంతా భావించారు. ఇది గనుక నిజమైతే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
కేసీఆర్.. జగన్ వైఖరి మారిందా: బీజేపీ ఎఫెక్టా..! ఇక పోరుకు సిద్దపడుతున్నారా..! ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ అవుతారని తొలి నుండి కేసీఆర్ అంచనా వేసారు. ఎన్నికల సమయం నుండే చంద్రబాబుకు రిటర్న్ గిప్ట్ ఇస్తానంటూ సంచలనానికి కారణమయ్యారు. ఇక, ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత కనిపించింది. కేసీఆర్ నివాసానికి జగన్.. ఉండవల్లిలో జగన్ నివాసానికి కేసీఆర్ రాకపోకలు సాగించారు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఇద్దరి మధ్య అంత సఖ్యత కనిపించటం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యమంత్రి జగన్ గత నెలలో ఢిల్లీ టూర్ తరువాత పరిస్థితులు మారినట్లు కనిపిస్తోందనే వాదన ఉంది. వాస్తవంగా ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చెప్పుకోదగిన స్థాయిలో అభిప్రాయ బేధాలు లేవు. కానీ, బీజేపీతో పాటుగా కొందరు మేధావులు చేసిన సూచనల మేరకే జగన్ జాగ్రత్త పడుతున్నారా అనే చర్చ మాత్రం పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. జగన్..కేసీఆర్ వైఖరిలో మార్పు ఎందుకు.. ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు కేసీఆర్ ఆర్డికంగా సహకరిస్తున్నారని ఎన్నికల ప్రచారంలోనే చంద్రబాబు పలు మార్లు ఆరోపించారు. కేసీఆర్ సైతం ఏపీలో జగన్ అధికారంలోకి వస్తారంటూ అనేక సందర్బాల్లో చెప్పుకొచ్చారు. అదే విధంగా జగన్ సీఎం అయిన తరువా ఇద్దరూ ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో వ్యవహరించారు. హైదరాబాద్ లోని ఏపీ అధీనంలో ఉన్న సచివాలయ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించారు. ఇక, తెలంగాణలో ఎరువుల సమస్య వస్తే..దిగుమతి కోసం ఏపీ పోర్టును వినియోగించుకొనేందుకు అనుమతి ఇచ్చారు. టీటీడీ బోర్డులోనూ కేసీఆర్ సిఫార్సు చేసిన వారికి అవకాశం కల్పించారు. ఇక, ఇద్దరూ కలిసి ఏపీ..తెలంగాణ ప్రాంతాలకు మేలు చేసేలా కొత్త ప్రాజెక్టు రూపకల్పన పైన చర్చలు చేసారు. కానీ, సడన్‌గా రెండు నెలలుగా మార్పు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గతంలో ఏకాభిప్రాయంతో ముందకెళ్తామని చెప్పిన అంశాలే ఇప్పుడు వివాదానికి కారణమవుతున్నాయి.
పోలవరం..కాళేశ్వరం.. నాడు..నేడు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్ది కాలం క్రితం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఈ అంశం మీద రాజకీయంగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే ప్రాజెక్టు పైన ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా, విచక్షణా రహితంగా తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే అంశాన్ని పరిశీలించొద్దని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. తెలంగాణ భాజపా నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వ అఫిడవిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అదే విధంగా పోలవరం పైన కేసు విత్ డ్రా చేసుకుంటామని చెప్పిన కేసీఆర్ ఆచరణలో మాత్రం అమలు చేయలేదు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రధానికి లేఖ రాస్తామని చెప్పినా..అదీ చేయలేదు.
బీజేపీ..మేధావుల సూచనలే కారణమా?
ఏపీ ముఖ్యమంత్రి జగన్..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సఖ్యత పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. పలువురు దీనిని స్వాగతించగా..మరి కొంత మంది సూచనలు చేసారు. కేసీఆర్ ఆ రాష్ట్రా ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తారని..జగన్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఇదే సమయంలో తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో సమ్మె మొదలైంది. ఏపీలో ప్రభుత్వ నిర్ణయం పైనా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక రకంగా అది ఏపీ ప్రభుత్వం సైతం చేయలేదనే విధంగా వ్యాఖ్యలు చేసారు. వాటితో సీఎం జగన్ సైతం ఖంగుతిన్నారు. ఏంటి ఆయన అలా అంటున్నారు..అంటూ సహచర మంత్రుల ముందు విస్మయం వ్యక్తం చేసారు. తెలంగాణలో టీఆర్ యస్ కు వ్యతిరేకంగా బలపడాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో కేసీఆర్ తో దూరంగా ఉండటం మంచిదని..కేంద్ర సాయం ఏపీకి ఇప్పుడు చాలా అవసరమని..సొంత పార్టీలోనే చర్చ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. దీని కారణంగానే విబేధాలు లేకపోయినా..వ్యూహాత్మకంగానే దూరం పాటిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పగ్గాలు చేపట్టాక కేసీఆర్, జగన్ ఇద్దరూ సఖ్యతగా మెలిగారు. పలుసార్లు భేటీ అయ్యారు. ఒకరికొకరు కితాబులిచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కథ కంచికి చేరినట్లు తెలుస్తొంది. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని తెలంగాణ అధికార వర్గాలంటున్నాయి. జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారాయి. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించటం, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడం, కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ వ్యవహారం కేసీఆర్ కు మంట పెట్టింది. ఏపీ తరహాలో తెలంగాణలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు 40 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ అట్టుడుకుతోంది, ఈ అంశం కేసీఆర్ కు కొరుకుడుపడటంలేదు. అవగాహన లోపంతో ఆర్టీసీ విలీనం పై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు.ఈ తేనెతుట్టెను కదిలించి తమకు నష్టం కలిగించారని అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారు. మరోవైపు కేసీఆర్ అన్నందుకైనా ఆర్టీసీ విలీనం ఆరు నెలల్లోనే సక్సెస్ చేసి చూపుతామని ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు కూడా కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించాయని అంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన అధికారులు, కేసీఆర్ అంటే గిట్టనివారికి జగన్ పెద్ద పీట వేయడం కూడా ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోవటానికి కారణమని అంటున్నారు. తెలంగాణ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించి వీఆర్‌ఎస్ తీసుకున్నారు. వెంటనే ఆయన్ను ఏపీ విద్యాశాఖ సలహాదారుగా జగన్ నియమించుకున్నారు. ఇంక కేసీఆర్ అంటే గిట్టని జర్నలిస్టులు అమర్, రామచంద్రమూర్తికి పెద్ద పీట వేయడం కూడా కేసీఆర్ కు నచ్చలేదని చెబుతున్నారు. స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి విషయంలోనూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. కేంద్రం నుంచి పూర్తిగా ఆదేశాలు రాక ముందే ఈ ఇద్దరినీ అనధికారికంగా విధుల్లోకి తీసుకోవటం కేసీఆర్ కు కోపం తెప్పించిందట. చివరికి స్టీఫెన్ రవీంద్ర వెనక్కొచ్చి అభాసుపాలయ్యారు.
అటు గోదావరి జలాల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. గోదావరి జలాలను ఉమ్మడిగా క్రిష్ణకు తరలించాలని ఇద్దరూ కలిసి నిర్ణయించారు. కేసీఆర్ ఉదారంగా క ష్ణా డెల్టాకు నీళ్లిస్తాం అంటున్నారని జగన్ ఏపీ అసెంబ్లీలో ప్రకటించేశారు కూడా. అయితే ఆ తర్వాత తత్వం బోధపడిందో ఏమో ఆ ఆలోచనను విరమించుకున్నట్టు కనిపిస్తోంది. సొంతం గానే పోలవరం నుంచి క ష్ణాకు నీళ్ళు తరలించే ప్రతిపాదనలను చేస్తోంది ఏపీ ప్రభుత్వం.
ఇక ప్రగతి భవన్లో ఇద్దరు ముఖ్య మంత్రుల సమావేశంలో మాట్లాడుకున్న అంశాలు మీడియాలో వచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఈ విషయంలో కేసీఆర్ జగన్ కలిసి కేంద్రంపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించుకున్నట్టు మీడియాలో వచ్చింది. దీంతో జగన్ ఉలిక్కిపడ్డారు. ఈ విషయాలు మాట్లాడుకోలేదని ప్రకటన కూడా విడుదల చేశారు. కేసీఆర్ తో సఖ్యతగా మెలగడంతోనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దూరం పెడుతోందన్న అభిప్రాయానికి వచ్చారు జగన్ .అనవసరంగా తొందరపాటుతో కేసీఆర్ తో సఖ్యతగా మెలిగి కేంద్రంతో దూరం పెంచవల్సి వచ్చిందని జగన్ సన్నిహితులు చెబుతున్నారు. అందుకే అమిత్ షా తో అపాయింట్ మెంట్ కోసం ఇబ్బంది పడాల్సి వచ్చిందని సీబీఐ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దొరకలేదని అంచనాకొచ్చారు. అందుకే కేసీఆర్ తో దూరం పాటించేందుకు జగన్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. మళ్లీ ఈ మధ్య కాలంలో జగన్,కేసీఆర్ మధ్య భేటీలు ఉండక పోవచ్చని ఉమ్మడి ప్రాజెక్టుపై అసలు చర్చలు ఉండవని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.ఇక ముందు ముందు వీరి సఖ్యత ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.