పబ్లిక్‌గా ‘ప్రైవేటు’ దోపిడీ

ప్రయాణీకుల రద్దీని బట్టి రెండింతలు దోచుకుంటున్న 
ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు 
  • సాంకేతిక సమస్య పేరుతో బస్సు రద్దు 
  • -ముందుగా బుక్‌ చేసుకున్న టిక్కెట్‌ ధర వాపస్‌ 
  • -తర్వాత అధిక ధరతో మళ్లీ అదే బస్సు ప్రత్యక్షం 
  • -వరుస సెలవలు వస్తే చాలు అమాంతం రేట్లు పెంచేస్తారు 
  • -కొన్ని బస్సులకు అసలు రూట్‌ పర్మిషన్‌ ఉండదు 
  • -ఒక రూటుకు పర్మిషన్‌తో ఎక్కువ బస్సులు తిప్పుతున్న వైనం 
  • -ప్రయాణికుల అవసరాలకు సరిపోని ఆర్టీసీ సర్వీసులు 
  • -రేటు ఎక్కువైనా ప్రైవేటునే ఆశిస్తున్న ప్రయాణికులు 

హైదరాబాద్‌: 
ప్రయాణ హడావుడిలో ఉంటే జేబుదొంగలు చేతివాటం చూపుతారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నపుడు దొంగల కంటే ప్రైవేటు ట్రావెల్స్‌ యజమానులే రెచ్చిపోతున్నారు. కళ్లముందు కనిపించే దోపిడీని అడ్డుకునే వారు లేకపోవడంతో వారి ఆటలు సాగుతున్నాయి. సాధారణంగా ఒక షెడ్యూల్‌ సమయంలో బయల్దేరాల్సిన బస్సుకు ఆన్‌లైన్‌లో ప్రయాణికులు టిక్కెట్స్‌ బుక్‌ చేసుకుంటారు. వారి ప్రయాణం సాఫీగా సాగుతుంది. కానీ రద్దీ ఉంటే.. ఊహించని సంఖ్యలో ప్రయాణికులు ఉంటే మాత్రం ఆ బస్సు సర్వీసు రద్దు చేసేస్తారు. ముందుగా టిక్కెట్‌ బుక్‌ చేసుకున్న వారికి ఒక ‘సారీ’ పడేసి మర్యాదగా డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారు. ఇక్కడే దోపిడీకి తెరతీస్తారు. అదే షెడ్యూల్‌.. అదే బస్సు సర్వీసు.. రెట్టింపు టిక్కెట్‌ ధరకు అందుబాటులోకి వస్తుంది. సర్వీసు రద్దు కావడంతో టిక్కెట్‌ డబ్బు వాపస్‌ పొందిన ప్రయాణికుడు రెండింత ధరకు మళ్లీ టిక్కెట్‌ తీసుకుని ప్రయాణించాలి. లేకుంటే ప్రయాణం మానుకోవాలి.. ఇదీ ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వహణతీరు. అడ్డుకోవాల్సిన అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారా.. మామూళ్ల మత్తులో మూలుగుతున్నారో వారికే తెలియాలి. 
ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్‌ యజమానులు వందల్లో ఉన్న టిక్కెట్‌ ధర రెండింతలు చేసి డబ్బులు గుంజుతున్నారు. ప్రయాణికుల రద్దీని ద ష్టిలో పెట్టుకుని ట్రావెల్స్‌ యజమానుల చేష్టలు అన్ని ఇన్నీ కాదు. పండుగ దినాలు, ముహూర్తాలు ఎక్కువగా ఉన్న రోజుల్లో విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, షిరిడీ వంటి ప్రాంతాలకు వెళ్లేవారు ముందుగానే టిక్కెట్‌ బుక్‌ చేసుకుంటారు. తరువాత ఒకటి, రెండు రోజులు గడిచిన తరువాత బస్సు ఆ రూట్‌లో వెళ్లడం లేదు.. అసౌకర్యానికి మన్నించాలి అని బుక్‌ చేసుకున్న వారికి మెసేజ్‌ వస్తుంది. వాస్తంగా బస్సు సర్వీసు రద్దు కాదు. ముందుగా బుక్‌ చేసుకున్న తరువాత ఉన్న టిక్కెట్‌ ధరకు ఎక్కువగా డబ్బులు గుంజడానికి ప్రైవేటు ట్రావెల్స్‌ ఎత్తుగడ ఇది. 
మళ్లీ అదే బస్సు.. అదే సమయానికి.. అదే రూట్‌లో ప్రయాణించేవిధంగా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్కింగ్‌ సిద్ధంగా ఉంటుంది. ధర మాత్రం రెండింతలు ఎక్కువగా ఉంటుంది. ముందు ఉన్న టిక్కెట్‌ ధరకు, ప్రస్తుతం ఉన్న టిక్కెట్‌ ధరకు రెండు రెట్లు అదనంగా ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి టిక్కెట్‌ కొనుక్కోవాలి. ఈవిధంగా చేయడం ప్రైవేటు ట్రావెల్స్‌కు అలవాటుగా మారిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సిన వారు అధిక ధర చెల్లించి ప్రయాణించక తప్పడం లేదు. 
