కిక్ బాక్సింగ్ బంగారు కొండ మౌనిక
కిక్ బాక్సింగ్‌ను ఇష్టమైన క్రీడగా ఎంచుకునే అమ్మాయిలు అరుదు. అందులో రాణించేవారు మరీ అరుదు. అలాంటివారిలో ముందువరుసలో నిలుస్తారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన మౌనిక. ఆటల్లో ఆడ మగ అనే తేడాలుంటాయనే విషయం తెలియని పసి వయసులోనే ఆమె కరాటేను ఇష్టపడింది.
ప్రపంచమనే పుస్తకాన్ని తెరచిచూస్తే కనిపించేది ఇద్దరే ఇద్దరట..! పేదలు.. ధనికులు.. వీరిలో పేదల సంఖ్యే ఎక్కువ. ఆ పేదరికాన్ని చూస్తూ అక్కడే ఆగిపోకుండా దానికి సవాలు విసురుతున్న వాళ్లు ఎందరో. అలాంటి కోవకు చెందిన అమ్మాయే కిక్ బాక్సర్ కందుల మౌనిక. ఈమె తెలంగాణలోనే మొట్టమొదటి కిక్ బాక్సర్ కావడం విశేషం. ఈ గత ఏడాది మే 30 నుంచి జూన్ 4 వరకు రష్యాలో జరిగిన 9వ కిక్ బాక్సింగ్ వాకోబ్ వర్డల్ కప్ పోటీల్లో పాల్గొని స్వర్ణ, వెండి పతకాలను సాధించింది. తెలంగాణ కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేసేందుకు క షిచేస్తున్నది. అయితే వియత్నాం వెళ్ళేందుకు ఆర్థిక పరిస్థితులు ఆమెకు అనుకూలంగా లేవు. సాయం చేసేవారి కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఆమెతో ప్రత్యేక ఇంటర్వ్యూ..
మీ తల్లిదండ్రుల గురించి..?
మాది మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామం. అమ్మ హేమలత, నాన్న సుదర్శన్ ఇద్దరూ వ్యవసాయ కూలీలే. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. కూలీ డబ్బులు వస్తే తప్ప పూట గడవని స్థితి. అయినా నన్నూ మా అక్కను చదివించారు. అక్క టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసింది. నేను బెల్లంపల్లిలోని ఓ ప్రయివేట్ కాలేజీలో డిగ్రీ చదువుతూ.. పోటీల్లో పాల్గొంటున్నాను. ఇప్పటి వరకూ రాష్ట్ర, జాతీయ స్థాయి కరాటే పోటీల్లో 18 బంగారు, రెండు వెండి పతకాలను సాధించాను. 2017 నుంచి కిక్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాను.
ఆటలపై ఇష్టం ఎలా ఏర్పడింది..?
ఆటల గురించి చెప్పాలంటే దానికంటే ముందు నా చిన్నప్పటి ఇష్టాల గురించి చెప్పాలి. నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఎంతో ఇష్టం. స్కూల్లో నా ఫ్రెండ్స్ అందరూ ఖోఖో ఆడుతుంటే చూస్తూ ఉండేదాన్ని, ఆ ఆటలో ఇతరులకు దొరక్కుండా తప్పించుంటూ పరిగెత్తడం బాగా అనిపించేది. అలా నేను కూడా ఖోఖో ఆడి జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ కూడా సంపాదించాను. నేను ఆటల్లో ముందుండటం చూసిన మా ప్రిన్సిపాల్ సాదు లింగయ్య, గురువులు తిరుపతి, శ్రీనివాస్‌లు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. వారి ప్రొత్సాహమే నన్ను ఇతర క్రీడల వైపు ఆలోచించేలా చేసింది.
కరాటే వైపు ఎలా వెళ్ళారు?
