సందడిలేని పారిశ్రామిక వాడ

లాక్ డౌన్లో వెలవెలబోతున్న పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతం 

  • ఆగిపోయిన ఎగుమతులు, దిగుమతులు
  • పదుల సంఖ్యలో ఇంజనీరింగ్ పరిశ్రమలు
  • అధికభాగం రసాయనిక పరిశ్రమలు
  • చైనా నుంచి నిలిచిపోయిన ముడిసరుకు
  • లేఆఫ్ ప్రకటించనున్న చిన్న పరిశ్రమలు
  • లేఆఫ్ తో భారీగా ఉపాధి అవకాశాలు కోల్పోతున్న కార్మికులు

హైదరాబాద్: ఆసియా ఖండంలోనే పటాన్ చెరు పారిశ్రామిక రంగం రెండో స్థానం. ఇక్కడ వందల సంఖ్యలో రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో ఇంజినీరింగ్ పరిశ్రమలు పదుల సంఖ్యలో ఉండగా రసాయన పరిశ్రమలే అధికంగా ఉన్నాయి. అలాంటి పరిశ్రమలు కూడా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా (కొవిడ్ 19) వైరతాకిడితో నష్టాల్లోకి జారుకుంటున్నాయి. భారతదేశానికి వచ్చే ముడిసరుకు ప్రధానంగా చైనా నుంచి రసాయన పరిశ్రమలు దిగుమతి చేసుకుంటాయి. కరోనా వైరస్ ఇతర దేశాలకు విస్తరించకుండా ఆదేశం ఎగుమతి, దిగుమతులను నిలిపివేశాయి. రసాయన పరిశ్రమలు ఉత్పత్తి చేసిన సరుకును స్టాకు పెట్టుకుంటున్నాయి. దీంతో ఆర్ధికమాంధ్యం ఏర్పడి నష్టాల్లో కురుకుపోయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా నష్టాలను తగ్గించుకోవడానికి పరిశ్రమలు కార్మికులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి కార్మికులకు లాంగ్ లీవులు (సెలవులు) ఇస్తున్నాయి. అంతేకాకుండా ఈ నెల కూడా చైనా నుంచి వచ్చే రసాయనాల ముడి సరుకు దిగుమతి కాకపోతే? ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందనే ఆలోచనలో పడ్డాయి. ఇదే జరిగితే పరిశ్రమలు లే ఆఫ్ ఇవ్వడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ లేఆఫ్ వల్ల కార్మికులు అధిక సంఖ్యలో ఉపాధి కోల్పోయ్యే అవకాశాలు ఉన్నాయి. పారిశ్రామిక రంగంలో పటాన్ చెరు ఆసియా ఖండంలో రెండో స్థానంలో ఉంది. పటాన్ చెరు నియోజకవర్గంలో ప్రధానంగా పటాన్ చెరు, రామచంద్రపురం, అమీన్‌పూర్, జిన్నారం, బొల్లారం, బొంతపల్లి, దోమడుగు, అన్నారం, గడ్డపోతారం, ఖాజిపల్లి తదితర పారిశ్రామికవాడలున్నాయి. కొన్ని వేల మంది కార్మికులు ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నారు. కాగా పరిశ్రమలకు వచ్చే ముడిసరుకు ప్రధానంగా ముంబాయిలో స్టాక్ ఏర్పాటు చేసుకుంటారు. ఈ గోదాంల్లో కూడా నిల్వలు తగ్గిపోవడంతో పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. మరో నెల రోజుల్లో గోదాంలో ఉన్న స్టాక్ నిల్వలు పూర్తి అయ్యే విధంగా ఉన్నట్లు కొన్ని పరిశ్రమలు చెబుతున్నారు. కరోనా వైరస్ తో నష్టాల్లో మునిగిపోయే అవకాశాలు ఉ న్నట్లు చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రబలకుండా వైద్యుల సూచన మేరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించడంతో రూ. 1.60 పైకి లభించే మాస్కులు రూ.20 కి చేరింది. రాష్ట్ర రాజధానిలో కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా మాస్కుల ధరలకు రెక్కలు వచ్చాయి. రెండు లేయర్లతో ఉన్న మాస్కు స్టూల్ సేల్ ధర రూ.20కి చేరింది. జనరిక్ ఔషధ దుకాణాల్లో కూడా సాధారణ మాస్కుల ధర రూ.15-20లకు విక్రయిస్తున్నారు. మాస్కులను ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నా వ్యాపారులు దోపిడికి పాల్పడుతున్నారు. వంద మాస్కులను రూ.160 వరకు విక్రయిస్తే ప్రస్తుతం రూ.1,600 విక్రయిస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు. ఈ వ్యాపారుల పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కరోనా వైరస్ భారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ జాగ్రతల వల్ల కూడా పారిశ్రామిక రంగాన్ని నష్టాల్లో నెట్టేస్తున్నాయి. రసాయన పరిశ్రమల్లో తయారు చేసిన ఫార్ములేషన్ (ఔషధాల) ఎగుమతులను రవాణా చేయవద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఏపీటీ) ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు పరిశ్రమలు తయారు చేసిన ఫార్మా (ఔషధాలు) ఇతర దేశాలకు ఎగుమతి చేయకపోవడంతో వచ్చే