న్యూయార్క్ వణికిపోతోంది

అంతకంతకూ పెరిగిపోతున్న కరోనా కేసులు, మరణాల పై వైద్యనిపుణులు ఆందోళన

న్యూయార్క్: ప్రపంచాన్నే వణికిస్తోన్న కరోనా మహమ్మారి న్యూయార్క్ లో విలయతాండవం చేస్తోంది. ఓవైపు రోజు రోజుకు రికార్డుస్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల పై వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్న వారిని చూస్తూ వైద్యసిబ్బంది వణికిపోతున్నారు. తాజాగా ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన నగరంగా న్యూయార్క్ నిలిచింది. అమెరికాలో మొత్తం 4,35,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా కేవలం ఒక్క న్యూయార్క్ లోనే రికార్డు స్థాయిలో 1,50,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య స్పెయిన్, ఇటలీ దేశాల్లో నమోదైన మొత్తం కేసులను దాటిపోవడం అక్కడ వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక న్యూయార్క్ లో కరోనా వైరస్ తో మరణించేవారి సంఖ్య వాస్తవానికన్నా ఎక్కువే ఉండొచ్చనే వాదన కూడా ఉంది. ఇప్పటికే న్యూయార్క్ లో కొవిడ్-19 సోకి 6 వేల మంది మృత్యువాతపడ్డారని న్యూయార్క్ గవర్నర్ ఆండ్ర్యూ క్యూమో ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ కొత్తగా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య తగ్గిందని వెల్లడించారు. మరి కొన్ని రోజులపాటు ఈ మరణాల పరంపర కొనసాగే అవకాశం ఉందని.. అనంతరం తగ్గుముఖం పట్టే అవకాశముందని భావిస్తున్నట్టు గవర్నర్ క్యూమో తెలిపారు. అయితే, ఈ విపత్కర సమయంలో కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతూ మృతి చెందిన వారి సంఖ్యను మాత్రమే ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తోంది. వైరస్ బారిన పడి ఇంటివద్దేకీ చనిపోతున్న వారి వివరాలను వెల్లడించడం లేదనే వాదన ఉంది. ఇలా ఒక్క న్యూయార్క్ నగరంలోనే రోజూ 200మంది చనిపోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, న్యూయార్క్ లో కరోనా తీవ్రతతో వైద్యులు, సహాయ సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. కేవలం వయస్సు మీరిన వారే కాకుండా యవకులు కూడా ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారని బాధితులకు సేవలు అందిస్తోన్న వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆరోగ్యంగా ఉన్న యువకులకు కూడా ఈ వైరస్ ప్రమాదం పొంచివుందని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపించే యువకులు కూడా కళ్లముందే అచేతన స్థితిలో పడిపోయి క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సందర్భాలు చూసి ఒక్కోసారి ఆసుపత్రి నుంచి బయటకు పరుగులు తీసిన ఘటనలు ఉన్నాయని న్యూయార్క్ లోని మౌంట్ సినై ఆసుపత్రికి చెందిన వైద్య సహాయకురాలు డయానా టొర్రెస్ వెల్లడించారు. ఇలాంటి ఘటనలు న్యూయార్క్ లో సర్వసాధారణంగా మారయని పలువురు వైద్యులు చెప్పడం చూస్తుంటే అక్కడ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అమెరికా వ్యాప్తంగా గడచిన 48గంటల్లో దాదాపు 4వేల మంది మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. రానున్న రోజుల్లో కరోనా మరణాల సంఖ్య 60వేలకు చేరే అవకాశం ఉందని అక్కడి వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో అమెరికన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమెరికాలో ఇప్పటివరకు కొవిడ్-19 మృతుల సంఖ్య 14,795కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా 88వేల మంది ప్రాణాలు కోల్పోయారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.