పల్లె పదాలు కలబోసిన
ఓ..బేబీ
గాన గంధర్వులను పరవశింపజేసిన పల్లె కోయిల..! ఆమె ఓ పల్లెటూరుకు చెందిన సాధారణ గహిణి.. పేరు బేబీ. ఊరు తూర్పుగోదావరి జిల్లా వడిశలేరు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే కుటుంబం. అక్షరమైనా చదవలేని నిరక్షర గృహిణి. ఓ మనవరాలిని కూడా ఎత్తుకున్న ఆమెకు పాటలు పాడటం ఇష్టమైన వ్యాపకం. టీవీల్లో, రేడియోల్లో వచ్చిన పాటలను గుర్తుపెట్టుకుని యథాతథంగా పాడటం ఆమె మనసుకు నచ్చే ప్రక్రియ.
మలుపు తిప్పిన ఓ చెలియా..
పనితో పాటే పాటనూ ప్రేమించింది. నలుగురికి తన గానామతం పంచుతూ వచ్చింది. గంజి కోసం పక్క ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఆమె పాటను ప్రేమించే ఓ అమ్మాయి.. బేబీ పాటను ఆమెకు తెలియకుండానే రికార్డు చేసింది.
ఓ చెలియా నా ప్రియసఖియా..అంటూ బేబీ ఆలపించిన ఆ పాట ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టి.. ఫేస్ బుక్‌కు ఎక్కిన ఆమె పాట ప్రపంచానికి పరిచయమైంది. ఏళ్ల తరబడి సాధన చేసిన వారు కూడా పాడలేనంత అలవోకగా.. శ్రుతిలయలు తప్పకుండా ఆమె పాడుతున్న తీరు సంగీత ప్రియులను మైమరపింప చేసింది. అంతే.. సోషల్ మీడియాలో ఆమె ఓ సంచలనంగా మారింది. క్రమంగా టీవీ ఛానళ్లు ఆమెతో పాటలు పాడించుకోవడం.. సినీ ప్రముఖులు మెచ్చుకోవడం.. సినిమా అవకాశాలు ఇవ్వడం ఒకదాని వెంట ఒకటిగా జరిగిపోయాయి.
మట్టి మనిషినండీ నేను..
ఇప్పుడామె ఓ ప్రముఖ గాయనిగా మారింది. సంగీత దర్శకులు రఘు కుంచె, కోటి వంటి వారు ఆమెకు సినిమా పాటల అవకాశాలు ఇచ్చారు. రఘు కుంచె సంగీత దర్శకత్వంలో ఆమె పాడిన ” మట్టి మనిషినండీ నేను..మాణిక్యమంటారు నన్ను..” పాట.. ఆమె పరిచయ గీతంగా మారింది.
బాలు మెచ్చిన బేబీ
తాజాగా సింగర్ బేబీని గాన గంధర్వుడుగా పిలుచుకునే బాల సుబ్రహ్మణ్యం ప్రశంసించారు. ఆమెను తన పాడుతా తీయగా ప్రోగ్రామ్‌కు అతిథిగా ఆహ్వానించి ఆమెతో పాట పాడించారు. ఆ కార్యక్రమంలో తూనీగా తూనీగా పాటను ఆలపించి బేబీ అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆమె పాట పూర్తికాగానే బాలు లేచి చప్పట్లతో ఆమెను అభినందించారు. పాడుతా తీయగా కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు కూడా బేబీ పాట పూర్తికాగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ సందర్భంగా సింగర్ బేబీపై బాలు ప్రశంసల వర్షం కురిపించారు. ఒక పాట వీడియోకు కొన్ని లక్షల లైకులు, వ్యూలు రావడం సంగీత స్రష్టలకే కష్ట సాధ్యంగా ఉంటుందని అలాంటిది బేబీ పాటకు లక్షల్లో లైకులు రావడం చెప్పుకోదగిన గుర్తింపుగా వర్ణించారు. సోషల్ మీడియా వల్ల జరుగుతున్న మంచిలో ఇదొకటిగా బాలు అభిప్రాయపడ్డారు. ఒక పల్లెటూరి రైతుకూలీ ఇంత శ్రుతిపరంగా పాడటం చాలా అరుదని మెచ్చుకున్నారు. ఇంత మంచి మట్టిలో మాణిక్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన అమ్మాయి కాళ్లకు సంగీత ప్రపంచమంతా దండం పెట్టుకోవాలని ఎస్పీ బాలు అన్నారు.
బేబీ కుటుంబంలో ఎవరో ఒకరు సంగీతానికి సంబంధించి ఉండి ఉంటారని లేకపోతే ఇంత సంగీత సంస్కారం అసాధ్యమని బాలు అభిప్రాయపడ్డారు. తనను పిలిచి గౌరవించి పాడుతాతీయగాపై పాట పాడే అవకాశం ఇచ్చిన బాలు గారికి బేబీ కతజ్ఞతలు తెలిపింది. తనకు బాగా ఇష్టమైన గాయకుడు బాలుసుబ్రహ్మణ్యం గారని.. ఆయన పాటలు పాడుకుంటూ పెరిగానని బేబీ చెప్పారు. బాలు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. నిజమైన పల్లె మాణిక్యం బేబీ మరిన్ని సంగీత విజయాలు అందుకోవాలని ఆశిస్తోంది సోషల్ మీడియా. మరిన్ని పల్లె తేజాలు ప్రపంచానికి పరిచయమవ్వాలని రూరల్ మీడియా ఆకాంక్షిస్తోంది.
