మోదీ, షా ప్రాణాలతో ఉండటం

వారికి ఇష్టంలేదు?
సోనియా, రాహుల్‌పై రాందేవ్‌ బాబా సంచలన వ్యాఖ్యలు

నోయిడా: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబంపై ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా అధికారంలో కొనసాగడం.. ఆ ద్వయం ప్రాణాలతో ఉండటం ఆ కుటుంబానికి ఇష్టంలేదని వ్యాఖ్యానించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఓ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో జరిగిన పరిణామాలను ఉదహరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో అమిత్‌షాను జైలులో చంపేందుకు, మోదీని భౌతికంగా తొలగించేందుకు కాంగ్రెస్‌ కుట్రలు చేసిందని ఆరోపించారు. కానీ.. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే రాహుల్‌, సోనియా ఎక్కడ ఉండేవాళ్లు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరంపైనా బాబా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఆయన ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో అమిత్‌షాను జైల్లో హతమార్చేందుకు కుట్రలు చేశారనీ.. మోదీని కూడా అంతం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రణాళికలు రచించిందని ఆరోపించారు. రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీపైనా అనేక కేసులు ఉన్నాయన్నారు.
తాను ఓ రోజు న్యాయమూర్తి జస్టిస్‌ హెగ్డేను కలిసి.. జీవితంలో అనుసరించాల్సిన ప్రధాన సూత్రమేంటని అడగ్గా.. చట్టాన్ని అతిక్రమించకూడదని ఆయన తనకు చెప్పారని బాబా రాందేవ్‌ గుర్తు చేసుకున్నారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఈ రోజు చిదంబరానికి పట్టిన గతే పడుతుందని అన్నారని రాందేవ్‌ తెలిపారు. చిదంబరం తన పనులు చక్కబెట్టుకొనేందుకు అవినీతికి పాల్పడటం ద్వారా చట్టాన్ని అతిక్రమించారన్నారు. చిదంబరం ఎప్పుడూ ‘నేను ఆర్థిక మంత్రిని.. ఈ సామ్రాజ్యమంతా నాదే. నేను హోంమంత్రిని.. చట్టం నా చేతుల్లోనే ఉంది అనుకునేవాళ్లు’ అని రాందేవ్‌ విమర్శించారు. కానీ.. చట్టాన్ని ఉల్లంఘించడం వల్లే ఆయనకు ఈ రోజు తిహార్‌ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఎదురైందని రాందేవ్‌ వ్యాఖ్యానించారు