దంగల్ రాణి వినేశ్ ఫొగాట్
బిడ్డా.. నువ్వు ప్రమాదంలో పడ్డ ప్రతిసారీ నీ తండ్రి స్వయంగా వచ్చి రక్షించడు. నిన్ను నువ్వే కాపాడుకోవాలి’ దంగల్ సినిమాలో మహావీర్‌సింగ్ ఫొగాట్ పాత్రధారి ఆమిర్‌ఖాన్ చెప్పిన డైలాగ్ ఇది. కుస్తీపోటీల్లో దేశ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేస్తున్న వీరనారి వినేశ్ ఫొగాట్‌కు అచ్చంగా సరిపోతుంది. రియో ఒలింపిక్స్‌లో మోకాలు మడతపడటంతో చక్రాల కుర్చీలో కాలం గడిపింది. కనీసం తన దుస్తులు తానే మార్చుకోలేని దీనస్థితి. నడవడానికే ఏళ్లు పట్టే దశ నుంచి వరుసగా ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు కొల్లగొట్టింది. తాజా ప్రపంచ పోటీల్లో టోక్యో ఒలింపిక్ బెర్త్, కాంస్యం సాధించి తనేంటో నిరూపించుకొంది. కష్టం-సుఖం మధ్య ఆమె సంఘర్షణకు అక్షరరూపం ఇది..!!
అంతర్జాతీయ కుస్తీనారీల ‘ఫొగాట్’ కుటుంబంలో 1994, ఆగస్టు 24న వినేశ్ ఫొగాట్ జన్మించింది. రెజ్లర్లు గీతా ఫొగాట్, బబిత కుమారి తండ్రి మహావీర్‌సింగ్ ఫొగాట్ సోదరుడి కుమార్తె వినేశ్. వారిని చూసే కుస్తీపోటీల్లో రంగప్రవేశం చేసింది. మహిళలకు విలువే ఇవ్వని హరియాణాలో తన అక్కలు పడ్డ కష్టాలు, వివక్షను స్వయంగా చూసింది. మానసికంగా రాటుదేలింది. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలిచిన భారత తొలి కుస్తీనారిగా రికార్డు స ష్టించింది. అంతేకాదు భారత్ నుంచి లారియస్ ప్రపంచ క్రీడా పురస్కారాలకు నామినేట్ అయిన తొలి అథ్లెట్ వినేశే. 2013లో ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం, కామన్వెల్త్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం సాధించింది. 2014లో ఆసియా క్రీడల్లో కాంస్యం, కామన్వెల్త్లో పసడి అందుకొని తనపై అంచనాలు పెంచుకుంది.
మడతపడ్డ కాలు
ఆమె జోరుమీదుండగానే 2016 రియో ఒలింపిక్స్ వచ్చేశాయి. రోజులు గడుస్తున్నా భారత అథ్లెట్లకు పతకాలు రాకపోవడంతో అభిమానులంతా నిరాశగా ఉన్నారు. మంచి డిఫెన్స్, దూకుడుతో వరుస విజయాలు సాధిస్తూ వినేశ్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఊపుమీదున్న వినేశ్ కచ్చితంగా పతకం తెస్తుందనే అనుకున్నారు. క్వార్టర్స్, సెమీస్ దాటితే పతకాల దాహార్తి తీరుతుందని భావించారు. కానీ చైనా రెజ్లర్ సన్ యానన్‌తో పోరులో ఆమె కుడికాలు మడతపడింది. అదే కాలుపై ప్రత్యర్థి శరీరం బరువు పడటంతో రింగులో విలవిల్లాడింది. నడవలేని స్థితి. కాలు పట్టుకొని అలాగే రింగులో పడిపోయింది. స్టేడియంలో అందరూ విస్మయంగా చూస్తున్నారు. సిబ్బంది స్ట్రెచర్‌పై మోసుకెళ్లేటప్పుడు ఆమె కళ్లలో బాధ, ఆవేదన, నొప్పి, నీటి చెమ్మ కనిపించాయి. ఒలింపిక్స్ పతకం గెలవాలన్న తన కల నెరవేరాలంటే ఆమె మరో నాలుగేళ్లు ఎదురుచూడాలి. కన్నీటి ధార ఒకవైపు. తన దుస్తులు తానే మార్చుకోలేని దీనస్థితి మరోవైపు.
ఉక్కు సంకల్పం
మామూలుగా ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో సాధారణ వ్యక్తులు ఓటమిని అంగీకరిస్తారు. ఆటను వదిలేస్తారు. వినేశ్ అందుకు భిన్నం. గీతా, బబిత నీడలోంచి బయటకొచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకొనేందుకే ఎంతో కష్టపడింది. మహావీర్‌సింగ్ శిక్షణలో మానసికంగా రాటుదేలింది. అందుకే మానసిక శాస్త్ర నిపుణులు చెప్పే ‘నువ్వెలా ఆలోచిస్తావో ఈ లోకం నీకలా కనిపిస్తుంది’ అన్న మాటల్ని బుర్రకు పట్టించుకుంది. క్రీడాకారులకు గాయాలు కావడం సహజమే. రియోలో వినేశ్‌కు గాయమైన ప్రదేశం ప్రత్యేకమైంది. కండరాలు, ఎముకలు, రక్తనాళాలు అన్నీ కలిసే చోటది! ఇలాంటప్పుడు మహామహా బలశాలులే కోలుకొనేందుకు ఏడాది సమయం తీసుకుంటారు. ఈ పరిస్థితిని ఆమె సవాల్‌గా తీసుకుంది. చక్రాల కుర్చీలోనే అర్జున పురస్కారం అందుకుంది. ఆ ప్రేరణ, తన సంకల్పబలంతో త్వరగా కోలుకుంది. శిక్షణ మొదలుపెట్టింది. తన బలహీనతల గురించి కాకుండా బలాలపై నిపుణుల ఆధ్వర్యంలో ద ష్టి సారించింది. సాంకేతికంగా మెరుగైంది. ప్రత్యర్థులపై వ్యూహాలు మార్చడంలో ఆరితేరింది. ఇంటికే వెళ్లకుండా శాయ్ కేంద్రంలోనే ఉండిపోయింది. కుటుంబ సభ్యులు, ప్రాణ స్నేహితులతోనూ అరుదుగా ఫోన్ మాట్లాడేది. మిగతా వారిని పక్కన పెట్టింది. తన శరీరాన్ని కష్టపెట్టింది. ద ఢంగా తయారైంది. 100కు 400 శాతం శ్రమించింది. తిరిగి రింగ్‌లో అడుగుపెట్టింది.
విజయాల బాట
వినేశ్ పునరాగమనం ఘనంగా సాగింది. 2018లో గోల్డ్‌కోస్ట్‌లో నిర్వహించిన కామన్వెల్త్ క్రీడల్లో 50 కిలోల విభాగంలో స్వర్ణం అందుకుంది. అదే ఏడాది జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో పసిడిని ముద్దాడింది. ఫైనల్లో జపాన్‌కు చెందిన యుకి ఇరీపై 6-2 తేడాతో విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో గోల్డ్ కొల్లగొట్టిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా పేరు సాధించింది. ఫేవరెట్‌గా ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌కు సిద్ధమైంది. రెండు నెలల్లో పోటీలు జరుగుతాయనగా ఆమె హఠాత్తుగా మళ్లీ గాయపడింది. ఇంతలోనే ఆమె వ్యక్తిగత జీవితం, ప్రేమపై మీడియా అతిగా దష్టిపెట్టింది. వీటన్నిటి నుంచి తప్పించుకొనేందుకు వినేశ్ ఎంచుకున్న మార్గం కఠిన శిక్షణ. మళ్లీ శాయ్‌కు వెళ్లింది. మానసికంగా, శారీరకంగా ద ఢంగా మారేందుకు శ్రమించింది. పోలాండ్, యాసర్ డోగు, స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో స్వర్ణాలు సాధించింది. 2019 ఛాంపియన్షిప్స్కు ఫేవరెట్‌గా వెళ్లింది. స్వర్ణం గెలిచే సత్తా ఉన్నప్పటికీ ప్రత్యర్థి మయు మెరుగ్గా ఆడటంతో ఓటమిపాలైంది. అయ్యో! ఇలా అయ్యిందేంటి? అనుకొనేలోగా రెపిచేజ్ ద్వారా లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. యులియాపై 5-0, ప్రపంచ నంబర్‌వన్ సారా అన్పై 8-2, మరియాపై 4-1తో వరుస మ్యాచుల్లో గెలిచి కాంస్యం అందుకుంది. ఒలింపిక్ బెర్త్‌ను కైవసం చేసుకొంది. ఇక ఆమె ముందున్న లక్ష్యం 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం.