నిజం తెలిస్తే

‘మత్తు’ దిగిపోతుంది 
రాష్ట్రంలో జోరుగా నకిలీ మద్యం..ఎక్సైజ్‌ శాఖ చోద్యం 
  • -అసలు బాటిల్స్‌లో నకిలీ మద్యం హల్‌చల్‌ 
  • -ఎంతతాగినా కిక్‌ ఎక్కని వైనం 
  • – శివారు ప్రాంతాలలో గుట్టుచప్పుడు కాకుండా తయారీ 
  • -బ్రాండెడ్‌ పేర్లతో విక్రయిస్తున్న కల్తీ సరుకు 
  • -బీర్ల నుంచి వైన్‌లకు సైతం పాకిన కల్తీ రోగం 
  • -అనుమతిలేని రసాయనాలతో ప్రాణాలకే ముప్పు 
  • -ఎక్సైజ్‌ శాఖలో ముడుపులు మరిగిన అధికారులు 
  • -చూసీచూడనట్లుగా వదిలేస్తున్న సిబ్బంది 
  • -పల్లెల్లో బెల్టుషాపుల్లో యథేచ్ఛగా విక్రయాలు

హైదరాబాద్‌: 
అక్కడ వేసిన సీల్‌ వేసినట్టే ఉంటుంది. మూత కూడా సీల్‌ చేసి ఉంటుంది.. కానీ లోపల లిక్కర్‌ మాత్రం కల్తీ అవుతుంది. ఖరీదైన బ్రాండ్‌ తాగుతున్నామన్న ఫీలింగే కానీ అందులో ఏ చీప్‌ కలిపారో కనుక్కోలేని పరిస్థితి. బాగా సేల్‌ అవుతున్న మీడియం బ్రాండ్స్‌తోపాటు బీర్లలో కల్తీ ఎక్కువ జరుగుతోంది. గతంలో బార్లకే పరిమితమైన ఈ కల్తీ దందా.. ఇప్పుడు వైన్స్‌కూ పాకింది. పనిలోపనిగా కొందరు ప్రాణాంతక రసాయనాలతో కల్తీ లిక్కర్‌ తయారు చేస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో నకిలీ మద్యం దందా జోరుగా సాగుతోంది. 
నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టు రట్టయింది. యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో తీగలాగితే వికారాబాద్‌ జిల్లాలో డొంక కదిలింది. యాదాద్రి, వికారాబాద్‌ జిల్లా ఎక్సైజ్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఇద్దరిని అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నట్లు సమాచారం. నకిలీ మద్యం తయారీకి వినియోగించే ముడి పదార్థాలైన స్పిరిట్‌, లేబుల్స్‌, మూతలు తదితర సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. నాలుగు రోజుల క్రితం యాదాద్రి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో ఎక్సైజ్‌ పోలీసులు తనిఖీలు చేసి నకిలీ మద్యంతో పాటు మద్యం తయారీకి వినియోగించే సామగ్రిని పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారు. 
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ పరిధిలో ఓ వైన్స్‌లో రెండు లక్షల విలువైన నకిలీ మద్యం పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌ శ్రీరాంనగర్‌ కాలనీ ప్రధాన రోడ్డులో కల్తీ మద్యం అమ్ముతుండటంతో వైన్‌ షాపును సీజ్‌ చేశారు. నల్గొండలో నకిలీ మద్యం తయారీదారులను అరెస్టు చేశారు. జనగామలోని ఓ వైన్స్‌లో తనిఖీలు చేయగా నీళ్లు కలిపిన 27 లిక్కర్‌ బాటిళ్లు లభ్యమయ్యాయి. ములుగు జంగాలపల్లిలోని వైన్‌షాపులో కల్తీ చేసిన మద్యం బాటిళ్లు 500 లభించాయి. నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం సీహెచ్‌ కొండూరులో ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో నిల్వ ఉంచిన కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ములుగులో మద్యం బాటిళ్ల మూతలు తీసి నీళ్లు కలిపే ముఠాను పట్టుకున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లందలో ఓ వైన్స్‌లో కల్తీ చేసిన మద్యం బాటిళ్లు దొరికాయి. 
అక్కడ అనుమానితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. కర్ణాటక, తాండూరు ప్రాంతం నుంచి ముడి పదార్థాలు సరఫరా అవుతున్నట్లు బయటపడింది. దీంతో యాదాద్రి, వికారాబాద్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు తమ సిబ్బందితో కలిసి సోమవారం జిల్లాలో విస్త త తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పెద్దేముల్‌ మండలం నాగులపల్లిలో బెల్టు షాపు నిర్వహిస్తున్న బిచ్చయ్య, మరో వ్యక్తి మొగులయ్య నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మొగులయ్యను అదుపులోకి తీసుకోగా బిచ్చయ్య పరారయ్యాడు. నాగులపల్లిలో తమ ఇళ్లలో తనిఖీలు చేసి లేబుళ్లు, స్పిరిట్‌ తదతితర మద్యం తయారీకి వినియోగించే ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
దోమలోనూ తనిఖీలు 
మొగులయ్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో దోమ మండల కేంద్రానికి చెందిన బెస్ల లక్ష్మణ్‌కు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో దోమలో సైతం దాడులు నిర్వహించి లక్ష్మణ్‌ ఇంట్లో మద్యం తయారికీ వినియోగించే ముడి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే, నకిలీ మద్యం తయారీ ప్రస్తుతం కాస్త మందగించినా గత ఎన్నికల సమయంలో పెద్దమొత్తంలో తయారు చేసి విక్రయించినట్లు ఎక్సైజ్‌ పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సందర్భంగా దోమ మండల కేంద్రంలో 150 నకిలీ లేబుల్స్‌, నాలుగు లీటర్ల స్పిరిట్‌, మద్యం బాటిళ్లను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. 
మద్యం షాపుల్లో సోదాలు 
గత సోమవారం మొత్తం అధికారులు మద్యం షాపుల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహిం చారు. దోమ, పెద్దేముల్‌, తాండూరులో తనిఖీలు చేశారు. నకిలీ మద్యం వైన్‌ షాపులకు ఏమైనా సరఫరా అవుతుందా.. అనే కోణంలో తనిఖీలు నిర్వహించారు. యాదాద్రి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ భరత్‌భూషన్‌, పరిగి సీఐ చంద్రశేఖర్‌ ఇతర సిబ్బంది తనిఖీల్లో ఉన్నారు. 
నకిలీ మద్యం అమ్మకాల పుణ్యమా! అని ‘ పొంగేది.. బీరు కాదు, తాగేది .. మందు కాదు’ అన్న చందంగా మారింది. వేసిన సీల్‌ వేసినట్లే ఉంటుంది. మూత కూడా చెక్కు చెదరదు. కానీ లోపల మద్యం మాత్రం కల్తీ అవుతుంది. ఖరీదైన బ్రాండ్‌ తాగుతున్నామన్న అనుభూతే కానీ, అందులో ఏ చీప్‌ లిక్కర్‌ కలిపారో కనుక్కోలేని పరిస్థితి నెలకొంది. బాగా అమ్మకాలు అవుతున్నా మీడియం బ్రాండ్స్‌తో పాటు బీర్లలో కల్తీ ఎక్కువ జరుగుతోంది. గతంలో బార్లకే పరిమితమైన ఈ కల్తీ దందా.. ఇప్పుడు వైన్స్‌కూ పాకింది. పనిలో పనిగా కొందరు ప్రాణాంతక రసాయనాలతో కల్తీ లిక్కర్‌ తయారు చేస్తున్నారు. హైదరాబాద్‌ నగర శివారులోని పలు ప్రాంతాల్లో ఈ నకిలీ మద్యం దందా జోరుగా సాగుతోంది. యాదాద్రి – భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మునిసిపల్‌ కేంద్రం హైదరాబాద్‌కు కూతవేటులో ఉండగా సోమవారం అబ్దుల్లానగర్‌ అనే గ్రామంలో భారీగా నకిలీ మద్యం ఎక్సైజ్‌ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న సంఘటనే దీనికి అద్దం పడుతుంది. 
