‘ఆరోగ్యశ్రీ’కి అనారోగ్యం

తెలంగాణలోని 242 కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో నిలిచిపోయిన వైద్య సేవలు 
  • – ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌ 
  • -రూ. 1500 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ఆందోళన 
  • -రోజుకు 1000కి పైగా రోగులకు ఆరోగ్యశ్రీ చికిత్సలు 
  • -సేవల నిలిపివేతతో ఆందోళన పడుతున్న రోగులు 
  • -రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల కఠోర నిర్ణయం
  •  అవస్థలు పడుతున్న పేద, మధ్యతరగతి రోగులు 
  • -డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకుంటున్న కొందరు రోగులు 
  • -డయాలసిస్‌ సేవల బంద్‌తో కిడ్నీ రోగుల అవస్థలు 
  • – ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయుల ఆరోగ్య సేవలు బంద్‌
  •  -వైద్య శాఖామంత్రితో జరిపిన చర్చలు విఫలం 

హైదరాబాద్‌: 

తెలంగాణలోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు గత శుక్రవారం నుంచి నిలిచిపోయాయి. 242 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. కాగా ఈ పథకానికి సంబంధించి ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు సర్కారు చెల్లించకపోవడంతో పథకానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. బిల్లులు ఎప్పుడు వస్తాయంటూ.. కొంతకాలంగా ఎదురు చూసిన ప్రైవేట్‌ ఆసుపత్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ విషయాన్ని ప్రైవేట్‌ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సంఘం ఆధ్వర్యంలో పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా వారి బిల్లులు మంజూరు కాకపోవటంతో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిపేయాలని నిర్ణయించుకున్నారు. 
హైదరాబాద్‌: 
ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదలతో నగరంలో వివిధ ప్రైవేటు ఆసుపత్రుల వద్ద రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా ఆరోగ్యశ్రీ రోగులను ఆసుపత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించడంతో పలువురు వెనుతిరిగారు. కొందరు డబ్బు చెల్లించి వైద్య సేవలు చేయించుకున్నారు. గత శుక్రవారం నుంచి అన్ని ప్రైవేటు ఆసుపత్రుల పరిధిలో ఆరోగ్యశ్రీ సేవలను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రోగులకు అగచాట్లు తప్పలేదు. సికింద్రాబాద్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల్లో ఉండే ప్రధాన కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చాలామంది రోగులకు నిరీక్షణ తప్పలేదు. ప్రతినిత్యం వేలాది రోగులు ఆసుపత్రులకు వచ్చి ఎదురు చూసి వెనుతిరుతున్నారు. అయితే అత్యవసర పరిస్థితిలో కొన్ని చికిత్సలకు డబ్బులు చెల్లించి చేయించుకున్నారు. కొందరు హైదరాబాద్‌ నిమ్స్‌కు రావడంతో ఓపీలో రద్దీ బాగా పెరిగింది. మూత్రపిండాల రోగులకు ఆరోగ్యశ్రీ కింద నగరంలో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్‌ చేస్తుంటారు. వారంలో 3-4 సార్లు తప్పసరిగా ఇది చేయాలి. ఒక్కో డయాలసిస్‌కు కార్పొరేట్‌ ఆసుపత్రిలో రూ.5-7 వేల వరకు వసూలు చేస్తుంటారు. దీంతో ఆరోగ్యశ్రీలో ఎక్కువ మంది డయాలసిస్‌కు వస్తుంటారు. ఒక్కో ఆసుపత్రి పరిధిలో 20 వరకు రోగులకు ఈ పరీక్షలు ఆరోగ్యశ్రీ కింద జరుగుతుంటాయి. 
పేదలు ఎక్కువ మంది ఆరోగ్యశ్రీ కింద కేన్సర్‌ చికిత్సలు పొందుతుంటారు. తదనంతరం రేడియేషన్‌, కీమోథెరపీ లాంటి చికిత్సలు చేయించుకోవడం సాధారణమే. ప్రస్తుతం ఆయా సేవలు నిలుపుదలతో ఇలాంటి వారందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో బంద్‌ కావడంతో వెనుతిరుగుతున్నారు. డయాలసిస్‌ లాంటి పరీక్షలకు సొంత డబ్బులు చెల్లించామని రోగులు తెలిపారు. సాధారణ రోజుల్లో నిమ్స్‌కు 20-250 వరకు ఆరోగ్యశ్రీ రోగులు వస్తుంటారు. శుక్రవారం ఈ కౌంటర్‌ వద్ద ఒక్కసారిగా రద్దీ పెరిగింది. నిమ్స్‌లో ఈ సేవలకు ఇబ్బంది లేదని అధికారులు చెప్పారు. 
డిమాండ్లు ఇవే.. 
కాగా.. ప్రభుత్వం ముందు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రి యాజమాన్యాలు నాలుగు డిమాండ్లు పెట్టాయి. రూ. 1500 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆందోళనకు దిగాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌తో ఎంవోయూ చేసుకున్న విషయం విదితమే. ప్యాకేజీ రేట్లు సవరించాలని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ డిమాండ్‌ చేస్తోంది. 
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయుల ఆరోగ్య పథకాల సేవలు నిలిచిపోయాయి. దీంతో ముఖ్యంగా రోడ్డు ప్రమాద బాధితులు, రక్తశుద్ధి, కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి దీర్ఘకాలిక చికిత్సలను క్రమం తప్పకుండా చేయించుకునేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందస్తుగా శస్త్రచికిత్సలకు ప్రణాళికలు రూపొందించుకున్నవారు నిరాశగా వెనుదిరిగారు. చాలాచోట్ల ఈ తరహా శస్త్రచికిత్సలను వాయిదా వేసుకున్నారు. కొన్నిచోట్ల అత్యవసర చికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఒక్క వరంగల్‌లోనే శుక్రవారం సుమారు 124 చికిత్సలను ప్రైవేటు ఆసుపత్రుల నుంచి ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. 
40% కేసులే నమోదు.. 
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అనుసంధానంగా 96 ప్రభుత్వ, 13 కార్పొరేట్‌, 224 ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌ హోంలు, 50 దంత వైద్యశాలలు సేవలందిస్తున్నాయి. వీటిలో సగటున రోజుకు సుమారు 1000 మంది వరకూ ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సలకు నమోదు చేసుకుంటుంటారు. శుక్రవారం నుంచి ఈ సేవల బంద్‌ నేపథ్యంలో.. తొలిరోజు కేవలం 40 శాతం కేసులు మాత్రమే చికిత్స కోసం నమోదైనట్లు తెలుస్తోంది. ఇందులోనూ అత్యధికం (దాదాపు 80 శాతం) ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. 
చెల్లింపులపై ఎవరి వాదన వారిదే 
ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకాలకు కలిపి ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.1500 కోట్ల మేర బకాయి పడిందని ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుసంధాన ఆసుపత్రుల సంఘం (తన్హా), తెలంగాణ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం (టీషా) చెబుతున్నాయి. ప్రభుత్వం మాత్రం.. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు చెల్లించాల్సింది రూ.457.74 కోట్లేనని చెబుతోంది. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా తన్హా, టీషాలు తప్పుడు గణాంకాలు ప్రచారం చేస్తున్నాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి. 
నిలిపివేత కొనసాగింపు 
ఆరోగ్యశ్రీ అనుసంధాన ఆసుపత్రులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ గత శుక్రవారం ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో చర్చలు జరిపారు. వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ మాణిక్‌రాజ్‌, తన్హా అధ్యక్షుడు డాక్టర్‌ రాకేశ్‌, కొందరు ప్రతినిధులు పాల్గొన్నారు. ఏటా కొంత బకాయిలు మరుసటి ఏడాదికి వాయిదా పడడం సాధారణమేనని, త్వరలోనే మరో రూ.200 కోట్లు విడుదల చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ఈటల చెప్పారు. సేవలు కొనసాగించాలని కోరారు. అధికారులు చెప్పిన బకాయిల లెక్కలతో తన్హా ప్రతినిధులు ఏకీభవించలేదు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని మరోసారి సరిచూసుకొని చర్చల్లో పాల్గొంటామని తెలిపారు. మంత్రి సూచనలపై సంఘంలో చర్చించి సేవల కొనసాగింపుపై తుది నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకూ సేవలు కొనసాగించేది లేదని తన్హా అధ్యక్షుడు రాకేశ్‌ తెలిపారు. ఈ సమావేశంలో తన్హా ప్రతిపాదించిన మరికొన్ని అంశాలపైనా చర్చించారు.