బయటకొస్తే మాస్క్ తప్పనిసరి
కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ఇళ్ల నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశించింది. చాలా మందిలో కరోనా సోకినా లక్షణాలు ఉండటం లేదని అధ్యయనంలో వెల్లడి కావడంతో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే దిల్లీ, మహారాష్ట్ర సహా పలు చోట్ల మాస్క్ లను తప్పనిసరిచేస్తూ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిలువరించేందుకు దిల్లీలో ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే, మాస్క్ ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం విధించిన ఈ నిబంధనను దేశ రాజధాని నగర పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మాస్క్ లు ధరించకుండా బయటకు వచ్చిన 32 మందిని అరెస్టు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల నేపథ్యంలో నిబంధనలు ఉల్లఘించిన వారి పై మహారాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. లా డౌన్లో ఇంటి నుంచి బయటకు రాడమే కాకుండా, ముఖానికి మాస్క్ పెట్టుకోలేదన్న ఆరోపణలతో ఏడుగురి పై పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. కుడ్జీవాడీ ప్రాంతానికి చెందిన ఈ ఏడుగురు గురువారం మాస్క్ లేకుండా బయట తిరుగుతుండటంతో పింప్రీ-చించవాద్ పోలీసులు ఈ మేరకు చర్య తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. కోవిడ్-19 విస్తృతి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో విధిగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించని వారిని అరెస్ట్ చేసేందుకు వెనుకాడమని బీఎంసీ అధికారులు హెచ్చరించారు. కాగా, దేశంలోని చాలా నగరాల్లో ఈ నిబంధన అమలు చేస్తున్నారు. ఢిల్లీ, ముంబైతో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాయి.జమ్మూకశ్మీర్ లో కూడా ముఖానికి మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.