మా పెద్దమ్మ కొడుకు కోన లక్ష్మణ్ కరాటే ఫైటర్. ఎప్పుడూ టీవీల్లో దాన్నే చూస్తూ ఉండేవాడు. అన్న కరాటేలో రాణించడం, అందరూ ఆయన గురించి మాట్లాడుకోవడం చూసి నాకూ దాని పట్ల ఆసక్తి కలిగింది. నేను కూడా కరాటే నేర్చుకోవాలనుకున్నా. అయితే కరాటేలో శిక్షణ తీసుకోవాలంటే మా గ్రామం నుంచి దాదాపు ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసి బెల్లంపల్లికి వెళ్లాలి. అయినా కరాటే కోసం ఎంత దూరమైన వెళ్ళాలనుకున్నా.. మా అన్న దగ్గర కరాటే మాస్టర్ ఫోన్ నంబర్ తీసుకొని నేనే స్వయంగా భరత్ మాస్టర్‌కు ఫోన్ చేశాను. ఆయన మాత్రం ఒకసారి వచ్చి కలవమని చెప్పారు. వెళ్ళాక కరాటే అంటే ఎందుకు ఇష్టం అని అడిగారు. మా కుటుంబ నేపథ్యం అన్నీ కనుక్కొని, తర్వాత మా ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడాక కోచింగ్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు.
ఇంట్లో ఒప్పుకున్నారా?
ఏ తల్లిదండ్రులైనా మొదట్లో వ్యతిరేకిస్తారు. మా ఇంట్లో కూడా అదే జరిగింది. మరీ ముఖ్యంగా పేదరికంలో పుట్టి, పెరిగిన వాళ్లు తమ పిల్లలు పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం సాధించాలని కోరుకుంటారు కదా. ఆ ద ష్టితోనే మొదట్లో వద్దని చెప్పారు. పైగా అంత దూరం నడిచి వెళ్లి నేర్చుకోవడం ఇబ్బంది అవుతుందేమో ఆలోచించుకో అన్నారు. కానీ నేర్చుకోవాలనే నా పట్టుదలను చూసి పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. క్రమంగా కరాటేలో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జరిగిన పోటీల్లో పాల్గొని పతకాలను కూడా తీసుకురావడంతో నాకు అండగా నిలిచారు. నేను పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తుంటే నా కంటే వాళ్లే ఎక్కువ సంతోషిస్తారు.
మీరు నేర్చుకుంది కరాటే..! మరి కిక్బాక్సర్ ఎలా అయ్యారు..?
కిక్ బాక్సింగ్, కరాటేకు చాలా దగ్గరి సంబంధం ఉంది. కరాటేలో ప్రావీణ్యం ఉన్న వాళ్లు కిక్ బాక్సింగ్‌లో సులువుగా రాణించవచ్చు. పైగా కరాటే కంటే కిక్ బాక్సింగ్‌లో ఎక్కువ ఎక్స్పోజర్ ఉండటంతో మా కోచ్ నన్ను దానివైపు ద ష్టిసారించేలా చేశాడు. అందులోనూ శిక్షణ ఇచ్చాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో పాల్గొని 19 బంగారు పతకాలను గెలుచుకున్నాను.
శిక్షణ తీసుకోవాలంటే ఖర్చు బాగా అవుతుంది కదా…
గ్రామీణ క్రీడలు తప్ప ఏ క్రీడలో శిక్షణ తీసుకోవాలన్న ఖర్చుతో కూడిన వ్యవహారమే. పైగా గ్రామీణ ప్రాంతంలో సరైన సదుపాయాలు కూడా ఉండవు. కానీ నా విషయంలో నేను కాస్త భిన్నమే అని చెప్పాలి. మా కుటుంబ పరిస్థితిని, నా ఇష్టాన్ని చూసిన మా మాస్టర్ నాకు ఉచితంగానే కోచింగ్ ఇచ్చాడు. ఉన్న సదుపాయాలతోనే అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చాడు. ఇలాంటి కోచ్ లభించడం నా అద ష్టం.
క్రీడల్లో రాణించాలంటే ప్రత్యేక డైట్ తీసుకోవాలేమో..!
