ప్రియాంక ‘హస్త’గతం!
కాంగ్రెస్ పగ్గాలు ఇక ప్రియాంకాకే: త్వరలోనే పార్టీ సారథ్య బాధ్యతలు
- కాంగ్రెస్ పాలిత సీఎంల సమావేశంలో కీలక నిర్ణయం!
- అంతా సానుకూలమే..ముహూర్తమే తరువాయి
- మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఎన్నికలకు ముందుగా
- దసరా నాటికి ఎంపికయ్యే అవకాశం
- రోజురోజుకూ పెరుగుతున్న మద్దతు
- సోనియా అనారోగ్యం దృష్య్టా నిర్ణయం
- మోదీకి సరైన ప్రత్యామ్నాయం ప్రియాంకే
- సీనియర్ నేతల మనోగతం
హైదరాబాద్:
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్న రాహుల్ తన పదవికి రాజీనామా చేయటం.. మరోసారి పగ్గాలు చేపట్టిన సోనియా.. పార్టీలోని పరిస్థితిని ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు కిందామీదా పడుతున్నారు. తాజాగా తాము పవర్లో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోనియాగాంధీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పార్టీ పగ్గాలు ప్రియాంకకు అప్పజెప్పాలంటూ ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా జరిగిన సమావేశంలో సోనియా ముందుకు ప్రియాంకకు పార్టీ పగ్గాలన్న అంశాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకురాగా.. మిగిలిన వారు సైతం సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సోనియా నివాసంలో జరిగిన ఈ మీటింగ్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్.. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్.. పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామిలు పాల్గొన్నారు. పార్టీ ఫ్యూచర్ ప్లాన్ మీద వ్యూహరచన చేసిన వారు.. బీజేపీని అడ్డుకునేందుకు వీలుగా ప్రియాంకను రంగంలోకి తీసుకురావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఒకప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలంటే చేతి వేళ్లతో లెక్క పెట్టే రీతిలో ఒకట్రెండు రాష్ట్రాల్లోనే కనిపించేవి. అందుకు భిన్నమైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. దక్షిణాది మినహాయించి.. యావత్ దేశం కమలనాథులతో నిండిపోయింది. ఒకప్పుడు తాము ఎలా అయితే ఉండేవారిమో ఇప్పుడు బీజేపీ అలా మారిందన్న వేదన కాంగ్రెస్ నేతల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎలా అయినా సరే.. తిరిగి పవర్ చేతిలోకి తీసుకోవాలన్న తపన వారిలో ఎక్కువ అవుతోంది. ఈ క్రమంలో పార్టీ పగ్గాలు చేపట్టే అర్హత ఎవరికుందన్న విషయంపై ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.
పార్టీ సంస్థాగత ఎన్నికల తర్వాత నాయకత్వ బాధ్యతల్ని ప్రియాంక స్వీకరించకపోతే మోడీని ఎదుర్కోవటం చాలా కష్టమని తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాటలు విన్న తన మనసులోని మాట బయటపెట్టకుండానే మీటింగ్ ముగించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ.. 125 ఏళ్ల చరిత్ర.. స్వాతంత్య్రం రాకముందు నుంచి ఉన్న అతి పురాతన పార్టీ. దాదాపు 70 ఏళ్లు దేశాన్ని పరిపాలించింది. కానీ ప్రస్తుతం అంతటి ఘన చరిత్ర ఉన్న పార్టీకి నాయకత్వానికి లోటు ఏర్పడింది. 2012-12 వరకు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో హస్తం హవానే ఉండేది. అయితే 2013 తర్వాత దేశంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకేసారి కాంగ్రెస్ పార్టీ స్కాంలు, కేసులు ఆరోపణలను ఎదుర్కొంటుండటంతో.. ప్రజా వ్యతరేకత మొదలైంది. అయితే ఇదే అదనుగా ఎన్డీఏ గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించి 2014 ఎన్నికలకు పోటీ దిగింది. ఇంకేముంది.. డెబ్బై ఏళ్లలో ఎన్నడూ ఓటమి చూడని విధంగా కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్ష హోదాను కోల్పోయి.. చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కేవలం అర్ధ సెంచరీ కూడా దాటకుండా ఆగిపోయింది. ఆ తర్వాత అధ్యక్ష పదవి చేపట్టిన రాహుల్ గాంధీ.. వరుసగా విఫలమయ్యారు.