ఏ.ఆర్. రెహ్మాన్ మెచ్చుకోలు:
చిన్న పల్లెటూరు, పూట గడవాలి అంటే పని చెయ్యాల్సిందే, ఒక పాట.. ఒకే ఒక పాట, బేబీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఏ.ఆర్.రెహమాన్ నుండి మెగా స్టార్ చిరంజీవి వరకు ఆమెను అభినందించారు, మెగా స్టార్ చిరంజీవి స్వయంగా బేబీ ను ఆయన ఇంటికి ఆహ్వానించి ఆమె కు కొంత నగదు ఇచ్చి ఆమెకు అండగా నిలుస్తా అని హామీ ఇచ్చారు. సంగీత దర్శకుల్లో కోటి నుండి రఘు కుంచె వరకు అందరూ ఆమెకు అండగా నిలిచారు.
ఈ పల్లె కోయిల తో రఘు కుంచె గుండెలకు హత్తుకు పోయే పాట పాడించాడు, ఆ పాట ఇప్పుడు యూట్యూబ్‌ని ఊపేస్తోంది, ‘మట్టి మనిషినండి నేను’ పాటకు యూట్యూబ్ లో బ్రహ్మాండమైన స్పందన వస్తుంది, విడుదల అయిన మూడు రోజుల్లోనే 1 మిలియన్ వ్యూస్ ధాటి సంచలనం సష్టించింది, ఇప్పటి వరకు ఈ పాటకు దాదాపు 12 లక్షల వ్యూస్ వచ్చాయి, పాట వైరల్ అవ్వడంతో ఈ పాటకు కచ్చితంగా కోటికి పైగా వ్యూస్ వస్తాయి.
అదష్టమే కాదు, ప్రతిభ కూడా..:
చదువు రాకపోయినా, చరణాలు రాగాలు అలవాటు లేకపోయినా, జీవితంలో గరళాన్ని మింగి తన గొంతులోని అమతాన్ని మన చెవుల్లో పోసిన ఒక పల్లె కోయిల పాడిన పాట అందరిని ఆకట్టుకుంటుంది అంటే, కేవలం అదష్టమే కాదు, ఆమె ప్రతిభ అనే చెప్పాలి. పల్లె కోయిల అనే బిరుదు ఆమెకు అంకితం ఇచ్చారు జనాలు, యూట్యూబ్‌లో దాదాపు 90 వేళ లైక్స్ వచ్చాయి ఈ సాంగ్ కి నాలుగు రోజుల్లో.
సినిమాల్లో కూడా.. :
ఈ పల్లె కోయిలమ్మతో సినిమాల్లో కూడా పాటలు పాడియ్యాలని మ్యూజిక్ డైరెక్టర్స్ ఏ కాదు, దర్శక, నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో బేబీ ఒక పెద్ద సింగర్ అవుతుందని చాలా మంది అనుకుంటున్నారు, ఆమె ఇన్ని రోజులు పడిన కష్టానికి ఆమె గాత్రం సహాయం చేసిందని నెటిజన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
చిరు సైతం మెచ్చుకున్న వేళ
బేబమ్మ ప్రతిభకు ముగ్ధుడైన రఘు ఆమె కోసమే తయారు చేసిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ వీడియోగా మారింది. ‘ఓ చెలియా నా ప్రియ సఖియా..’ అంటూ కొద్ది రోజుల క్రితం ఆమె గానంతో పురివిప్పుకున్న వ్యక్తే ఈ బేబమ్మ. ఆమె పాడిన ఆ పాట తాలూకు వీడియో తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అయింది. మట్టిలో మాణిక్యం, పల్లెకోకిల బేబీ పాటకు సినీ పరిశ్రమలోని చాలా మంది ప్రముఖులు స్పందించారు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు ఆమెను వరించాయి. ఆమె పాటకు ఫిదా అయినా మెగాస్టార్ తన సతీమణి కోరిక మేరకు మ్యూజిక్ డైరెక్టర్ కోటి సహకారంతో బేబీని ఇంటికి పలిపించుకుని అభినందించారు. ఆమె పాటను విని సతీసమేతంగా పరవశించుపోయారు మెగాస్టార్. తన అభిమాన నటుడి పిలుపు అందుకుని ఇంటికి వెళ్లిన బేబీ చిరంజీవిని చూసి ఆనందంతో పరవశించిపోయింది. మెగాస్టార్‌ని చూసి ఇక చనిపోయినా పర్లేదు మిమ్మిల్ని చూశా అని చిరు కాళ్లపై పడింది. మీలాంటి టాలెంట్ ఉన్న వాళ్లు ఈ పరిశ్రమలో ఉండాలి. ఈ పరిశ్రమను బ్రతికించాలి అంటూ ఆమెతో పాటలు పాడించుకున్నారు చిరు.
ఈ సందర్భంగా మెగాస్టార్ నటించిన ‘రుద్రవీణ’ మూవీ నుండి ‘లలిత ప్రియ గమనం’ అంటూ బేబీ పాడిన పాటకు మెగాస్టార్ పరవశించి పోయారు. ప్రస్తుతం ఈమె పాడిన పాట మట్టిమనిషనమ్మ అనే పాటకు వర్ధమాన రచయిత లక్ష్మీ భూపాల సాహిత్యం అందించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైైరల్‌గా మారిన ఈ పాటతో మరోసారి బేబమ్మ వార్తల్లో నిలిచింది.