నిజమే.క్రీడల్లో రాణించాలంటే కఠోర సాధనతోపాటు పౌష్టికాహారం కూడా తీసుకోవాలి. కానీ నాకు ఎప్పుడూ సరియైన పౌష్టికాహారం లభించలేదు. దానికి కారణం మా ఆర్థిక పరిస్థితి. కానీ ఇవేవి పోటీల్లో నాకు గుర్తుకు వచ్చేవి కావు. ఒకవైపు పొలానికి వెళ్ళివచ్చి ఎల్లిపాయకారం తిని సాధన చేసేదాన్ని, రష్యాకు వెళ్ళినప్పుడు కూడా నేను తీసుకున్న ఆహారం దోసకాయ ముక్కలు. ఎందుకంటే అక్కడి ఆహారం పడకపోవడంతో వాటినే మూడు రోజులు తిని పోటీల్లో పాల్గొనాల్సి వచ్చింది. చివరకు పోటీల్లో ఒక స్వర్ణ, వెండి పతకాన్ని సాధించాను.
మర్చిపోలేని క్షణాలు..?
మర్చిపోలేని క్షణాలంటే రష్యాలోని అనప నగరంలో జరిగిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడమే. మాదొక చిన్న పల్లెటూరు పైగా ఈ స్థాయి నుంచి రష్యాకు వెళ్లడమే ఓ అరుదైన అవకాశం. దానికి తోడు తెలంగాణ నుంచి బాలికల విభాగంలో నుంచి ఎంపికైట్కటన ఒకే ఒక్క అమ్మాయిని నేనే కావడం విశేషం. పోటీల్లో పాల్గొని పతకాన్ని సాధించడం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని అనుభూతి. నేను సాధించిన అన్నీ పతకాలు ఒక ఎత్తయితే ఈ బంగారు పతకం మాత్రం ఒక ఎత్తు.
మరీ బాధించిన విషయం…
చాలా ఉన్నాయనే చెప్పాలి. ఒక అమ్మాయిగా ఇలాంటి పోటీల్లో రాణించడమే కష్టమైన విషయం. మన ప్రభుత్వం నుంచి ప్రొత్సాహం లభించకపోవడం నన్ను చాలా బాధించింది. ఈ ఏడాది మే 30 నుంచి జూన్ 4 వరకు రష్యాలో జరిగిన 9వ కిక్ బాక్సింగ్ ‘వాకోబ్ వర్డల్ కప్’ పోటీల్లో నాకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని గర్వంగా భావించాను. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. దీని గురించి మా కోచ్ తీవ్రంగా ఆలోచించారు. తెలిసిన రాజకీయ నాయకుల సహాయాన్ని కోరాడు. ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లాడు. చివరకు పత్రికల్లో, టీవీల్లో నా గురించి స్టోరీలు వచ్చాక హైదరాబాద్ నుంచి శ్రీరాం విజయపాల్ అనే ఆయన, పెరిక సంఘం, బెల్లంపల్లి సీఐ, మంచిర్యాల సీఐలు తలా కొంత సహాయం చేయడంతో రష్యాకు వెళ్ళాను. పోటీల్లో పాల్గొని ఒక స్వర్ణపతకాన్ని, వెండి పతకాన్ని సాధించాను. అయితే మిగతా క్రీడల్లో గెలిచిన వారిని ప్రోత్సహించినట్టు నా విషయంలో జరగలేదు. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఈ నెల ఆగస్టు 20 నుంచి 26 వరకు వియత్నాంలో జరిగే అంతర్జాతీయ పోటీలకు నాకు ఆహ్వానం వచ్చింది. అయితే ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వంపై, అధికారులపై ఆశగా ఎదురుచూస్తున్నాను.
భవిష్యత్ లక్ష్యం…
ప్రస్తుతం నా ముందున్న తక్షణ లక్ష్యం రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్‌లో ఉద్యోగం సంపాదించడం. దానికోసం కోచింగ్ కూడా తీసుకుంటున్నాను. ఉద్యోగం సంపాదిస్తే ఆర్థిక ఇబ్బందులు కూడా తీరుతాయి. దీంతో పాటు భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో ఆడి బంగారు పతకాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. సాధిస్తాననే నమ్మకం కూడా నాకు ఉంది.