2014 తర్వాత జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఎక్కడ కూడా రాహుల్ గాంధీ తన ప్రాముఖ్యతను చాటుకునేలా విజయాలు సాధించలేదు. అయితే 2017-18 మధ్య పంజాబ్, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీని ఓడించి మళ్లీ కాస్త పునర్వైభవం సాధించింది. అయితే ఆ తర్వాత వెంటనే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోదీ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ భారీ షాక్‌లోకి మునిగిపోయింది. అయితే ఆ తర్వాత ఓటమికి అందరూ బాధ్యత వహించాల్సిందేనని.. చెప్పడంతో.. దేశ వ్యాప్తంగా పార్టీ పదవులను అంతా రాజీనామా చేశారు. అయితే రాహుల్ కొత్త కాంగ్రెస్ టీం రెడీ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారనుకున్నారు అంతా. అయితే అదే సమయంలో రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మొదట్లో అది వెనక్కు తీసుకునే రాజీనామానేమో అని అంతా భావించారు. అయితే రాహుల్ ఆ విషయంలో రాజీ పడకుంటా.. రాజీనామాకు కట్టుబడ్డారు. అయితే చాలా రోజులపాటు రాహుల్‌ను బుజ్జగించినా.. రాహుల్ మొండిగా వ్యవహరించడంతో చివరకు ఆ రాజీనామాను ఆమోదించారు. అయితే ఆ తర్వాత రాహుల్ స్థానంలో ఏఐసీసీ ప్రెసిడెంట్‌గా ఎవరిని నియమించాలో తర్జనభర్జనలు పడి.. చివరకు ఆ బాధ్యతలను సోనియానే చేపట్టారు. అయితే ఆమె తాత్కాలిక ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. అయితే సోనియా మాత్రం త్వరగా ఏఐసీసీ ప్రెసిడెంట్‌గా ఎవర్నైనా నియమించి.. ఆ పదవి నుంచి పక్కకు జరగాలని భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో పార్టీ కేడర్‌కు సోనియా దిశానిర్దేశం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రచారానికి దూకుడుగా వెళ్లాలని.. పార్టీ శ్రేణులకు హితబోద చేశారు. కేవలం సోషల్ మీడియా వేదికకే పరిమితం కావొద్దని సూచించారు. మోదీ పాలనలోని లొసుగులను ఆధారంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని సోనియా నేతలందరికీ తెలిపారు. అయితే ఈ క్రమంలో పార్టీకి కొత్త నాయకులు కావాలని భావిస్తున్నారు. అందుకోసం రాహుల్ గాంధీ పేరుతో పాటుగా ప్రియాంకా పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే పార్టీకి గట్టి నాయకత్వం అవసరం. అయితే రాహుల్ పేరు పరిశీలనలో ఉన్నా.. ఆ పదవిని స్వీకరించడానికి ఆయన మాత్రం దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. సోనియా నిర్వహించిన సమావేశానికి రాహుల్ రాకపోవడం.. చర్చనీయాంశంగా మారింది.
వచ్చే సంస్థాగత ఎన్నికల తర్వాత.. రాహుల్ గాంధీ సుముఖతతో లేని పక్షంలో.. ప్రియాంకా గాంధీకే కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పాలని పార్టీ నేతలు సోనియాపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. తాజాగా సోనియా అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా ఇదే అంశం ప్రాస్తవనకు తెచ్చారని తెలుస్తోంది. అంతేకాదు రాహుల్, ప్రియాంకా ఇద్దరిలో ఎవరైనా ఒకరు సంస్థాగత ఎన్నికల తర్వాత నాయకత్వ బాధ్యతలు చేపట్టకపోతే.. ఇక మోదీని ఎదుర్కోవడం కష్టమన్న అభిప్రాయాన్ని సోనియా ద ష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టిన ప్రియాంకా.. ఎన్నికల ప్రచారంలో మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. సీట్లను గెలిపించుకోలేకపోయినా.. మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంలో సఫలమైందన్న అభిప్రాయంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ప్రియాంక గాంధీ చేతికి అందిస్తే.. మళ్లి పార్టీకి పునర్వైభవం వస్తుందని.. పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. మరి కాంగ్రెస్ కొత్త రథసారధిగా ప్రియాంక చేపడుతుందో లేదో అన్నది మరికొద్ది రోజులు వేచి చూస్తే తెలుస్తుంది.
ప్రియాంక లావో… కాంగ్రెస్ బచావో…’
రెండు దశాబ్దాలుగా ఎన్నికలు వచ్చిన ప్రతీసారి కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చే నినాదం ఇది.
నానమ్మ ఇందిరాగాంధీ పోలికల్లో అచ్చుగుద్దినట్టుగా ఉండే ప్రియాంక గాంధీ అందరి అభీష్టం మేరకు ఎట్టకేలకు రాజకీయ అరంగేట్రం చేస్తున్నారనే వార్త వినగానే కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. కాంగ్రెస్ కార్యకర్తల్లో, నాయకుల్లో కొత్త జోష్ వచ్చింది. అవును… 47 ఏళ్ల వయసులో ప్రియాంకగాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జిగా పగ్గాలు చేపట్టారు. దాంతో రాజకీయాల్లో నయా ‘ప్రియాంక’ం మొదలైంది.
కాంగ్రెస్ కొత్త ట్రంప్ కార్డ్… పొలిటికల్ గేమ్ ఛేంజర్… చార్మింగ్ ఛాలెంజర్… గత నెల కాంగ్రెస్ రక్షకురాలిగా ప్రియాంక గాంధీ అధికారికంగా రాజకీయ ప్రవేశం జరిగినప్పుడు ఈ పొగడ్తలు దేశవ్యాప్తంగా వినిపించాయి. 1991లో అప్పటి దేశ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యానంతరం, తండ్రి అంత్యక్రియల్లో తల్లి సోనియాగాంధీ సరసన అమాయకంగా నిల్చున్న 19 ఏళ్ల ప్రియాంకను దేశవ్యాప్తంగా టీవీల్లో అంతా చూశారు. ఆ తర్వాత 27ఏళ్ల వయసులో తల్లి కోసం అమేథీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో తొలిసారిగా మెరిశారామె. చీరకట్టు, బాబ్డ్‌హెయిర్‌తో అచ్చంగా ఇందిరాగాంధీని గుర్తుకుతెచ్చే హావభావాలతో ప్రియాంక అందర్నీ ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి ఆమెను భావితరం నాయకిగా కీర్తించారు. ఆ తర్వాత సోనియాగాంధీ ప్రధాని కావడానికి విదేశీయత అడ్డుపడ్డప్పుడు కూడా అందరి దష్టి ప్రియాంకపైనే పడింది. కానీ ఆమె చాలాసార్లు వివిధ సందర్భాల్లో ప్రజలతో మమేకం అయినప్పుటికీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం గురించి ఎప్పుడూ పెదవి విప్పలేదు.
కుటుంబం కోసం…
ప్రియాంకను అంతా రాజకీయ యవనికపై చూడాలనుకున్నంటున్న సమయంలోనేఆమె పెళ్లి చేసుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తన చిన్ననాటి స్నేహితుడు మొరాదాబాద్‌కు చెందిన రాబర్ట్‌వాద్రాను 1997లో ప్రియాంక హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె కుటుంబ జీవితానికే పరిమితమయ్యారు. పిల్లల పెంపకంలో ప్రియాంక అత్యంత శ్రద్ధ వహించేవారు. ఢిల్లీలోని వసంతవిహార్‌లో ఉన్న శ్రీరామ్ స్కూల్లో కొడుకు రిహాన్, కూతురు మిరాయ చదివేవారు. స్కూల్లో జరిగే ప్రతీ పేరెంట్స్ మీటింగ్‌కు ఆమె తప్పకుండా హాజరయ్యేవారు. మరోవైపు రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు ట్రస్టీగా సంస్థకు సంబంధించిన వ్యవహారాలను చూసేవారు. అప్పుడప్పుడు తల్లి, సోదరుడి నియోజకవర్గాలైన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీలను సందర్శించేవారు. అంతకుమించి ప్రత్యక్ష రాజకీయాలకు ఆమె దూరంగానే ఉండేవారు.