‘రామగుండం’ పునరుద్ధరణకు హామీ

ఫర్టిలైజర్స్‌ ఫ్యాక్టరీ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌:
రామగుండం ఫర్టిలైజర్స్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ వెంకటేశ్‌ నేత, ఎమ్మెల్యే చందర్‌, రామగుండం ఫర్టిలైజర్స్‌ కంపెనీ ప్రతినిధి బందం సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నది. కంపెనీ కార్యకలాపాల ప్రారంభం కోసం అవసరమైన అన్ని విధాల సహాయ సహాకారాలు అందిస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కంపెనీ పునరుద్ధరణకు కషి చేశాం. అందుకే కంపెనీ పునరుద్ధరణలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష భాగస్వామ్యం తీసుకున్నది. మూతబడిన బిల్ట్‌ లాంటి కంపెనీలను తిరిగి ప్రారంభించేందుకు పరిశ్రమల శాఖ తరపున ప్రయత్నాలు చేస్తున్నాం. ఫ్యాక్టరీకి అవసరమైన ఉద్యోగాల కల్పనలో స్థానికులకు సాధ్యమైనంత మేర అవకాశాలు ఇవ్వాలి. కంపెనీ అవసరాల మేరకు తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్స్‌ అండ్‌ నాలెడ్జ్‌(టాస్క్‌) ద్వారా యువకులకు ప్రభుత్వ ఖర్చుతో శిక్షణ ఇస్తాం. అందులో నుంచి ఉద్యోగులను ఎంపిక చేసుకోవాలి. స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ సిబ్బంది కోసం టాస్క్‌ ద్వారా ప్రత్యేక కోర్సులు తయారు చేసి శిక్షణ ఇచ్చేందుకు సైతం సిద్ధంగా ఉన్నాం. అన్‌స్కిల్డ్‌ కార్మికులను జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛేంజీ ద్వారా భర్తీ చేసుకునే అవకాశాలను పరిశీలించాలి. ఇక్కడ ఉన్న కేంద్రీయ విద్యాలయాన్ని పునఃప్రారంభించేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రికి లేఖ రాస్తాం. కంపెనీకి అవసరమైన రవాణా, హమాలీ వంటి అంశాల్లోనూ.. ఈ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఉపయోగించుకోవాలి అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు విసిరే అర్థంలేని సవాళ్లకు స్పందించాల్సిన అవసరం లేదని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్‌ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక 9 నెలల పాలనకు సూచికగా తీసుకుంటారా?అని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరించేది లేదని కేటీఆర్‌ తేల్చిచెప్పారు. ఉత్తమ్‌ గతంలోనూ అనేక సవాళ్లు విసిరి తోక ముడిచారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో తెరాస గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే అక్కడ సాంకేతికతంగా గెలిచామని.. ట్రక్కుగుర్తు ప్రభావంతో నాడు ఉత్తమ్‌ గెలిచారన్నారు. హుజూర్‌నగర్‌లో ‘కాంగ్రెస్‌ గెలిస్తే ఉత్తమ్‌కు.. తెరాస గెలిస్తే ప్రజలకు లాభం’ అనే నినాదంతో ముందుకెళ్తున్నామని కేటీఆర్‌ వివరించారు.
30 మంది ఇన్‌ఛార్జుల నియామకం
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికకు 30 మంది పార్టీ నేతలను వివిధ ప్రాంతాలకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించినట్లు కేటీఆర్‌ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారని చెప్పారు. తాజాగా నిర్వహించిన సర్వేలో తెరాసకు 50 శాతం, కాంగ్రెస్‌కు 40 శాతం మంది ప్రజల మద్దతు ఉన్నట్లు తేలిందన్నారు.