హుక్కాకి బానిసలు

చట్టాలెన్ని చేసినా తీరుమారని హుక్కా సెంటర్ల నిర్వాహకులు

  • -పోలీసుల అదుపులో యువకులు
  • -హుక్కా తాగే పరికరాలు, ఫ్లేవర్స్‌ స్వాధీనం
  • -నిర్వాహకులపై కేసులు నమోదు
  • -హుక్కాపై నిషేధం విధించినా తెరచాటు అమ్మకాలు
  • -పోలీసుల అండతో రెచ్చిపోతున్న నిర్వాహకులు
  • -ఆఫర్లు పెట్టి యువతను ఆకర్షిస్తున్న బార్ల యజమానులు

హైదరాబాద్‌: పాతబస్తీలో నాహది హుక్కా సెంటర్‌పై సౌత్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. హుక్కా తాగుతున్న 40 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 40 హుక్కా తాగే పరికరాలు, 30 హుక్కా ప్లేవర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న యువకులను పోలీసులు చాంద్రాయణగుట్ట స్టేషన్‌కు తరలించారు. హుక్కా సెంటర్‌ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే హుక్కా సెంటర్లపై తెలంగాణ ప్రభుత్వం గతంలోనే నిషేధం విధించినా అనేకచోట్ల గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పోలీసుల అండతోనే ఈ సెంటర్లు కొనసాగుతున్నాయన్న చేదునిజం తాజాగా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
హైదరాబాద్‌ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఓ హుక్కా సెంటర్లకు కొంతమంది పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. పోలీసు శాఖ విచారణలో ఈ విషయం వెలుగులోకి రావడంతో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆరుగురు పోలీసులపై వేటు వేశారు. నగరంలో ఎక్కడ హుక్కా విక్రయాలు జరిగినా సంబంధిత ఎస్‌హెచ్‌ఎం బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషనర్‌ హెచ్చరించారు. అక్రమంగా హుక్కా సెంటర్లు నడుపుతున్న వారి వద్ద లంచాలు తీసుకుని సహకరిస్తూ వస్తున్న గతంలో జూబ్లీహిల్స్‌ పోలీస్టేషన్లో పనిచేసిన ఎస్సైలు కురుమూర్తి, డి.శ్రీను, ప్రస్తుతం పనిచేస్తున్న ఇ.శంకర్‌, రామక ష్ణ, ఏఎస్సైలు మహమ్మద్‌ జాఫర్‌, శామ్యూల్‌ను సస్పెండ్‌ చేస్తూ కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు.
వీరంతా రాత్రిపూట విధుల్లో ఉన్నపుడు అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా సెంటర్ల నిర్వాహకులు, అక్కడికి వచ్చే యువకుల నుంచి మామూళ్లు తీసుకున్నట్లు పోలీస్‌ కమిషనర్‌కు సమాచారం వచ్చింది. దీనిపై అంతర్గత విచారణ జరిపించగా నిజమేనని తేలింది. దీంతో కమిషనర్‌ నలుగురు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్సైలను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సస్పెండైన ఎస్సై కురుమూర్తి షాహినాజ్‌ గంజ్‌, డి. శ్రీను మహంకాళి పోలీస్టేషన్లలో విధులు నిర్వహిస్తున్నారు.
సినిమాలు, టీవీలు, స్నేహితుల ప్రభావంతో సరదాగా యువతీ, యువకులు హుక్కా సెం టర్లకు వస్తున్నారు. స్నేహితులను చూసి ఒక్కసారి దమ్ముకొట్టాలనుకునే వారే హుక్కాకు బానిసలవుతున్నారు. ఇప్పుడు బ్యాచిలర్‌ రూమ్‌లకు సైతం చేరిపోతున్నారు. పెరిగిపోతున్న హుక్కా సెంటర్లు యువకుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఆఫర్లు పెట్టి హుక్కా సెం టర్లకు యువతను రప్పించుకుంటున్న నిర్వాహకులు యువ తను బానిసలుగా చేస్తున్నారు. చైన్‌ సిస్టమ్‌ మాదిరిగా ఇద్దరిని తీసుకొస్తే ఓ ఆఫర్‌… నలుగురిని తీసుకొస్తే మరో ఆఫర్‌ అంటూ ప్రకటిస్తున్నారు. ఒక్క టేబుల్‌ మీద అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి నలుగురు లేదా ఆరుగురు కూర్చుంటారు. నిర్వాహకులు మత్తు పదార్థాల్ని హుక్కాలో కలిపి అందిస్తున్నారు. ఫ్లేవర్ల పేర్లతో డ్రగ్స్‌, గంజాయి, కొకైన్‌, హెరాయిన్‌ మిక్స్‌ చేసి యువతను బానిసలుగా చేస్తున్నారు. మైనర్లు కూడా హుక్కా పీల్చుతున్న వారిలో ఉన్నారు. డబ్బులు లేని సమయంలో బాకీలు పెట్టించి హుక్కాను అందిస్తున్నారు.అప్పులు తీర్చకపోతే దాడులు చేసేందుకు కూడా వెనకాడడం లేదు. కొన్ని హుక్కా సెంటర్ల నిర్వాహకులు యువకులపై దాడులు చేయడంతో చాలా హుక్కా సెంటర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే హుక్కా సెంటర్లను అధికారులు మూసేశారు. అయినా గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది కొనసాగిస్తున్నారు. మత్తులో జోగుతోన్న కొందరు నేరాల బాటపడుతున్నారు.
దేశంలో పొగాకుతో..
మామూలుగా సిగరెట్‌ తాగితేనే ఆరోగ్యానికి హానికరం. ఇక హుక్కా అయితే చెప్పాల్సిన పనేలేదు. దీనికి తోడు హెరాయిన్‌, కొకైన్‌ వంటివి పీల్చ డంతో 30 ఏండ్లకే రోగాల బారినపడుతున్నారు. దేశంలో 10.9 శాతం మంది ఏదో రూపంలో పొగాకు తీసుకుంటున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 82 శాతం మంది దీనివల్ల సంక్రమించే వ్యాధులతో బాధపడుతు న్నారు. 9 లక్షల మంది ప్రతియేటా చనిపోతున్నారు. 90 శాతం ఊపిరితి త్తుల కేన్సర్లకు పొగ తాగడమే ప్రధాన కారణం. 35 శాతం నోటి క్యాన్సర్లు పొ గాకు నమలడం ద్వారా వస్తున్నాయి. పొగ తాగే వారితోపాటు దాన్ని పీల్చడం వల్ల కుటుంబంలో ఇతరుల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూప నుంది. మిగతా వారితో పోల్చితే పొగాకు అలవాటున్న వారిలో 2-3 రెట్లు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
హెస్‌హెచ్‌వోలనూ వదలం : సీపీ
హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ మూడు కమిషనరేట్ల పరిధిలో హుక్కా సెంటర్లపై నిషేధమున్నట్టు శనివారం నగర పోలీస్‌ కమిషనర్‌ స్పష్టం చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, కాఫీ సెంటర్లలో హుక్కా సర్వీస్‌ చేసేం దుకు అధికారం లేదన్నారు. గతంలో కొందరు చట్టాలను ఆసరా చేసుకొని హుక్కా సెంటర్లను కొనసాగిస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమన్నారు. నూతన చట్టం ప్రకారం హుక్కా సెంటర్లు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అయితే కొంతమంది మభ్యపెట్టి హుక్కా సెంటర్లను కొనసాగించేందుకు ప్రయత్నిస్తు న్నారన్నారు. రెంస్టారెంట్లు, కాఫీ షాప్‌ల్లో భోజనాలు, టిఫిన్స్‌, టీలు సరఫరా చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే వాటి ముసుగులో హుక్కాను సర్వీస్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో పొగాకు సేవించడం నేరమన్నారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోరాదన్నారు. మూడు కమిషనరేట్ల పరిధిల్లో హుక్కా సెంటర్లు నిర్వహిస్తున్నట్టు సమాచారం ఉంటే అలాంటి వాటిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోలు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. సంబంధిత పోలీస్‌ అధికారి చర్యలు తీసుకోకుంటే వారిపై చట్టపరంగా, శాఖా పరంగా చర్యలు తీసు కుంటామని కమిషనర్‌ హెచ్చరించారు. హైదరాబాద్‌లో హు క్కా సెంటర్లు కొనసా గయని స్పష్టం చేశా రు.నిబంధనలు ఉల్ల ఘించిన వారిపై కేసులు నమోదు చేసి, జైలుకు పంపిస్తామని తెలిపారు.