వైద్యుల సమ్మెతో పేదరోగులకు ఇక్కట్లు
నేషనల్ మెడికల్ బిల్లుపై అనవసర రాద్దాంతం
బాధ్యతారాహిత్యంగా వైద్యుల తీరు
న్యూఢిల్లీ,ఆగస్ట్2-: వైద్యుల దేశవ్యాప్త సమ్మెతో రోగుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. కేంద్రం తీసుకుని వస్తున్న బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టిన సమ్మె వల్ల సామాన్యులు నలిగిపోతున్నారు.
అయితే వివాదాస్పద నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) బిల్లుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. వైద్య విద్యకు సంబంధించి అతిపెద్ద సంస్కరణగా ప్రభుత్వం అభివర్ణిస్తున్న ఈ బిల్లులో.. అవినీతికి ఆలవాలంగా మారిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పొందుపర్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలుపుతున్నారు. దీంతో వైద్యులు రోడ్డెక్కడంతో రోగులు వైద్యం అందక గిలగిల కొట్టుకుంటున్నారు. తమ వల్ల ఇలాంటి దురవస్థ ప్రజలకు రాకూడదన్న ఇంగితాన్ని వైద్యులు ప్రదర్శించలేకపోయారు. రోడ్డెక్కి నినాదాలు చేస్తూ ఆస్పత్రులను గాలికి వదిలేశారు. నిజంగా ఇది బాధ్యతారాహిత్యం కాక మరోటి కాదు. లోక్‌సభలో ఇప్పటికే ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. తాజాగా రెండు సవరణలకు లోక్‌సభ ఆమోదం తెలపాల్సి ఉన్న నేపథ్యంలో మరోసారి ఈ బిల్లు లోక్‌సభకు వెళ్లనుంది. బిల్లుపై జరిగిన చర్చకు ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సమాధానమిస్తూ నకిలీ వైద్యులకు అడ్డుకట్ట వేసేలా ఈ బిల్లు ఉందన్నారు. తప్పుడు వైద్య విధానాలకు పాల్పడేవారికి సంవత్సరం జైలు శిక్షతో పాటు, రూ. 5 లక్షల జరిమానా విధించే ప్రతిపాదన బిల్లులో ఉందన్నారు. ఇప్పటివరకు అలాంటి వారికి ఎంసీఐ నామమాత్రపు జరిమానా మాత్రమే విధించేదని తెలిపారు. ఈ బిల్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిందని, అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆ వ్యవస్థను అమలు చేస్తున్నాయని, భారత్ కూడా ఆ దిశగా వెళ్తోందని చెప్పారు. ఎన్‌ఎంసీలోని 25 మంది సభ్యుల్లో 21 మంది వైద్యులేనని, వారు సీహెచ్‌పీల అర్హతలను నిర్ణయిస్తారని హర్షవర్ధన్ వివరించారు. దీంతో వైద్యులు దీనిని వ్యతిరేకించి వీధిన పడ్డారు. బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడం ప్రస్తుతానికి అయితే సంకటంగా మారింది. వైద్యసేవల విషయంలో దాదాపు అన్ని రాష్ట్రల్లోని నగరాలకూ, పట్టణాలకూ… పట్టణాలకూ, గ్రామాలకూ మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. మైదాన ప్రాంతాలకూ, ఆదివాసీ ప్రాంతాల మధ్యా అనేక తేడాలు ఉన్నాయి. మారుమూల పల్లెలకు నేటికీ వైద్యం అందని ద్రాక్షగా మారింది. మరో దశాబ్ద
కాలంలో…అంటే 2030నాటికి ప్రపంచంలోని ప్రతి దేశమూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలని ఐక్యరాజ్యసమితి నిర్దేశిరచింది. నీతిఆయోగ్ 2015 నుంచి ఏటా ఈ ఆరోగ్య సూచీని విడుదల చేస్తోంది. విషాదమేమంటే వీటిని గమనించుకుని సరి చేసుకోవాలని, ఇకపై మరింత మెరుగైన పనితీరును ప్రదర్శించాలని ప్రయత్నిస్తున్న దాఖలాలు కానరావడం లేదు. అత్యధిక రాష్ట్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కనీస పారిశుద్ధ్యం కొరవడి వైరస్‌లతో, బాక్టీరియాతో నిండి ఉంటున్నాయి. ఎక్కడా కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండటం లేదు. మందులు లేక, వైద్యులు లేక ఆసుపత్రులన్నీ అల్లాడు తున్నాయి. అనేకమంది పసిపిల్లల ప్రాణాలు తీసిన ముజఫర్‌పూర్ ఆసుపత్రి దుస్థితి ఇందుకు తాజా ఉదాహరణ. వైద్య సదుపాయాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, లాన్‌సెట్ కూడా అడపాదడపా హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ ఎక్కడా కదలిక ఉండటం లేదు. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లోని గ్రావిూణ ప్రాంతాల్లో మెజారిటీ జనం ఆరోగ్యానికి పెట్టే ఖర్చులు తడిసి మోపెడై అప్పుల బారినపడుతున్నారని ఒక సర్వే వెల్లడించింది. కొన్ని కుటుంబాల్లో తలసరి వినిమయం కన్నా ఆరోగ్య వ్యయమే అధికంగా ఉంటున్నదని తేల్చిచెప్పింది. నవజాత శిశు మరణాలు, శిశు మరణాలు, సంతాన సాఫల్యత రేటు, తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్య, వ్యాధి నిరోధకత, క్షయవ్యాధి, మౌలిక సదుపాయాలు, హెచ్‌ఐవీ వంటివి అరికట్టడంలో సాధిస్తున్న పురోగతి, మౌలిక సదుపాయాల కల్పనలో సాధిస్తున్న ప్రగతి వగైరా అంశాలు అందులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, 108 వంటి ప్రాణప్రదమైన సేవలు నామమాత్రంగా మారాయి. నీతిఆయోగ్ ప్రాతిపదికల్లో ఇంకా అంటురోగాలు, మానసిక అనారోగ్యం, భయంకర వ్యాధులు వగైరాలను చేరిస్తే వాస్తవ చిత్రం మరింత స్పష్టంగా వెల్లడవుతుంది. ఇలాంటి దశలో వైద్యరంగాన్ని పటిష్ట పరుస్తున్న దశలో వైద్యుల సమ్మెలు ఆందోళన కలిగిస్తున్నాయి. జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) బిల్లును రాజ్యసభలోనూ ఆమోదించడంతో జూనియర్ వైద్యులు ఆందోళనను ఉద్ధృతం చేశారు. బిల్లులోని అభ్యంతరకర అంశాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. గత మూడు రోజులుగా ఓపీ, ముందస్తు ఎంపిక చేసుకున్న శస్త్రచికిత్సలను బహిష్కరిస్తూ వచ్చిన జూడాలు అత్యవసర సేవల్లోనూ పాల్గొనేది లేదని తేల్చిచెప్పారు.అత్యవసర సేవలను బహిష్కరించారు.
ప్రభుత్వ వైద్య విద్యార్థులకు నష్టం కలిగించే విధంగా ఎన్‌ఎంసీ బిల్లులో అంశాలను పొందుపర్చారని ఆరోపిస్తూ జూనియర్ వైద్యులు సమ్మెను కొనసాగించారు. తమ డిమాండ్లను సాధించే వరకు దీక్షను కొనసాగిస్తామని, అఖిల భారత స్థాయిలో ఐఎంఏ, జూడాల నేతలతో సంప్రదించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఓపీలో వైద్యుని సంప్రదింపుల్లో జూడాలే కీలక భూమిక పోషిస్తుండడంతో వారి సమ్మె ప్రభావం ఓపీపై తీవ్రంగా పడింది. ప్రభుత్వ వైద్యులు, సీనియర్ రెసిడెంట్లు, సర్వీస్ పీజీలు ఉన్నప్పటికీ రోగులు పెద్దసంఖ్యలో రావడంతో వారిని పరీక్షించేందుకు ఐదారుగంటల సమయం పట్టింది. విధులను బహిష్కరించడంతో శస్త్రచికిత్స విభాగాల్లో పెద్దఎత్తున ఆపరేషన్లు నిలిచిపోయాయి.