రాబడి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఎప్పటి వరకు ఎగుమతులు బంద్ ను ఎత్తివేస్తారో తెలియకపోవడంతో పారిశ్రామికవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. మన దేశంలో తయారు చేసిన 25 రకాల ఔషధాల ఉత్పత్తుల పై డీజీఏపీటీ గుమతులపై ఆంక్షలు విధించింది. ఇందులో యాంటిబయోటిక్స్, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా వినియోగించే విటమిన్ బీ1, బీ6, బీ12 తో పాటు పారాసిటమాల్, టినిడజోల్, సైక్లోవియర్, మెట్రోనిడజోల్, ఆకిక్లో విర్, ప్రోజెస్పిరాన్, క్లోరాంఫినికాల్, షిండామైసిన్, ఆర్నిడజోల్, నియోమైసిన్, సింలిండమైసిన్ సాల్ట్ వంటి ఫార్ములేషన్ల ఎగుమతుల నిలిపివేసింది. చైనా ముడిసరుకుతో ఉత్పత్తవుతున్న ఔషధాలు యాంటీబయోటిక్, ఇన్ఫెక్షన్ల, బ్యాక్టీరియా వంటి మందులు, క్షయ, మధుమేహం, అమిబియాసిస్, అధిక రక్తపోటు, కోలెస్ట్రాల్ నియంత్రణ, విటమిన్లు, హర్మోన్ల నియంత్రణ వంటి వ్యాధులకు సంబంధించిన మందులు మన పారిశ్రామికవాడలోని రసాయన పరిశ్రమలు తయారు చేస్తాయి. ఇందులో ఈ వ్యాధులకు వినియోగించే ఆమాక్సిసిలిన్, సెఫాక్సిలిన్, సెపిక్సిమ్, టెట్రా సైక్లిన్, ఆక్సిటెట్రా సైక్లిన్, జెంటామైసిన్, నియోమైసిన్, సెప్టోమైసిన్ సల్ఫేట్ స్టెరైల్, రిఫాంపిసిన్, మెట్ ఫార్మిన్, టినిడజోల్, టెల్మిసార్టిన్, అటోర్వాస్టాటిన్, విటమిన్ బీ-12, బీ-6, సీ, ప్రొజె స్టెరోన్, ఫారాసిటమాల్ తదితర మందులను రసాయన పరిశ్రమల్లో ఉత్పత్తి చేస్తారు. ఈ మందులకు వినియోగించే ముడిసరుకు ప్రధానంగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటారు. దిగుమతి చేసుకోవలసిన వాటిలో ఎరువులు, పౌల్టీ, ఆక్వా, వ్యవసాయం, తయారీ రంగాలకు చెందిన ఎగుమతి, దిగుమతి వ్యాపారం తీవ్రంగా నష్టపోతున్నాయి. దిగుమతి చేసుకునే ముడిసరుకులు ఎండీసీ (మెటాలి డైక్లోరిన్), మెగ్నీషియం, కాఫర్, సిలికాన్ మొదలగు ముడిసరుకులను దిగుమతి చేసుకుంటారు. దీంతో పాటు ఐరన్, ట్క స్టెలేన్ స్టీల్, వంటి ఇనుము రంగాలకు చెందిన ముడిసరుకులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. ఈ ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా ఆగిపోవడంతో నష్టాల్లో పారిశ్రామిక రంగం పడిపోతుందని ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమలో నిత్య కూలీగా చేసే కొందరు కార్మికులకు కరోనా వైరస్ ప్రభావం దెబ్బతీసింది. చైనా నుంచి వచ్చే మెటీరియల్ లేక పని బంద్ చేశారు. కార్మకులకు పని లేకపోవడం వల్ల కంపెనీలు లీవులు ఇస్తున్నారు. రోజూ వచ్చి పోతున్నారు పాపం కార్మికులు. ఎప్పుడు పని దొరుకుతుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోన్నాళ్లు ఇట్లానే ఉంటే చాలా కష్టమైపోతుందని వాపోతున్నారు కార్మికులు. ఈ కరోనా రోగం నాశనం కావాలని దేవుడి కోరుకుంటున్నా అని ఓ కార్మికుడు కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ఇక కరోనా వైరస్ తో కంపనీలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. పని లేక ఖాళీ ఉంటున్నాం. కంపనీల వారు లాంగ్ లీవులు పెట్టుకుని ఊరికి పోయి నెమ్మదిగా రమ్మని చెబుతున్నారు. ఇట్ల అయితే పని లేక నెలనెల వచ్చే జీతంలేక ఇంటి కిరాయి, రోజు తిండి సంగతి ఎట్లా..? ఈ కరోనా మా బతుకులను ఛిద్రం చేయడానికి వచ్చినట్లుంది అని మరికొందరు కార్మికులు తమ గోడు చెప్పుకుంటున్నారు వచ్చిపోయే వారికి. కరోనా వైరస్ విజృంభించడంతో చైనా నుంచి దిగుమతి చేసుకునే ముడిసరుకు రవాణా నిలిచి పోయింది. రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ఉత్పత్తి, ఎగుమతి, దిగుమతి లేక పరిశ్రమలో పని లేక ఖాళీగా ఉంటున్నారు. కార్మికులను ఉన్నఫళంగా తొలిగిస్తే ఇబ్బందిగా ఉంటుందని కార్మికులకు లాంగ్ లీవులు ఇస్తున్నామని కొందరు పారిశ్రామిక నిర్వాహకులు చెబుతున్నారు. మరో నెల వరకు ఉన్న ముడిసరుకుతో పరిశ్రమలను ఎలాగోలా నడిపిస్తాం. నిల్వలు అయిపోతే పరిస్థితి మరి దారుణంగా మారుతుంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గాలని కోరుకుంటున్నాం అని ఓ పారిశ్రామికవేత్త తెలిపారు.