షాంపూ, సోడా గ్యాస్‌ 
బీర్లలోనూ కల్తీ భారీగానే జరుగుతోంది. పంచదారతో పాటు పలు రకాల కెమికల్స్‌ కలిపిన నీటికి షాంపూ, కుంకుడుకాయ రసం కలిపి ఖాళీ బీరు బాటిళ్లను నింపుతున్నారు. తర్వాత నిమ్మరసం బండ్లపై వాడే సోడా గ్యాస్‌ ఎక్కించి మూతలు బిగిస్తారు. గ్యాస్‌, షాంపూ కారణంగా ఓపెనర్‌తో సీసా తెరవగానే బీరులా బుస్సున పొంగుతుంది. 
పావు వంతు కల్తీ సరుకే 
కొత్త రూల్స్‌ ప్రకారం నిర్దేశించిన కోటా దాటితే అమ్మకాలపై ఆబ్కారీకి మరికొంత లైసెన్స్‌ ఫీజు చెల్లించాలి. దీంతో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకుండా కొంతమంది రిటైలర్స్‌ నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు. ఇందులో 25శాతం వరకు నకిలీ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. 
టాప్‌ బ్రాండ్‌లో చీప్‌ లిక్కర్‌ మిక్సింగ్‌ 
నీళ్లలో పంచదారను మరిగించి అందులో కెమికల్స్‌, క్లీనింగ్‌ లిక్విడ్స్‌, నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌, కార్లను తుడిచేందుకు వాడే క్రీమ్స్‌ను నకిలీ మద్యం తయారీలో వాడుతున్నారు. రకరకాల కెమికల్స్‌ను, ఫార్ములాను కలుపుతుండటంతో వెంటనే కిక్కు ఎక్కుతోంది. ప్రీమియం బ్రాండ్లు కొన్ని ప్లాస్టిక్‌ బాటిళ్లలో మద్యం వస్తుండటంతో వీటి నుంచి మద్యాన్ని తీసి అందులో చీప్‌ లిక్కర్‌ లేదా మినరల్‌ వాటర్‌ కలుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 
బాటిల్‌ సీల్‌ పోకుండా టెక్నిక్‌గా చేతితో తీసి ఇందులోంచి క్వార్టర్‌ వరకు మందు బయటకు తీస్తున్నారు. ఆ మేరకు నీళ్లు, చీఫ్‌ లిక్కర్‌ నింపుతున్నారు. అనంతరం ఏ మాత్రం అనుమానం రాకుండా మూత బిగించేస్తున్నారు. ఇలా టెక్నిక్‌గా మూతతీసే టెక్నీషియన్లు అవసరం మేరకు వివిధ వైన్స్‌కు వచ్చి వెళుతుంటారు. మూతలు తీసిపెట్టే సీసాల సంఖ్యను బట్టి డబ్బు తీసుకుంటారు. నకిలీ మద్యం అమ్మకాలు మూడు పువ్వులు – ఆరు కాయలుగా సాగుతోంది. 
అక్రమంగా వైన్స్‌లోకి తరలింపు ! 
గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా తయారు చేసిన నకిలీ మద్యాన్ని వైన్స్‌ దుకాణాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మద్యం దుకాణాలకు డిపోల నుంచి మద్యం సరఫరా అవుతున్న రోజున ఆ మార్గాన వచ్చే వాహనంలో ఈ నకిలీ మద్యాన్ని వైన్స్‌లకు తరలిస్తుంటారు. ఈ విధంగా నకిలీ మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్‌ శాఖ అధికారులు నకిలీ మద్యం అమ్మకాలు నియంత్రించి ప్రజల ప్రాణాలు కాపాడాలని మద్యం ప్రియులు కోరుతున్నారు. 
నకిలీ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు… 
ప్రభుత్వ లైసెన్స్‌ పొందిన వైన్స్‌ల్లో అక్రమంగా నకిలీ మద్యం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కల్తీ మద్యం అమ్మకాలపై ఎవరైనా 9440902635కు సమాచారం ఇస్తే దాడులు చేస్తాం. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నకిలీ మద్యం అమ్మకాలను అరికడతాం. అంటున్నారు ఎక్సైజ్‌ శాఖ సంబంధిత అధికారులు.