రివర్స్‌ టెండరింగ్‌కు కసరత్తు కేంద్రం అనుమతి రాగానే నోటిఫికేషన్‌

అమరావతి,ఆగస్ట్‌2-: నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పోలవరం హెడ్‌ వర్క్స్‌లో మిగిలిన పనులతోపాటు జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రివర్స్‌ టెండరింగ్‌ వల్ల పోలవరం హెడ్‌ వర్క్స్‌, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల్లో భారీగా ప్రజాధనం ఆదా అవుతుందని జలవనరుల శాఖ, ఏపీ జెన్‌కో వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పీపీఏ గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేయాలన్నా, కొత్తగా టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలన్నా కేంద్ర జల్‌ శక్తి, పీపీఏ నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ నేపథ్యంలో పోలవరం హెడ్‌ వర్క్స్‌లో మిగిలిన పనులకు రివర్స్‌ టెండరింగ్‌కు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ పీపీఏ, కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌లకు లేఖ రాయనున్నారు. పోలవరం బాధ్యతలను గత ప్రభుత్వానికి అప్పగించిన సమయంలో కేవలం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే రీయింబర్స్‌ చేస్తామని, జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయంతో తమకు సంబంధం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాక పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థతో హెడ్‌ వర్క్స్‌ పనులకు జలవనరుల శాఖ, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఏపీ జెన్‌కో ఒప్పందం చేసుకోనున్నాయి. ఆయా 
పనులు చేసిన మేరకు జలవనరుల శాఖ, ఏపీ జెన్‌కోలు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించనున్నాయి. 
కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పుడే ఆర్థికపరమైన లావాదేవీలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు 960 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణ పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని పేర్కొంటూ నవయుగ సంస్థకు ఏపీ జెన్‌కో నోటీసులు జారీ చేసింది. ఇదే అంశాన్ని పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ(పీపీఏ), కేంద్ర జల్‌ శక్తి శాఖలకు వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో హెడ్‌ వర్క్స్‌, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఈ పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించేందుకు వీలుగా నోటిఫికేషన్‌ జారీ చేస్తామని జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి.