సినీనటుడు వేణుమాధవ్‌ మృతి

పలువురు సినీ, రాజకీయ నేతల నివాళులు

హైదరాబాద్‌:
ప్రముఖ సినీనటుడు వేణు మాధవ్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 6వ తేదీన ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందించారు. అయితే ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో బుధవారం మధ్యాహ్నం 12.21 గంటలకు మతిచెందాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కోదాడకు చెందిన వేణుమాధవ్‌ హైదరాబాద్‌ మౌలాలీలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య శ్రీవాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సీఎం దిగ్భ్రాంతి
ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ మతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుమాధవ్‌ తన నటనతో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారని కొనియాడారు. వేణుమాధవ్‌ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేణుమాధవ్‌ ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. అనారోగ్యంతో సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చేరిన వేణుమాధవ్‌ చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. హాస్యనటుడు వేణుమాధవ్‌ భౌతికకాయాన్ని యశోద ఆసుపత్రి నుంచి తన స్వగహానికి తరలించారు. హైదరాబాద్‌లోని కాప్రా పరిధి మౌలాలి హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఆయన ఇంటికి తరలించారు.
మంత్రి తలసాని, సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి
చిన్న వయసులోనే హాస్యనటుడు వేణుమాధవ్‌ మతి చెందడం బాధాకరమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. స్వయంక షితో 600పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. వేణుమాధవ్‌ మరణవార్త తెలుసుకున్న శివాజీరాజా, అలీ, ఉత్తేజ్‌, జీవిత రాజశేఖర్‌ ఆయనకు నివాళులర్పించారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం వేణుమాధవ్‌ పార్థివదేహాన్ని ఉంచనున్నట్లు నటుడు శివాజీ రాజా తెలిపారు. తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌ రమణ, నేతలు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, కె.దయాకర్‌ రెడ్డి వేణమాధవ్‌ స్వగహంలో ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు.