వ్యయ..సాయం

తడిసిమోపెడవుతున్న వ్యవసాయ ఖర్చులు..అరకొరగా ప్రభుత్వ సాయం
  • -పెరిగిపోయిన కూలీ రేట్లు, ఎరువుల ధరలు 
  • -వ్యవసాయరంగంపై కన్నేసిన కార్పొరేట్‌ సంస్థలు 
  • -మార్కెట్‌ యార్డులలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న కార్పొరేట్లు 
  • -కంపెనీలకు అనుగుణంగా మార్కెట్‌ చట్టాల సవరణ 
  • -రైతుబంధు సాయం అంతంతమాత్రం 
  • -ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా తయారయిన పరిస్థితి 
  • -రెండేళ్లుగా సరైన దిగుబడి లేక దిగాలుచెందిన రైతన్న 
  • -రోజు కూలీ రూ.300 నుంచి రూ.400 పెరుగుదల 
  • -ఎకరానికి ఖర్చు రూ.30 నుంచి 35 వేలు 
  • -యంత్రసామాగ్రి ధరలు పైపైకి 

హైదరాబాద్‌: 
వ్యవసాయం రైతుకు భారంగా మారుతోంది. పంట పెట్టుబడి ఏటేటా పెరుగుతూ ఉండటంతో రైతన్నలకు సాగు తలకు మించిన భారంగా మారుతుంది. దుక్కి దున్నుడు మొదలు పంట చేతికొచ్చేంత వరకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు సాయం దేనికీ సరిపోవడం లేదు. రైతులకు సకాలంలో పంట రుణాలు అందటం లేదు. అప్పులు చేసి పంటలు సాగు చేసినా చివరకు పంట దిగుబడి వస్తుందన్న గ్యారెంటీ లేదు. ప్రస్తుతం రైతన్నల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా పరిణమిం చింది. వ్యవసాయాన్ని పండగలా మారుస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా.. ఆచరణలో మాత్రం ‘దండగ’లా మారుతోంది. 


జిల్లాలో గతేడాది ఖరీఫ్‌లో 1,64,811 హెక్టార్లు సాధారణ సాగు విస్తీర్ణం కాగా 1,81,603 హెక్టార్లు వివిధ పంటలు సాగు చేశారు. వర్షాల రాక ఆలస్యం కావడంతో ఈసారి ఖరీఫ్‌లో 1,68,260 హెక్టార్లు సాధారణ పంట విస్తీర్ణంగా వ్యవసాయాధికారులు అంచనాలు తయారు వేేశారు. దీనికనుగుణంగా కావాల్సిన 25,915 క్వింటాళ్ల విత్తనాలకు ప్రణాళికలు రూపొందించారు. ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్న రైతులకు పెరిగిన ధరలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 
రెండేళ్లుగా ప్రకతి కన్నెర్ర చేయటంతో సరైన దిగుబడులు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. గతేడాది కంటే ఈసారి సాగుభారం పెరుగుతుండటంతో రైతన్నలను అతలాకుతలం చేస్తుంది. దుక్కిదు న్నడం, చదును చేయడం, భోజ కొట్టడం, విత్తులు విత్తడం, పంట కోత ఇలా ప్రతీ పనికి యంత్రాలు వాడాల్సి వస్తుంది. పెరిగిన చమురు ధరలతో యంత్రాల రేట్లు కూడా పెంచే శారు. కూలి రేట్లు సైతం భారీగా పెరగటంతో అన్నదాతలో ఆందోళన వ్యక్తమవుతోంది. పురుషులకు కూలి రూ.300 ఉండగా రూ.400లకు పెంచేశారు. అలాగే మహిళల కూలి రూ.200 ఉండగా రూ.300 పెంచేశారు. వర్షాలు సంవ ద్ధిగా కురిస్తే కూలీ రేట్లు మరింత పెంచే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. కలుపుతీత, పంట కోత సమ యంలో కూలీలకు కొరత ఏర్పడుతుందన్నారు. 
ఎకరం ఖర్చు రూ. 30,000 
పత్తికి రూ. 5 వేలు అదనం 
దుక్కులు దున్నిన కాడ నుంచి పంట కోత వరకు ఎకరం ఖర్చు రూ.27,300 వస్తుంది. దుక్కులు దున్నేందుకు గంటకు ట్రాక్టర్‌కు రూ. 800 తీసుకుంటున్నారు. ఎకరం దున్నేందుకు మూడు గంటల సమయం పడుతుంది. 3 గంటలకుగాను రూ.2,500 ఖర్చవుతుంది. అలాగే కల్టివేటర్‌ వేసేందుకు మరో రూ.800 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మొక్కజొన్న పంటకు బోజ కొట్టేందుకు గంట సమయం పడుతుంది దీనికి రూ.800 ఖర్చు అవుతుంది. విత్తనాలు వేసేందుకు ముగ్గురు కూలీలు అవ సరం కానున్నారు. ఒక్కొక్కరికి రూ.400 చొప్పున రూ.1200 ఇవ్వాల్సి వస్తుంది. విత్త నాల కోసం రూ.1500, డీఏపీకి రూ.4500 ఖర్చు పెట్టాల్సి వస్తుం ది. విత్తులు విత్తాక వర్షం కురిస్తే.. గడ్డి మం దుకు రూ. 900, కలుపుతీతకు ఆరు గురు కూలీలు అవ సరం కానున్నారు. వారికి రూ.2400 చెల్లించాలి. పురు గుల మందులకు రూ. 1500, వర్షాలు పడి దిగు బడి వస్తే.. పంట కోతకు 8 మంది కూలీలు అవసరం. వారికి రూ.3,200 చెల్లించాల్సి వస్తుంది. కూలీల కొరత ఉంటే.. యంత్రానికి గంటకు రూ.2500 చెల్లించాల్సి వస్తుంది. యంత్రంతో మొక్కజొన్న కట్‌ చేస్తే చొప్ప మొత్తం పాడవుతుంది. దీంతో కూలీల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. మొక్కజొన్న పంట కాకుండా పత్తి పంటకు అదనంగా పురుగుల మందులకు ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. పత్తి వేసినప్పటి నుంచి నాలుగుసార్లు పత్తి మందు పిచికారి చేయాలం టున్నారు. దీనికి రూ. 5 వేలు, అలాగే పత్తి చేతికి వచ్చాక తీసేందుకు కూలీలకు కిలోకు రూ.10 చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. 
పంట రుణాలెప్పుడు? 
పంట రుణాలు భారీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ధేశించిన క్షేత్రస్థాయిలో బ్యాం కులు అందుకు సహ కరించడం లేదు. గతే డాది ఖరీఫ్‌లో 1,64, 811 హెక్టార్లు సాధా రణ విస్తీర్ణం కాగా 1,81,603 హెక్టార్లు వివిధ పంటలు సాగు చేశారు. సాగుకు తగ్గ ట్టుగా పంట రుణాలు అందలేదు. 57శాతం మా త్రమే పంట రుణాలను పం పిణీ చేశారు. చాలామంది రైతులు పంటరుణాల కోసం బ్యాం కుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా.. ఇప్పటి వరకు బ్యాంకర్లు రుణాల ఊసే ఎత్తడం లేదు. ఈ ఏడాది పంట రుణాల లక్ష్యం ఎంత? ఎంతమంది రైతులకు రుణాలు ఇవ్వాలనే విషయం ఇప్పటివరకు రుణ ప్రణాళిక ఖరారు కాలేదు. రైతన్నలకు సకాలంలో రుణాలు అందక పోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మూడు రూపాయల వడ్డీకి అప్పు తీసుకువచ్చి పంట పెట్టుబడి కోసం ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించాలని, బ్యాంకుల వారీగా సమీక్షలు జరిపి త్వరగా రుణాలు అందించాలని రైతులు కోరుతున్నారు. 
కౌలు రైతులకు కన్నీళ్లే.. 