గత నెల హైదరాబాద్‌ నుంచి తణుకు వెళ్లాల్సిన ఒక ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుకు ఈ నెల 12న రూ.814 ధరకు టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నారు. 13న బస్సు సాంకేతిక సమస్యలున్నాయని ఆ రూట్‌లో బస్సు వెళ్లడం లేదని చెప్పి టిక్కెట్‌ కేన్సిల్‌ చేస్తూ డబ్బు వాపస్‌ ఇస్తామని మెసేజ్‌ ఇచ్చారు. 14న వెళ్లాల్సిన అదే బస్సు యథాతథంగా వెళ్లింది. టిక్కెట్‌ ధర రూ.814 నుంచి రూ. 1800 పెరిగింది. విషయం తెలిసిన కొంతమంది ప్రయాణికులు చౌటుప్పల్‌ హైవే రోడ్డులో మూకమ్ముడిగా బస్సును అడ్డుకున్నారు. బస్సు ఆపరేటర్లు ప్రయాణికులతో దురుసుగా మాట్లాడడం మరింత గందరగోళానికి గురి చేసింది. ప్రైవేటు ట్రావెల్స్‌ ఆగడాలను నియంత్రించాలని ప్రయాణికులు ఆందోళన చేశారు. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. 
జిల్లాలో చాలా చోట్ల ఇటువంటి పరిస్థితులు సాధారణమయ్యాయని తరచు ప్రయాణిస్తున్న వారు చెప్పారు. వదిలి వేయడం వల్ల ప్రైవేటు ట్రావెల్స్‌ యజమానుల అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వాస్తవానికి ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు దారిలో ఎలాంటి సమస్య వచ్చి ఆగిపోయినా కనీసం పట్టించుకున్న సందర్భాలు కూడా లేవు. ప్రయాణికులే ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఎక్కడైనా బస్సు సాంకేతిక సమస్యతో ఆగినా.. మరేమైనా జరిగినా ప్రయాణికులకు తిప్పలు తప్పవు. చాలా సందర్భాల్లో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన దాఖలాలు లేవు. డబ్బులు కూడా తిరిగి ఇచ్చిన సందర్భాలు లేవు. 
ఆర్టీసీ ఇబ్బందుల వల్ల.. 
ప్రైవేటు ట్రావెల్స్‌తో ప్రయాణికులు ఇబ్బందులు పడు తున్నా మళ్లీ వాటినే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. ఆర్టీసీ సర్వీసుల్లో టిక్కెట్‌లు అందుబాటులో ఉండడం లేదని పలువురు వాపోతున్నారు. రిజర్వేషన్‌లో ఇబ్బందులు, సరిపడినన్ని సర్వీసులు లేకపోవడం, రద్దీకి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నామని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు. 
లాకర్స్‌లో సైతం ప్రయాణికులు! 
ఇటీవల ప్రైవేటు ట్రావెల్స్‌ సరికొత్త దోపిడీకి దిగుతున్నాయి. ప్రయాణికులు అవసరాలే ఆసరాగా బస్సులో సామాన్లు ఉంచే లాకర్స్‌లో సైతం ప్రయాణికులను పడుకోబెడు తున్నారు. ఇటీవల రవాణాశాఖ అధికారుల తనిఖీలలో ఒక ప్రైవేటు బస్సు లాకర్‌లో ప్రయాణికులను పడుకోబెట్టడం చూసిన విస్తుపో యారు. ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు ఎంతకైనా తెగిస్తాయడానికి ఇదొక నిదర్శనం. 
ఇవీ నిబంధనలు.. 
ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు రోడ్డుపై వెళ్లాలంటే ఖచ్చితంగా రవాణశాఖ నియమ నిబంధనలు పాటించాల్సిందే. వాహనానికి అనుమతులు తోపాటు ట్యాక్స్‌, ఇన్సూరెన్స్‌ , ఫిట్‌నెస్‌, పొల్యూషన్‌, ఇతర అనుమతులు ఖచ్చితంగా ఉండాలి. చాలా వాహనాలకు ఈ అనుమతులు లేకుండా నడపడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 
నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులపై డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ కొరడా ఝుళిపించారు. ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టి యథేచ్చగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై ప్రత్యేక దష్టి సారించిన అధికారులు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు విస్తత తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కమిషనర్‌ ఆధ్వర్యంలో పలు బ ందాలుగా ఏర్పడిన రవాణాశాఖ అధికారులు ఆదివారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు జరిపారు. కమిషనర్‌ కూడా తనిఖీల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు, బెంగళూరు వైపు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు జరిగిన ఈ దాడుల్లో అధికారులు దాదాపు 200 బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 44 బస్సులపై అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల వల్ల రవాణా శాఖకు రూ. 22 లక్షల ఆదాయం రావడం గమనార్హం.