దేశంలో 10 వేలు దాటిన కరోనా కేసులు

వెల్లడించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 

న్యూఢిల్లీ: భారత్ లో అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్ కేసుల సంఖ్య 10వేలు దాటింది. గడచిన 24గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా వేయికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. కొత్తగా నమోదైన కేసుల్లో దాదాపు 700 కేసులు దిల్లీ, మహారాష్ట్రలోనే నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,363కి చేరిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ వైరస్ బారినపడి 339మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల్లో 1036మంది కోలుకోగా ప్రస్తుతం మరో 8988మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలోనే 160మరణాలు.. దేశంలో సంభవించిన కరోనా మరణాల్లో సగం మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 160కి చేరింది. గడచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 349 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2334కి చేరింది. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబయిలో కొవిడ్-19 తీవ్రత ఆందోళనకరంగా ఉంది. ఢిల్లీ, తమిళనాడులలో పెరుగుతున్న తీవ్రత… నిజాముద్దీన్ ఘటన అనంతరం దేశ రాజధాని దిల్లీలో కరోనా తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కేవలం ఒక్కరోజే 356 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో దిల్లీలో కేసుల సంఖ్య 1510కి చేరింది. వీరిలో 28మంది మృత్యువాతపడ్డారు. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి ప్రజలను ఇళ్లనుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక తమిళనాడులోనూ కొవిడ్-19 తీవ్రత కొనసాగుతోంది. మర్కజ్ సమావేశం అనంతరం రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీస్థాయిలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1173కి చేరగా 11మంది మృత్యువాతపడ్డారు. మధ్యప్రదేశ్, గుజరాత్ లలో పెరుగుతున్న మరణాలు…. మహారాష్ట్ర అనంతరం కరోనా వైరస్ తో మరణించే వారి సంఖ్య మధ్యప్రదేశ్, గుజరాత్ లలో అధికంగా ఉంది. మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు 43మంది చనిపోగా, గుజరాత్ లో 26మంది బలయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ఏడు, తెలంగాణలో 17 మరణాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం..మంగళవారం ఉ దయానికి తెలంగాణలో 592 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 17 మంది మరణించారు. మొత్తం బాధితుల్లో 103మంది కోలుకోగా ప్రస్తుతం 472 మంది చికిత్స పొందుతున్నారు. కేవలం సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో 61 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. హైదరాబాద్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. గడచిన 24గంటల్లో నగరంలో కొత్తగా 35 కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 45శాతం హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఈ వైరస్ సోకి ఏడుగురు మరణించగా మొత్తం 439మందికి సోకింది. వీరిలో 12మంది డిశ్ఛార్జి అయ్యారు. కేవలం ఒక్క గుంటూరు జిల్లాలోనే 93 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.