కీర్తే శాశ్వతం

ప్రపంచంలోనే మేధావిగా పేరుగాంచిన జీవి మనిషి. విచక్షణ, ఆలోచన, మనసు, మేధస్సు, అపారశక్తి మనిషిని ఉత్తమోత్తమంగా తీర్చిదిద్దుతాయి. కానీ అశాశ్వతమైన ఈ ప్రపంచంలో మనిషి ఉనికిని సదా కాపాడుతాయా? సుస్థిరంగా నిలబెడుతాయా? అంటే సమాధానం ఉండదు. రామాయణం రాసిన వాల్మీకి కీర్తి సైతం ప్రపంచంపై సూర్యచంద్రులు నిలిచి ఉన్నంతవరకే పరిమితం అని చెప్పినప్పుడు, మామూలు మనిషి పరిస్థితిని ఊహింగచలం. 
ప్రపంచమే అశాశ్వతమైనప్పుడు మనిషి ఉనికి శాశ్వతత్వం పొందడం అసాధ్యం. అలుపెరుగని శ్రమతో, జీవన మకరందాన్ని ఆస్వాదించకనే ధనరాశినీ, పలుకుబడినీ, తరతరాలకూ తరగని సంపదను పోగు చేసుకోవడానికి బంధాలను దూరం చేసుకొని జీవితాన్నే పణంగా పెట్టి బతికిన మనిషితో పాటు అవన్నీ మట్టిలో కలిసిపోతాయి. కానీ మానవత్వం ఉట్టిపడే స్వభావంతో మంచి నడవడికతో, నలుగురికీ ఉపయోగపడే తత్వంతో బతికిన మనిషి వెళ్లిపోయినా అతని కీర్తి మాత్రం ప్రపంచం ఉన్నంతవరకూ ఉంటుంది. ప్రపంచానికి అతని గొప్పతనం తెలియాల్సిన అవసరం లేదు. సామాజికంగా తన చుట్టూ ఉన్నటువంటి ఏ కొందరి మనస్సులో అతని పేరు స్థిరమై నిలిచిపోతే చాలదా? ఇంతకంటే ఏం సాధిస్తాం మనం. మనిషి మనిషిగా ఎదగాలనేదే ధర్మం. మానవత్వానికి హంగులద్ది, యాంత్రికతను ఆపాదించి మరమనిషిగా మారితే మానవలోకానికి అర్థం ఉండదు. 
పరమాత్మగా, ప్రకతిగా, ఆదిమాతగా, ఆది పితగా, ఆమె తొలి సంతానంగా, అద్వితీయ పరాచేతనగా అభివర్ణించబడిన అదితి లోకాలను ప్రకాశింపజేస్తుంది. కోటానుకోట్ల జీవరాశుల జీవన చైతన్యం ఆమె. లోకంలో ఇంతకు మునుపు పుట్టినవి, ఉత్పన్నమైనవి, ఆవిర్భవించినవి ఆమె. వర్తమానంలో కనిపించేవి సమస్తం ఆమె. రాబోవు కాలంలో జనించేవి, ఉత్పన్నమయ్యేవి, ఆవిర్భవించేవీ ఆమె. అదితికి భిన్నమైనది ఈ ప్రపంచంలోనే లేదు. ఇదే ఋషిద ష్టి, దివ్యద ష్టి. ఇంతరకు మించిన భావనకు రూపం కనిపించదు. భావమయ జగతికి చైతన్యంతో ప్రాణం పోసిన అద్భుత తత్తం అదితి.
చైతన్య జనితం అయిన ప్రపంచంలో భావ జగతిని పాలించే మానవ జీవితం అనంతకోటి జీవరాశుల్లో ప్రత్యేకం. ఆలోచనారాహిత్యంలో కొనసాగే మానవత్వం పరిమళించదు. ప్రపంచ మనుగడలో రాణించదు. భావమే భాగ్యమై పరమాత్మ తత్తాన్ని అర్థం చేసుకునేంత ఉన్నతి రావాలి. కంటికి కనిపించని భగవత్తత్తం భావ జగతిలో చైతన్యమై ప్రకాశిస్తుంది. దానిని తెలుసుకోగలగడమే జీవన పరమార్థం. 
అదితి స్వరూప తత్వాన్ని వేదం అభివర్ణించడంలో అంతరార్థం ఏమిటంటే, అంతటా అనంతమై, అద్వితీయమై భాసిస్తూనే ఏకమై నిలిచే ఆలోచనా ద క్పథం పరమాత్మగా తెలియజెప్పాలనే. మన ఆలోచనా ప్రపంచం, భావ జగతి జీవన సార్థకతను చేరుకునే గమ్యాన్ని చూపించాలనే. చైతన్యశక్తి ప్రసాదించే ఆత్మవిశ్వాసంలోనే జీవజాతి ఉన్నతి సుసాధ్యం.సుందర శరీరం, అందమైన భార్య, విమల కీర్తి, మేరువంత సంపద.. ఇవన్నీ మంచి పనులు చేయటం వలన లభించేవే కానీ శాశ్వతమైనవి కావు. ఇవన్నీ మారిపోతే, జారిపోతే? గతి ఏమి? గురు పాదపద్మములపై మనస్సు లగ్నం కాకపోతే? తర్వాత ఏమిటి? 
వంశ సంపద, బంధుసంపద, వేదాధ్యయనం, శాస్త్ర విద్యా సంపద, మధుర వాక్కులు, పాండిత్యం, కవిత్వం, ఇవన్నీ మార్పుచెందేవే, నశించేవే. తర్వాత ఏమిటి? విదేశంలో గౌరవం, స్వదేశంలో ధన్యత, సదాచారం వలన కలిగే ప్రాబల్యం, పొందే అగ్రస్థానం… ఇవీ శాశ్వతం కావు. గురు పాదములయందు మనసు నిలకడ చెందకపోతే? తర్వాత ఏమిటి? 
భూపాల మండలమంతా చేసే పాదపూజ, సేవ సైతం తాత్కాలికమే. అవి సంతోషాన్ని, సుఖాన్ని యివ్వవచ్చునేమో కానీ, అవీ క్షణికాలే. ఈ గౌరవాలన్నీ కాసేపు మనసుకు సంతోషం కలిగిస్తయ్‌. కానీ ఆనందాన్ని యివ్వవు. ఇవీ రూపురేఖలు మార్చుకుని ఏదో నాటికి మాసిపోయేవే? గురుచరణ లగ్నం కాని మనసు వీటిని నిలబెట్టుకోలేదు.