షాని కలిసిన దీదీ
ఎన్నార్సీ అంశంపై చర్చించాం: మమతాబెనర్జీ
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దేశరాజధానిలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ప్రధాని మోదీతో బుధవారం భేటీ అయిన ఆమె.. గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. మధ్యాహ్నం హోంశాఖ కార్యాలయానికి చేరుకున్న ఆమె.. మంత్రితో కాసేపు చర్చించారు. పశ్చిమ బెంగాల్ పేరు మార్పు అంశమే ప్రధాన ఎంజెడాగా షాతో భేటీ అయ్యారు. అయితే రోజు వ్యవధిలోనే ప్రధాని, హోంమంత్రితో ఆమె సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉన్న ఆమె.. తాజా భేటీలతో ఆసక్తకిర చర్చకు తెరతీశారు. అయితే ఆమె భేటీ వెనక మాత్రం ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి.
అసోంలో జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ) అంశంపై అమిత్ షాతో సమావేశంలో చర్చించినట్టు ఆమె తెలిపారు. ‘హోంమంత్రితో ఎన్నార్సీ అంశాన్ని ప్రస్తావించాను. ఇందుకు సంబంధించి ఆయనకు ఒక లేఖ ఇచ్చాను. అసోంలో ఎన్నార్సీ జాబితా నుంచి 19 లక్షల మంది పేర్లను తొలగించిన అంశం గురించి ఆయనతో చర్చించాను. ఎన్నార్సీ నుంచి తొలగించిన వారిలో హిందీ, బెంగాళీ, గూర్ఖా ప్రజలు, నిజమైన భారత ఓటర్లు కూడా ఉన్నారు’ అని ఆమె విలేకరులతో తెలిపారు. బెంగాల్‌లోనూ ఎన్నార్సీని అమలు చేస్తారంటూ వచ్చిన కథనాలు గురించి ప్రశ్నించగా.. ఆమె ఈ వాదనను తోసిపుచ్చారు. అవన్నీ వదంతులేనని, అమిత్ షాతో భేటీలో ఈ అంశం గురించి చర్చించలేదని మమత స్పష్టం చేశారు. బెంగాల్‌లో ఎన్నార్సీ అవసరమే లేదని ఆమె తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అమిత్ షాతో మమతా బెనర్జీ భేటీ కావడం ఇదే తొలిసారి. అంతకుముందు ప్రధాని మోదీతో సమావేశమైన మమత.. పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లా మార్చడంతోపాటు పలు అంశాలపై మోదీతో చర్చించారు.