ఒలింపిక్‌ స్వర్ణం లక్ష్యంగా ‘కత్తి’లా దూసుకుపోతోంది

ఆ అమ్మాయికి చదువంటే ఇష్టం లేదు. బడికి వెళ్లడమంటే అంతకంటే కష్టం. ఏం చేయాలి… చదువుకి దూరంగా ఉండాలి. మరి ఇంట్లో ఒప్పుకొంటారా అంటే ఊహూ…! అందుకే ఎవర్నీ నొప్పించకుండా ఉండాలంటే ఆటల వైపు మొగ్గు చూపడం మంచిదనుకుంది. ఇప్పుడామె క్రీడాకారిణిగా అంతర్జాతీయ వేదిక మీద పతకధారిగా తన సత్తా చాటింది. ఫెన్సింగ్‌ క్రీడలో తిరుగులేని రారాణి చదలవాడ ఆనంద సుధారామన్‌ భవానీదేవి..
అది 2003… ఉత్తర చెన్నైలోని మురుగ ధనుష్కోటి బాలికల ఉన్నత పాఠశాల. ఆరో తరగతి మొత్తం సందడిగా ఉంది. పదేళ్ల వయసున్న చదలవాడ ఆనంద సుధారామన్‌ భవానీదేవిలో మాత్రం మౌనం. తనకు తెలుసు ఈ చదువులూ, మార్కులు తన వల్ల కాదని. మెల్లగా లేచి తరగతి బయటకు వెళ్లింది. అక్కడ సీనియర్‌ విద్యార్థులు ఓ కాగితంపై పేర్లు రాస్తూ కనిపించారు. ‘ఏం రాస్తున్నారు’ అని అడిగింది. ‘పాఠశాలలో కొత్తగా జిమ్నాస్టిక్స్‌, స్క్వాష్‌, ఫెన్సింగ్‌ ఆటలు చేర్చారు. ఆసక్తి ఉన్న వాళ్లు పేర్లు ఇవ్వొచ్చు…’ అని వాళ్లు సమాధానమిచ్చారు. అలా ఆ చిట్టిబుర్ర చదువు తప్పించుకునేందుకు ఆటల్లో చేరాలనుకుంది. వెంటనే పేరు ఇచ్చేసింది. అప్పటికే జిమ్నాస్టిక్స్‌, స్క్వాష్‌ విభాగాల్లో విద్యార్థులు పూర్తిగా చేరిపోయారు. ఇక మిగిలింది ఫెన్సింగ్‌ ఒక్కటే. అలా ఫెన్సింగ్‌లో చేరింది.
కట్‌ చేస్తే.. పధ్నాలుగేళ్ల తరవాత భవానీదేవి అంతర్జాతీయ ఫెన్సింగ్‌ టోర్నీల్లో భారత్‌ తరఫున బంగారు పతకం గెలిచిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర సష్టించింది. ప్రపంచ ఫెన్సింగ్‌లో భారత్‌కు ఓ స్థానం కల్పించే స్థాయికి ఎదిగింది. భారత్‌లో అంతగా ప్రాముఖ్యం లేని ఫెన్సింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది. పెద్దగా సౌకర్యాలు లేకపోయినా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా, అనుకున్నంతగా గుర్తింపు రాకపోయినా.. భవాని ఏనాడు ఆగిపోలేదు. తన ప్రయత్నాన్ని ఆపలేదు. దాని ఫలితమే అంతర్జాతీయ వేదికలపై తన మెడలో వచ్చి వాలుతున్న పతకాలు. ఇన్నీ చేసినా ఆమెకు దక్కిన గుర్తింపు తక్కువే. టాప్‌ పథకం వల్ల కొంచెమైనా ఆర్థిక సాయం అందుతోంది కాబట్టే ఎలాగోలా నెట్టుకొస్తోంది. అలా వెలుగులోకి… 2007లో అమరావతిలో జాతీయ జూనియర్‌ స్థాయి ఫెన్సింగ్‌ పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీల్లో భవానిని చూసిన సాయ్‌ కోచ్‌ సాగర్‌ లాగు ఆమెలో ఏదో ప్రత్యేకత ఉందని గుర్తించాడు.
ఆమెను కేరళలోని భారత క్రీడాప్రాధికార సంస్థ శిక్షణ కేంద్రానికి తీసుకెళ్లాడు. అక్కడే భవాని జీవితం మలుపు తిరిగింది. ఆ కేంద్రంలో ఉన్న వసతులను వినియోగించుకుంటూ ఆటలో మరింత రాటుతేలింది. రెండేళ్లలోనే ఆటపై పట్టు సాధించింది. 2009లో జరిగిన కామన్‌వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించింది. ఆ తరువాతి ఏడాది ఆసియా ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ కాంస్యం సాధించింది. ఆ తరువాతా ఆసియా, కామన్‌వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌ల్లో మెరిసింది. ఐస్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో బంగారు పతకం సాధించి రికార్డు సష్టించింది.
ఫెన్సింగ్‌.. అతి పురాతన ఆత్మరక్షణ యుద్ధ కళ..దేశంలో మిగతా క్రీడలతో పోలిస్తే ఫెన్సింగ్‌కు ఆదరణ తక్కువ. బాగా ఖర్చుతో కూడుకున్న ఫెన్సింగ్‌ పట్ల పురుషులు కూడా మక్కువ చూపరు. అలాంటిది తమిళనాడుకు చెందిన భవానీ దేవి. ఈ క్రీడను కెరీర్‌గా ఎంచుకోవడమే కాదు అంతర్జాతీయ స్థాయిలో పతకాల మోత మోగిస్తోంది.
అంతేకాదు దేశంలో ఈ క్రీడకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. హంగేరి రాజధాని బుడాపెస్టలో ఇటీవల జరిగిన వరల్డ్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిపలో ఆమె క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరింది. ఈ ఘనత సాధించిన తొలి భారత ఫెన్సర్‌గా భవానీ చరిత్ర స ష్టించింది. గత ఏడాది నవంబరులో ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో నిర్వహించిన కామన్వెల్త్‌ సీనియర్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిపలో స్వర్ణం అందుకుంది. ఈ పతకం కైవసం చేసుకున్న తొలి భారత ఫెన్సర్‌గా ఆమె రికార్డు నెలకొల్పింది.

చదలవాడ ఆనంద సుందరరమణ భవానీదేవిది చెన్నైకి చెందిన మధ్య తరగతి కుటుంబం. తండ్రి సుందరరమణ పూజారి.. తల్లి రమణి గహిణి. సుందరరమణ చిన్నతనంలో క్రికెట్‌, టేబుల్‌ టెన్నిస్‌ ఆడేవారు. ఆయన తండ్రి న్యాయవాది కాగా.. తాత వెంకటగిరి సంస్థానంలో తెలుగు పండితుడిగా పనిచేశారు. భవానీకి ఇద్దరు అన్నలు, ఓ అక్క ఉన్నారు. 11 ఏళ్ల వయస్సులో.. అంటే 2004లో ఆమె మురుగ ధనుష్కోడి బాలికల సెకండరీ స్కూల్‌లో చదువుతుండగా ఫెన్సింగ్‌ పట్ల ఆకర్షితురాలైంది. 10వ తరగతి పూర్తయ్యాక కేరళలోని తలసెర్రిలో గల సాయ్‌ కేంద్రంలో ఫెన్సింగ్‌ కోచ్‌ సాగర్‌ లగు వద్ద శిక్షణకోసం చేరింది. ఫెన్సింగ్‌లో మూడు విభాగాలు.. ఎపి, ఫాయిల్‌, సాబెర్‌ను భవానీ ఎంపిక చేసుకుంది. ఆ విభాగాల్లో సాగర్‌ శిక్షణలో రాటుదేలిన భవానీ 14 ఏళ్ల వయస్సులో టర్కీ టోర్నీతో అంతర్జాతీయ పోటీల్లో అరంగేట్రం చేసింది.. ఇక 2009లో తొలి కాంస్యంతో అంతర్జాతీయ టోర్నీల్లో పతకాల పరంపరకు శ్రీకారం చుట్టిన ఆమె ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి ఫెన్సర్ల ర్యాంకుల ఆధారంగా ఒలింపిక్స్‌ బెర్త్‌లను ఖరారు చేస్తారు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 44వ స్థానంలో ఉన్న 25 ఏళ్ల భవానీ.. టోక్యో విశ్వక్రీడలకు క్వాలిఫై అయ్యే అవకాశాలను మెరుగుపర్చుకుంది. బుడాపెస్ట్‌ ప్రపంచ చాంపియన్‌షిపలో ఆమె త్రుటిలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరే చాన్స్‌ కోల్పోయింది. రొమేనియా ఫెన్సర్‌ బియాన్క పాస్క్‌తో హోరాహోరీగా సాగిన మహిళల వ్యక్తిగత సాబెర్‌ ప్రీక్వార్టర్‌ఫైనల్స్‌లో 14-15 స్కోరు తేడాతో ఆమె ఓడిపోయింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 19వ స్థానంలో ఉన్న బియాన్కకు భవానీ ముచ్చెమటలు పట్టించడం గమనార్హం. అయితే రౌండ్‌-16లో ఓడిపోయినా తన అమోఘ ప్రదర్శనతో ర్యాంక్‌ను గణనీయంగా మెరుగుపర్చుకుంది. టోర్నీకి ముందు 67వ స్థానంలో ఉన్న ఆమె ఏకంగా 23 ర్యాంకులు ఎగబాగడం విశేషం. మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రావిడ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘గో స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌’ చేయూతతో ప్రస్తుతం ఇటలీ వేదికగాతన ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్న భవానీ.. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకోగలనన్న విశ్వాసం వ్యక్తంజేస్తోంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత.. టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యేందుకు భవానీకి రూ. 26 లక్షలు సాయంగా అందజేశారు.