జేపీ నడ్డా..అబద్ధాలకు అడ్డా
కాషాయపార్టీని కడిగేసిన కేటీఆర్
- -ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ మంచి పథకం
- -తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్న కేంద్రం
- -మతాలమధ్య చిచ్చుపెడుతున్న బీజేపీ
- -పచ్చగా ఉండటం వారికి నచ్చడం లేదు
- -119 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ 103 స్థానాల్లో గల్లంతు
- -కర్ణాటక తరహా రాజకీయాలు సాగవిక్కడ
- -50 లక్షల సభ్యత్వాలతో జోష్‌లో ఉన్నాం
- -నియోజవర్గ తెరాస విస్త్రత స్థాయి సమావేశంలో కేటీఆర్
హైదరాబాద్: క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలే తెరాస బలమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇప్పటి వరకు 50 లక్షల మంది తెరాస సభ్యత్వం తీసుకున్నారని వెల్లడించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నిర్వహించిన నియోజవర్గ తెరాస విస్త్రత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రం బాగుపడుతుంటే కొందరికి నచ్చడం లేదని మండిపడ్డారు. తెలంగాణ పచ్చగా ఉండటం కాంగ్రెస్, భాజపా నాయకులకు నచ్చడం లేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో వేసిన ఎత్తుగడలు తెలంగాణలో వేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
‘తెలంగాణలో అమలు చేస్తున్న ఒక్క పథకమైనా భాజపా పాలితప్రాంతాల్లో ఉందా’?అని కేటీఆర్ ప్రశ్నించారు. భాజపా నేతలు ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలు చూపెట్టాలని సవాల్ విసిరారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ మంచి పథకమని కేటీఆర్ అన్నారు. మన రాష్ట్రంలోని పథకాలనే కేంద్రం కాపీ కొడుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏడాదికి రూ.12 వేల కోట్లు పింఛన్లుగా ఇస్తుంటే అందులో కేంద్రం ఇచ్చేది కేవలం రూ.200 కోట్లు మాత్రమే అని వివరించారు. మతాల చిచ్చుపెట్టి, ఆ సెగతో కాపుకోవాలని భాజపా చూస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే కష్ణారావు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు,నవీన్, పార్టీ ఇతర నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ జాతీయ నాయకుడు జగత్ ప్రకాశ్ నడ్డా విమర్శలను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తిప్పికొట్టారు. దేశాన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌కు, బీజేపీకి తాము సాధిస్తున్న అభివద్ది నచ్చదని ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పచ్చి అబద్ధాలకు అడ్డా అని చురకలంటిచారు. రాష్ట్రంలో 119 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ 103 స్థానాల్లో డిపాజిట్ గల్లంతైందని గుర్తు చేశారు. కర్ణాటక తరహా రాజకీయాలు తెలంగాణలో సాగవని కేటీఆర్ చెప్పారు. కూకట్‌పల్లిలో జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ విస్త తస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, నవీన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా ఎక్కడ ఉందో నిరూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. సాగు నీటి రంగంలో కోటి ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టామని పేర్కొన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే నడ్డా విమర్శలు హాస్యాస్పదమని అన్నారు. అది నిజమే అయితే ఢిల్లీలో తేల్చండని హితవు పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే గడ్డం తీయనని శపథం చేసిన వ్యక్తి కనిపించడం లేదని పరోక్షంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌పై విమర్శలు చేశారు.
దానికంటే వెయ్యిరెట్లు మేలు..
‘ఆయుష్మాన్ పథకం కంటే ఆరోగ్య శ్రీ వెయ్యి రెట్లు మేలైంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా రూ. 2000 పింఛన్ పథకం లేదు. పింఛన్ పథకంలో కేంద్రం ఇచ్చేది రూ.200 మాత్రమే. మతాల మద్య చిచ్చు పెట్టడమే బీజేపీ లక్ష్యం. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కర్ఫ్యూలు ఒక్కటి కూడా జరగలేదు. మా పథకాలనే కాపీ కొట్టి ప్రవేశపెడుతున్నారు. మాధవరం కష్ణారావు లాంటి ఎమ్మెల్యే వుండటం కూకట్ పల్లి ప్రజల అదష్టం. తెలంగాణ వ్యాప్తంగా 50 లక్షల సభ్యత్వాలు సాధించాం. నామినేటెడ్ పదవులు కార్యకర్తలకు తప్పకుండా ఇస్తాం. బంగారు తెలంగాణ సాధించే వరకు అవిశ్రాంత పోరాటం చేస్తాం’అని కేటీఆర్ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారమే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. గ్రేటర్‌లో గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు.
విరుచుకుపడ్డ టీఆర్‌ఎస్ నేతలు
జేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేయలేని అభివద్ది తెలంగాణలో చేసి చూపిస్తామని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీతో బాధ్యతాయుతంగా మాట్లాడాలని టీఆర్‌ఎస్ నేతలు హితవు పలికారు. ఒక్క సీటు పట్టుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేపట్టిందని.. నిన్న మీటింగ్‌లు పెట్టుకున్న బీజేపీ నేతలకు కళ్లుంటే.. ఒకసారి చూడాలని అన్నారు. ప్రభుత్వాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా మాట్లాడాలని తలసాని హితవుపలికారు. ఇష్టానుసారంగా మాట్లాడితే పుట్టగతులుండవని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ కేవలం టీఆర్‌ఎస్ నాయకులను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారని, వాళ్లు ఏం చేసింది, ఏం చేయబోతోంది చెప్పలేదని అన్నారు.