జన్మతః పౌరసత్వం రద్దు!
మరో సంచలన నిర్ణయం దిశగా ట్రంప్
వాష్టింగన్: సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ ముందుంటారు. ‘అమెరికా ఉద్యోగాలు అమెరికన్‌లకే’ నినాదంతో వలసదారుల పట్ల కఠిన నిర్ణయాలను అమలు చేసిన ట్రంప్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోంది. జన్మతః పౌరసత్వం (బర్త్‌రైట్ సిటిజన్ షిప్) రద్దు చేసే విషయం గురించి తాము తీవ్రంగా ఆలోచిస్తున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తన ప్రచారాస్త్రాల్లో దీన్ని కూడా వాడుకున్నారు ట్రంప్. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు గతేడాది ప్రకటించడంతో ఈ అంశం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. కాగా, తాజాగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, ”అవును! ‘జన్మతః పౌరసత్వం’ రద్దు చేసే విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నాం. అది నిజంగా హాస్యాస్పదం. దేశాలు, సరిహద్దులు దాటి మా దేశంలో బిడ్డలను కంటున్నారు. దాంతో వారికి అమెరికా పౌరసత్వం వస్తోంది. ఈ విషయాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి వలస విధానంలో మార్పుల కోసం ప్రయత్నిస్తున్నారు. అమెరికా కాంగ్రెస్ ఈ మార్పులపై పెద్దగా స్పందించకపోవటంతో ఆయన తన అధ్యక్ష విచక్షణాధికారం ఉపయోగించి కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా నిబంధనలను కఠినతరం చేయడం ప్రారంభించారు. కొన్ని విపరీత చర్యలకూ సిద్ధపడ్డారు. అందులో భాగమే జన్మతః పౌరసత్వ హక్కు చట్టంలో మార్పులకు ప్రయత్నం. పద్నాలుగో రాజ్యాంగ సవరణను అక్రమ వలసదారులు దుర్వినియోగపరుస్తున్నారనేది ట్రంప్ అభియోగం. గర్భిణీ స్త్రీలను అక్రమంగా అమెరికా భూభాగంలోకి తరలించి అక్కడ ప్రసవం అయ్యేలా చేస్తున్నారని, వారికి పుట్టిన బిడ్డలు అమెరికా పౌరులవుతున్నారని, ఇప్పుడు అమలులో ఉన్న వలస విధానంతో వీరి తల్లిదండ్రులూ అమెరికా పౌరులవుతున్నారన్నది ట్రంప్ వాదన. ఈ విధంగా జన్మతః పౌరసత్వ హక్కుతో అక్రమ వలసదారులు పెరిగిపోతున్నారని, చివరకు వలస ఓ హక్కుగా మారుతోందన్నది ఆయన అభియోగం. అందుకే 14వ రాజ్యాంగ సవరణ దుర్వినియోగం కాకుండా కొన్ని వివరణలతో ‘కార్యనిర్వాహక ఉత్తర్వు’ ఇవ్వొచ్చని చెబుతున్నారు. ఇందుకు మద్దతుగా 1898 నాటి సుప్రీంకోర్టు తీర్పును ఉదహరిస్తున్నారు. అందులో అక్రమ వలసదారుల పిల్లల గురించి ప్రస్తావించలేదని, చట్టప్రకారం వచ్చిన వలసదారుల పిల్లల గురించే వివరణ ఇచ్చారని వాదిస్తున్నారు. సభల్లో ఈ అంశాన్ని చాలా ఏళ్ళ నుంచి కొంతమంది సెనేటర్లు, చట్టసభ సభ్యులు లేవనెత్తుతూనే ఉన్నారు. ప్రస్తుతం అధ్యక్షుడే ఈ వాదనను తెరపైకి తీసుకురావడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది.