బలపరీక్షలో నెగ్గిన .. యడ్యూరప్ప

  •  నెలరోజుల కన్నడ రాజకీయ సంక్షోభానికి తెర 
  • – యడ్యూరప్పకు అనుకూలంగా 106 ఓట్లు 
  • మేజిక్‌ ఫిగర్‌ కంటే బీజేపీకి అదనంగా రెండుఓట్లు 
  • ఓటింగ్‌ ముగిసిన వెంటనే రాజీనామా చేసిన స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ 
  • – సుప్రీంకోర్టును ఆశ్రయించిన అనర్హత ఎమ్మెల్యేలు 

బెంగళూరు, జులై29 : కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తెరపడింది. నెలరోజుల ఉత్కంఠ అనంతరం సోమవారం నిర్వహించిన బలపరీక్షలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప విజయం సాధించారు. బలపరీక్షలో బీజేపీకి 106 ఓట్లు లభించాయి. ప్రస్తుతం సభలో సభ్యుల సంఖ్యను బట్టి సాధారణ మెజార్టీ కంటే రెండు ఓట్లు ఎక్కువ రావడంతో యడ్యూరప్ప బలపరీక్షలో గెలుపొందారు. మూజువాణి ఓటు ద్వారా విశ్వాస పరీక్షలో యడ్డీ నెగ్గినట్లు స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించారు. రాజీనామాలు చేసిన 17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యే సంఖ్య 224 కాగా, 17 మందిపై అనర్హత వేటు వేయడంతో 207 కు చేరింది. బల పరీక్షలో నెగ్గేందుకు మేజిక్‌ ఫిగర్‌ 104 కాగా, బీజేపీకి సొంతంగా 105మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో యడ్డీ విజయం లాంఛనమైంది. అంతకు ముందు బలపరీక్ష సందర్భంగా తమ సభ్యులందరూ అసెంబ్లీకి రావాలని భాజపా విప్‌ జారీ చేసింది. విధాన సౌధకు చేరుకునే ముందు యడ్డీ బెంగళూరులోని శ్రీ బాల వీరాంజనేయ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం విధాన సౌధకు బయల్దేరి వెళ్లారు. 105 మంది ఎమ్మెల్యేలు అందరూ ఒకేమాటపై ఉండాలని సీఎం సూచించారు. మరోవైపు కాంగ్రెస్‌ కూడా సభాపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు గుండు దినేశ్‌ రావు, కేజే జార్జ్‌, ప్రియాంక్‌ ఖర్గే, ఎంపీ పాటిల్‌, ఈశ్వర్‌ ఖాండ్రే, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అనంతం విధాన సౌధకు బయల్దేరి వెళ్లారు. స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ సభను ప్రారంభించారు. 
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలిసిపోరాడదాం – సీఎం యడ్యూరప్ప 
అసెంబ్లీలో విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం యడ్యూరప్ప మాట్లాడారు. కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి అధికారంలో ఉన్నప్పుడు నేనెప్పుడూ అసంబద్ధ రాజకీయాలకు పాల్పడలేదన్నారు. నన్ను అవమానించిన వాళ్లను క్షమించి వదిలేయడం నా అలవాటు అని అన్నారు. వారి పాలన పక్కదారి పట్టిందని, అందుకే మేం దాన్ని సరైన దారిలో పెట్టామన్నారు. నేను సభ సాక్షిగా అందరికీ మాటిచ్చానని, నా ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు తావు లేదని, పీఎం కిసాన్‌ పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని భావిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బాటలో మేం కూడా నడుస్తామని అన్నారు. నేనీ సందర్భంగా ప్రతిపక్షాన్ని ఒకటే కోరుకుంటున్నానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి పోరాడదామని, ప్రతిపక్ష నేతలు కూడా నా విూద నమ్మకం పెట్టుకోవాలని యడయూరప్ప అన్నారు. 
నాకే కాదు.. మోడీకి కూడా శాశ్వతం కాదు – కుమారస్వామి 
నాకే కాదు.. నరేంద్ర మోడీకైన, మరివరికైనా.. అధికారం శాశ్వతం కాదని కర్ణాటక మాజీ 
ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించబోమని చెప్పారు. సీఎం కుమారస్వామి కరవు గురించి మాట్లాడడం అభినందించదగ్గ విషయమన్నారు. ప్రజల కోసం ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు. రెబల్‌ ఎమ్మెల్యేలను బీజేపీ నడిరోడ్డుపై వదిలేసిందని సానుభూతి చూపించారు. రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి స్పీకర్‌ రమేష్‌కుమార్‌ సరైన పనే చేశారని, ప్రతి సభ్యుడి వినతిని పరిశీలించిన తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటించారని కుమారస్వామి చెప్పారు. 
ప్రజలకోసం పనిచేసేందుకు మనం ఎన్నికైంది – సిద్ధరామయ్య 
ప్రజలకు సేవచేసేందుకు మనం ఎన్నికమయ్యామని, ఆ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యడ్డీకి శుభాకాంక్షలు చెప్పారు. కుమార స్వామి బలపరీక్ష పెట్టినప్పుడు దీనిపై నాలుగు రోజుల పాటు చర్చించామని, నేను కూడా ఈ చర్చల్లో పాల్గొన్నాన్నారు. దాని గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదని, యడియూరప్ప ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు అంటూ సిద్ధిరామయ్య పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తానని యడియూరప్ప హావిూ ఇచ్చారని, ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ప్రజల కోసం పనిచేయడానికే మనం ఎన్నికైందన్నారు. మనం దాని కోసమే పాటు పడాలని, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో నా బాధ్యతను నిర్వర్తించగలిగాననని, గత 14నెలల కాలంలో రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నేను కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టానని, రెండు దఫాలుగా రైతులకు సాయం అందిస్తామని సీఎం చెప్పారు. నేను ఈ పథకాన్ని 2018 ఫిబ్రవరిలోనే ప్రకటించానని, ‘రైత బేలకు’ పేరుతో ఈ పథకం తెచ్చామని, ఇదే కొత్త పథకం కాదని సిద్దరామయ్య తెలిపారు. 
స్పీకర్‌ రమేష్‌ రాజీనామా .. 
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ కె.ఆర్‌.రమేశ్‌ కుమార్‌ తన పదవికి రాజీనామా చేశారు. గతకొంత కాలంగా రాష్ట్రంలో సాగుతోన్న రాజకీయ సంక్షోభానికి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన స్పీకర్‌ సోమవారం తన పదవి నుంచి తప్పుకున్నారు. అసెంబ్లీలో యుడియూరప్ప విశ్వాస పరీక్షలో విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే ఆయన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సభలోనే ఆయన రాజీనామా లేఖను సభ్యులందరికీ చదవి వినిపించారు. కాగా స్పీకర్‌ రాజీనామాకు ఒక్కరోజు ముందు (ఆదివారం) 14 మంది సభ్యులపై అనర్హత వేటు వేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి.. సభా నియమాలను ఉల్లంఘించినందుకు వారిపై వేటు వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. కాగా కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్‌ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి అనంతరం.. స్పీకర్‌ను దింపేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్‌ కె.ఆర్‌.రమేశ్‌ కుమార్‌ వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సందేశాన్ని పంపింది. స్వచ్ఛందంగా తప్పుకోకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలవంతంగా సాగనంపాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సోమవారం సభలో జరిగిన విశ్వాస పరీక్షలో యడియూరప్ప సర్కార్‌ విజయం సాధించడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో బీజేపీ నూతన స్పీకర్‌ను ఎన్నుకోనుంది. 
సుప్రీంను ఆశ్రయించిన అనర్హత ఎమ్మెల్యేలు.. 
స్పీకర్‌ అనర్హులుగా ప్రకటించిన ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానాన్నిఆశ్రయించారు. తమపై 2023 వరకు అనర్హత వేటు వేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ కాంగ్రెస్‌కు చెందిన రమేశ్‌ జార్కి¬ళి, మహేశ్‌ కుమటళ్లి, స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్‌ శంకర్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.