రాష్ట్రంలో ఏ గుర్తింపు లేనివారు ఎవరైనా ఉన్నారంటే.. అది కౌలు రైతులే. ఏ వ్యక్తి అయినా తను చేస్తున్న పని గురించి చెప్పడానికి వారి దగ్గర ఒక ఆధారం ఉంటుంది. కానీ వీరి దగ్గర అలాంటిదేమీ ఉండదు. అన్నీ ఉన్నవారికే బయట అప్పు పుట్టాలంటే అనేక అవాంతరాలు ఎదురవుతున్న ఈ రోజుల్లో కౌలు రైతులకు అది అందని ద్రాక్షే. అటు బ్యాంకులు గానీ, ఇటు వడ్డీ వ్యాపారులు గానీ వీరిని నమ్మి నయాపైసా కూడా ఇవ్వరు. పోనీ ఈ పని మానేద్దామంటే వీరికి ఇది తప్ప ఇంకో పని రాదు. ఇలాంటి పద్మవ్యూహంలో ఇరుక్కుపోయిన వారు రంగారెడ్డి జిల్లాలో సుమారు 8 వేల వరకు కౌలు రైతులు ఉంటారని అంచనా. 2011లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కౌలు రైతుల చట్టాన్ని తీసువచ్చింది. భూమి కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసుకునే కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా పంట రుణాలు, సబ్సిడీ విత్తనాలు ఎరువులు ఇవ్వడంతోపాటు ప్రక తి వైపరీత్యాల వల్ల నష్టపోతే పరిహారం అందేవిధంగా చట్టాన్ని రూపొందించారు. 2015-16లో కొంతమందికి కార్డులు కూడా జారీచేశారు. కానీ బ్యాంకర్లు రుణాలు ఇవ్వడానికి ముందుకు రాలేదు. భూమిని కౌలుకు ఇచ్చిన రైతు సమ్మతిస్తేనే కౌలు రైతుకు బ్యాం కులో రుణం మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో పొలం యజమానులు సంతకం చేసేం దుకు వెనుకంజ వేశారు. దీంతో కౌలు దారుల పరిస్థితి గాలిలో దీపంలా మారింది. ప్రస్తుతం కౌలు రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం తమను గుర్తించి ఎకరానికి రూ. 5 వేల సాయాన్ని అందేలా చూడాలని కౌలు రైతులు కోరుతున్నారు. 
రూ. 3 కోట్లు ధాన్యం బకాయిలు 
రైతులు అష్టకష్టాలు పడి వరి పండించారు. పండించిన ధాన్యాన్ని మద్దతు ధర కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్నారు. 48 గంటల్లో చెల్లింపులు చేయాల్సి ఉండగా.. రోజుల తరబడి డబ్బుల కోసం నిరీక్షిస్తున్నారు. డబ్బు వస్తే.. ఖరీఫ్‌ పంటకు పెట్టుబడిగా వాడుకోవచ్చని ఆశపడిన రైతులకు నిరాశే మిగిలింది. జిల్లాలో ఏర్పాటు చేసిన 16 కోనుగోలు కేంద్రాల్లో 7,700 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందుకోసం రూ.13.56 కోట్లు డబ్బు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.10 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.3 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. 
సకాలంలో పంట రుణాలివ్వాలి.. 
సకాలంలో పంట రుణాలు ఇవ్వాలి. పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న పంట సాయం ఏ మూలకు సరిపోవడం లేదు. గుర్తింపు పొందిన కంపెనీ విత్తనాలపై సబ్సిడీ ఇవ్వాలి. వ్యవసాయం చేయడం కన్నా కూలి పనిచేయడం నయం అనిపిస్తుంది. ప్రతీ ఏడాది ధరలు భారీగా పెరుగుతున్నాయి. కానీ.. మేం పండించిన పంటలకు మాత్రం ధరలు పెరగటం లేదు. 
