మహా నగరాలు ‘ఊపిరి’ పీల్చుకుంటున్నాయి
లాక్ డౌన్ ప్రభావంతో 90కి పైగా భారత నగరాలలో మెరుగవుతున్న వాయు నాణ్యత
- ఢిల్లీలో 70 శాతం తగ్గిపోయిన నైట్రోజన్ ఆక్సైడ్
- పది రోజుల్లో మెరుగైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
- 150 నుంచి 82 పాయింట్లుగా నమోదు
- కాలుష్యపు కోరలనుంచి కాపాడుతున్న కరోనా
- సాధారణంగా వేసవిలో కాలుష్యం ఎక్కువ
- ఈ సారి వేసవిలో అతి తక్కువగా నమోదు
- వాహనాలు రోడ్డెక్కకపోవడంతో తగ్గిన కర్బన ఉద్గారాలు
- తెలుగు రాష్ట్రాలలో ఈ సారి వడగాల్పులు తక్కువే
హైదరాబాద్: గుండెలనిండా శుభ్రమైన గాలి పీల్చుకోవడమనేది తీరని కోరిక మన దేశంలోని నగరవాసులకు. ప్రపంచంలోని అత్యంత కలుషిత వాతావరణం ఉన్న మొదటి ముప్పై నగరాల్లో 21 మనదేశంలోనే ఉన్నాయి మరి. ఈ లాక్ డౌన్ వేళ… అవన్నీ రూపు మార్చుకున్నాయి. శుభ్రంగా స్వచ్ఛంగా వీస్తున్న గాలితో తమ అందాలను ప్రదర్శిస్తున్నాయి. గాలి ఎంత శు భ్రపడకపోతే- పంజాబ్ లోని జలంధర్ వాసులకు వంద మైళ్ల దూరాన ఉన్న హిమాలయాలు కన్పిస్తాయి! నాలుగు నెలల క్రితం కాలుష్యాన్ని తట్టుకోలేక పిల్లలకు బడులు మూసివేసిన దిల్లీ నగరం ఇప్పుడు నిర్మలమైన ఆకాశాన్ని చూసి మురిసిపోతోంది. లాక్ డౌన్ మొదలయ్యాక రెండు వారాలకే అక్కడ వాయు కాలుష్యం సగానికి సగం తగ్గిపోయి ప్రమాదకర స్థాయినుంచి ‘సంతృప్తికరం’ అన్న స్థాయికి వచ్చింది. లాక్ డౌన్ కి ముందు వారాంతంలో 159 పాయింట్లు నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పదిరోజులకే 82కి తగ్గింది. దిల్లీవాసుల ఆరోగ్యానికి హానికరంగా మారిన పార్టిక్యులేట్ మ్యాటర్, నైట్రోజన్ ఆక్సైడ్ల కాలుష్యం 70 శాతం తగ్గిపోయిందట. దీనంతటికీ పరిశ్రమలూ వాహనాలూ విడుదలచేసే విషవాయువులు ఆగిపోవడమే కారణం. వాతావరణంలోని ఈ కలుషిత ధూళికణాలే కాంతినీ అడ్డుకుంటాయి. దాంతో మంచుతెరలకు కాలుష్యపు పొరలు తోడై దృశ్యాలన్నీ మసకగా కనిపించేవి. ఒక్క దిల్లీ అనే కాదు, వారణాసి, ముంబయి, హైదరాబాద్… ఇలా దేశంలోని 85 నగరాల్లో ఆ తేడా స్పష్టంగా కనిపించింది. అన్నిట్లోనూ వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయి నుంచి సంతృప్తికర స్థాయికి వచ్చింది. గాలి కలుషితమవడానికి మరో ప్రధాన కారణమైన విమానాలు కూడా ఆగిపోవడంతో ఆకాశమూ మురికిని వదిలించుకుని నీలాకాశం అన్న పేరును సార్థకం చేసుకుంది. దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఆర్ధిక నష్టం జరుగుతుంది. కరోనా మహమ్మారి వల్ల తీవ్ర ప్రాణ నష్టం కూడా జరుగుతుంది . కానీ ప్రస్తుత పరిస్థితి వల్ల భూమి కాస్త ఊపిరి తీసుకుంటుంది. కాలుష్యం తగ్గుతోంది. ఢిల్లీ సహా 90 నగరాల్లో కొద్దిరోజులుగా కనీస స్థాయి కాలుష్యం నమోదవుతోంది. దీంతో వాయు నాణ్యత మెరుగుపడుతోంది. కాలుష్య నివారణ కోసం ఇలాంటి ప్రయోగాలు ఎన్నడూ చెయ్యని సర్కార్ ప్రజల ప్రాణాలకు కరోనా మహమ్మారితో ముప్పు ఉన్న నేపధ్యంలోనే లాక్ డౌన్ చేసింది. దీని వల్ల స్వచ్ఛ వాయువులు పీల్చుకునే అవకాశం కలుగుతుంది. శబ్ద కాలుష్యం , వాయు కాలుష్యం లేని ప్రశాంతమైన నగరాలు కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా వేల మంది ప్రాణాలు హరిస్తుంది . లక్షల సంఖ్యల్లో వైరస్ బారిన పడిన వారు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు .ఒకరి ద్వారా మరొకరికి సోకకుండా ఉండాలంటే.. ప్రజలు బయట తిరగకుండా ఉ ంటే మంచిదని భావించి లాక్ డౌన్ విధిస్తున్నాయి చాలా దేశాలు . ఫలితంగా ప్రజలు రోడ్డెక్కడం లేదు . ఇక అత్యవసరం మినహాయించి నిత్యం వినిపించే రణగణ ధ్వనులు వినిపించడం లేదు. ట్రాఫిక్ సమస్య లేదు. శబ్ద కాలుష్యం , వాయు కాలుష్యం లేని ప్రశాంతమైన నగరాలు భూమిని బ్రతికిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా తగ్గిన వాయు కాలుష్యం దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నిన్నా మొన్నటి దాకా డేంజర్ బెల్స్ మోగించింది . స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే సాధ్యమయ్యేది కాదు. వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో ఢిల్లీ వాసులు ఇబ్బంది పడ్డారు . ప్రపంచంలోనే వాయు కాలుష్యం అధికంగా ఉన్న జాబితాల్లో భారత్ ఎప్పుడో చేరిపోయింది . ఇక ఇప్పుడు కానీ కరోనా పుణ్యమా అని తగ్గిపోయింది. గాలిలో సూక్ష్మ ధూళి కణాలు, నైట్రోజన్ ఆక్సైడ్ భారీగా తగ్గినట్టు సఫర్ సంస్థకు చెందిన ఓ సైంటిస్టు వెల్లడించారు. దేశమంతా స్వచ్చమైన గాలి … పెరిగిన వాయు నాణ్యత సర్వసాధారణంగా మార్చి నెలలో గాలిలో నాణ్యత సూచి మధ్యస్తంగా ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. వాయు నాణ్యతను సూచించే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెయ్యి వరకు ఉండేదని, కానీ కరోనా వల్ల ఇది ఏకంగా 129కి పడిపోయిందని ఇక వాతావరణ శాఖ కూడా వెల్లడిస్తుంది . ఢిల్లీలో వీస్తున్న గాలి చాలా స్వచ్చంగా ఉందని ఈ సందర్భంగా చెప్పారు. ఇక ఢిల్లీలోనే ఇలా ఉంటే మిగతా నగరాలలో ఏ మేరకు వాయు కాలుష్యం తగ్గి ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు .