పేదవిద్యార్థుల కోసం విద్యాలక్ష్మి ఉన్నత చదువులకు కేంద్రం చేయూత
హైదరాబాద్,జూలై 18: పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2015-16లో ప్రవేశపెట్టింది. చాలామందికి ఈ పథకంపై అవగాహన లేక వినియోగించుకోలేకపోతున్నారు. కేంద్ర ఆర్థికశాఖ, మానవ వనరుల అభివృద్ధిశాఖ, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్లు కలిసి సంయుక్తంగా దీనిని అందుబాటులోకి తెచ్చాయి. విద్యాలక్ష్మి పథకం ద్వారా రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఇందుకు అవసరమైన రీతిలో కేంద్ర ప్రభుత్వం రూ.4.5 లక్షల వరకు వడ్డీ భరిస్తుంది. అమ్మాయిల చదువులను ప్రోత్సహించేందుకు మరింత రాయితీ ఇస్తున్నారు. రుణం రూ.7.5 లక్షలు దాటితే పూచీకత్తు ఉండాలి. ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ డిఎ/-లొమా, ప్రొఫెషనల్ కోర్సులు, కాస్ట్ అకౌంటెన్సీ, చార్టెడ్ అకౌంటెంట్, ఐఐఎం మేనేజ్మెంట్, ఐఐటీ, వృత్తి విద్యాకోర్సులు, విమానయాన రంగానికి సంబంధించిన కోర్సులు చదివేవారు ఈ రుణం పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ, ఎంఐసీటీఈ, ఇతర ప్రభుత్వ అధీకృత సంస్థలు, విశ్వవిద్యాలయాలలో చదువుకునే వారికి రుణాలు అందుతాయి. రుణం పొందేందుకు పోర్టల్లో నమోదు చేసుకున్నాక వెబ్సైట్లో లాగిన్ కావాలి. అందులో అడిగిన వివరాలు నమోదు చేయాలి. ఒక విద్యార్థి ఒకేసారి గరిష్ఠంగా మూడు బ్యాంకులకు విద్యారుణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. విద్యాలక్ష్మి పథకంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద విద్యార్థులు రుణాలు పొందేందుకు తగు పత్రాలను దరఖాస్తుతోపాటు జతపర్చాల్సి ఉంటుంది. టీసీ, మార్కుల జాబితా, ఇంతవరకు పొందిన ఉపకార వేతనాల పత్రాలు, ఉన్నత విద్యకు సంబంధించిన ర్యాంక్ కార్డు, ప్రవేశ అనుమతి పత్రాలు, చదవాల్సిన కోర్సుకు సంబంధించిన ఫీజుల అంచనా వివరాలు జతచేయాలి.