కూలీల కొరత, ఎరువుల ధరలు పెరిగిపోతుండటంతో సాగు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా పెట్టుబడుల సమయంలో బయట అప్పులు దొరకని సందర్భంలోనే సన్న, చిన్నకారు రైతులు పంటరుణాలతో పాటు బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. వీటిపై వడ్డీరాయితీని ఎత్తివేస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా, మార్కెట్‌ చట్టాలను సవరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. నూతన ఎగుమతి, దిగుమతి విధానాలను రూపొందిస్తోంది. ఇప్పటికే మన రైతాంగం పండించే అపరాలు మార్కెట్‌కు వచ్చే సమయానికి విదేశీ దిగుబడి అయిన పప్పు ధాన్యాలు మన మార్కెట్లను పడగొడుతున్నాయి. దీనికి తోడు ‘మోడల్‌ కాంట్రాక్టు ఫార్మింగ్‌’ చట్టాన్ని రూపొందించింది. దీని ద్వారా ఇప్పటికే రిటైల్‌ రంగంలో ఉన్న రిలయెన్సు, టాటా, బిర్లా, అదానీ, ఐ.టి.సి, బేయర్‌ కంపెనీలను మార్కెట్‌ యార్డులలో పెట్టుబడులు పెట్టి కోల్డ్‌ స్టోరేజీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు స్థాపించుకోవాలని కోరుతోంది. ఇంకా ‘ప్రధానమంత్రి మత్య్స సంపద యోజన పథకం’ పేరుతో విదేశీ బహుళజాతి కంపెనీలకు ఆహ్వానం పలుకుతోంది. మత్య్స రంగంలోకి ఆధునీకరణ పేరుతో విదేశీ చేపల కంపెనీలను ఆహ్వానిస్తోంది. ‘ప్రాంతీయ ఆర్థిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల’లో చేరి విదేశీ పాడి ఉత్పత్తులను దేశంలోకి దిగుమతి చేయడానికి సిద్ధం అవుతోంది. విదేశీ పాల ఉత్పత్తులు దిగుమతి అయితే మన దేశంలోని 15 కోట్ల పాడి రైతులకు మరణశాసనమే. మన పాడి సహకార రంగానికి పాడె గట్టడమే అవుతుంది. పైగా కార్పొరేట్‌ కంపెనీలు రైతాంగాన్ని ఉద్ధరించవు. అవి రైతులను పీడిస్తాయనడానికి బంగాళదుంప రైతులపై పెప్సీ కంపెనీ పెట్టిన అక్రమ కేసులే తాజా ఉదాహరణ. 
వ్యవసాయ విధాన రూపాంతరీకరణ కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల తొలి సమావేశం అనంతరం ఆహార భద్రతా చట్టాన్ని కుదిస్తామని, ఉపాధి హామీ చట్టాన్ని కుదిస్తామని ప్రకటించింది. ఆహార భద్రతా చట్టాన్ని కుదించటమంటే పౌర సరఫరా శాఖ ద్వారా ప్రజలకు అందించే ఆహార ధాన్యాలు, పప్పుల కొనుగోళ్లు కూడా నిలిపివేయడమే. పౌర సరఫరాల ద్వారా సరుకులకు మారుగా నగదు బదిలీ పథకాన్ని ప్రవేశ పెట్టాలని ఎప్పటి నుండో చర్చ సాగుతోంది. దాని ఫలితం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు మొత్తం కార్పొరేట్‌ కంపెనీల దయాదాక్షిణ్యాలకు వదిలివేయడమే అవుతుంది. కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాల కోసమే ఈ చట్టాల మార్పులు. 
నవీకరణకే ప్రాధాన్యం.. 
బ్యాంకర్లు అయిదేళ్ల నుంచి పంట రుణాల నవీకరణకే ప్రాధాన్యమిస్తున్నారు. నిర్ధేశించిన లక్ష్యం చేరేందుకు ఈ మార్గాలు ఎంచుకున్నారు. ఇదివరకు తీసుకున్న రుణానికి చెల్లించాల్సిన వడ్డీని కలిపి కొత్తగా రుణం మంజూరు చేసినట్లు కాగితాల్లో రాసుకుంటున్నారు. ఇలా చేయడంతో రైతుల చేతికి కొత్తగా డబ్బులు రావడంలేదు. ఇక సహకార సంఘాల్లో పుస్తక సర్దుబాట్లతోనే సరిపెడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పెట్టుబడి సాయం పంటపొలాల్లో దుక్కులు సిద్ధం చేసేందుకే సరిపోవడం లేదు. చిన్నకమతాల రైతులు తమ వద్ద ఉన్న బంగారు నగలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పంట రుణాలు పొందుతున్నారు. బ్యాంకర్లు ఇప్పటి వరకు వీటికి వడ్డీరాయితీని వర్తింపజేసేవారు. ఇకపై ఈ విధంగా చేసే అవకాశం లేకపోవడంతో రైతుల నెత్తిన మరింత భారం పడనుంది.