అలర్జీకి దివ్యౌషధం పియర్స్‌

ఇప్పుడు విరివిగా దొరికే పండ్లలో పియర్‌ ఒకటి. చూడ్డానికి ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పండు మహిళలకెంతో మేలు చేస్తుంది. మెనోపాజ్‌ దాటిన వారు తీసుకోవడం వల్ల గర్భకోశ సమస్యలూ, గుండె జబ్బులూ అదుపులో ఉంటాయి. కళ్లూ, చర్మం వంటి అలర్జీలతో బాధపడే వారు ఈ పండ్లు తింటే మంచిది. దీనిలో అలర్జీని దూరం చేసే పోషకాలు లభ్యమవుతాయి. మీకు వీలు దొరికినప్పుడల్లా ఒక్క పియర్‌ ఫ్రూట్‌ తిన్నా కూడా శరీరానికి అరుదైన, అవసరమైన అద్భుత పోషకాలు అందుతాయి. ఆడవాళ్లే కాదు మగవారికి కూడా పియర్‌ చాలా మేలు చేస్తుంది. సాధారణంగానే సీజనల్‌ ఫ్రూట్స్‌ తినాలని మన పెద్దలు అనాది కాలం నుంచే చెబుతూ వస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే పియర్‌ ఫ్రూట్‌ టాప్‌ ప్లేస్‌ లో ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతి సీజనల్‌ ఫ్రూట్‌ అంటే జామ, బత్తాయి, యాపిల్‌, దానిమ్మ, ద్రాక్ష, సీతాఫలం, మామిడి.. ఇలా ఎన్నో తింటాం కాని పియర్‌ తినే అలవాటు లేదు. మరి తినకపోతే ఆ పండులో మాత్రమే దొరికే పోషకాలు మనకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. అన్నట్లు పియర్‌ తింటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఓసారి చూద్దాం..
పియర్‌లో బీటా కెరొటిన్‌, ‘సి’ ‘కె’ విటమిన్లూ, పీచు, పొటాషియం వంటి పోషకాలు ఉండటం వల్ల అన్ని వయసుల వారూ వీటిని తీసుకోవచ్చు. వయసు పైబడిన వారు తినడం వల్ల అరుగుదల బాగుంటుంది. మనసు బాగోలేనప్పుడూ, పనిమీద ఏకాగ్రత కుదరనప్పుడూ ఒక పండు తిని చూడండి. కాసేపటికి ఒత్తిడి తగ్గి, ఉత్సాహం వస్తుంది. దీనిలో సెరటోనిన్‌ వంటి మేలు చేసే హార్మోన్లు ఉండటమే అందుకు కారణం. అందుకే ఆడా మగా తేడాలేకుండా పియర్‌ ను తినాల్సిందేనని చెప్పేది.
కొందరికి తరచూ నోటి పూత వస్తుంటుంది. అలాంటి వారు ఈ పండ్లను తీసుకోవాలి. వీటిలో ‘బి’ విటమిన్లు అధికం. శక్తి కూడా బాగానే లభిస్తుంది. ఆహారం తక్కువ తీసుకొనే వారు ఈ పండుకు ప్రాధాన్యమివ్వాలి. ఎందుకంటే ఒక్క పండుద్వారానే ఎన్నో పోషకాలు అందుతాయి.
దీనిలో త్వరగా కరిగిపోయే కొవ్వు ఉంటుంది. ఆహార నియమాలు పాటించే వారూ, బరువు తగ్గాలనుకునే వారు పియర్‌ని తరచూ తీసుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ని కరిగించడానికీ దీనిలోని పోషకాలు ఉపయోగపడతాయి. ఈ పండు నుంచి అందే క్యాలరీలూ తక్కువే. వంద గ్రాముల పండులో యాభ్కె ఎనిమిది కెలొరీలే ఉంటాయి.
హెల్తీ అండ్‌ డయాబెటిక్‌ ఫ్రెండ్లీ ఫ్రూట్‌ ఇది. రోజుకి ఒక పియర్‌ పండు తినవచ్చు. ఇందులో కూడా ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండటం వల్ల.. చాలాసేపు ఆకలిగా అనిపించదు. మరీ ఎక్కువగా పండినది కాకుండా, మరీ పచ్చిగా ఉన్నది కాకుండా.. ఎంచుకోవాలి. వాటిలో అయితే.. షుగర్‌ తక్కువగా ఉంటుంది.