మందుల..మాయ

డాక్టర్లతో కుమ్మక్కయి కల్తీ ట్యాబ్లెట్లు అంటగడుతున్న నకిలీ ఏజెన్సీలు 

-తెలంగాణ వ్యాప్తంగా నకిలీ మందుల జోరు 
-నాణ్యత కొరవడిన మందులతో రోగుల గగ్గోలు 
-డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల నామమాత్రపు తనిఖీలు 
-రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్న వైద్యులు, ఏజెన్సీలు 
-స్పెల్లింగ్‌ తప్పులతో అసలు మందుల స్థానంలో నకిలీలు 
– లాభాలు ఆశించి రోగులకు అంటగడుతున్న దుకాణదారులు 
-వైద్యుల నిర్వహణ ఖర్చులన్నీ భరిస్తామంటూ వస్తున్న నకిలీ ఏజెన్సీలు 
-లాభాల కోసం ఏజెన్సీలు సూచించిన మందులు రాస్తున్న వైద్యులు 
-కాలంచెల్లిన మందులు సైతం యథేచ్ఛగా అమ్మేస్తున్న వ్యాపారులు

 

హైదరాబాద్‌: 
పాణం కాపాడాల్సిన గోళీ మందులను విషపు గుళికలుగా మారుస్తున్నారు కొందరు కేటుగాళ్లు. కడుపులో వేసుకుని వ్యాధులను నయం చేసే ట్యాబ్లెట్లను కల్తీ చేసి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు కల్తీగాళ్లు. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు ప్రాంతాలలో నకిలీ మందుల వ్యాపారం జోరుగా సాగుతోంది. కొందరు వైద్యులు కాసుల కక్కుర్తితో, విదేశీ పర్యటనలపై మోజుతో నాసిరకం మందులను రోగులకు రాసిస్తున్నారు. సంగారెడ్డితో పాటు మెదక్‌, సంగారెడ్డి, ఖమ్మం ఇతర పట్టణాల్లో ఈ దందా కొనసాగుతోంది. 
కొన్ని మెడికల్‌ స్టోర్ల నిర్వాహకులు కూడా నకిలీ మందులతో జీరో బిజినెస్‌ చేస్తున్నారు. దీనివల్ల ఒకవైపు రోగులకు నష్టం జరగడంతో పాటు మరో వైపు ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. మందు బిళ్లలను ప్రాణాంతక మాత్రలుగా మారుస్తున్న మోసగాళ్ల్లు అత్యధికంగా మెడికల్‌ ఏజెన్సీలు ఉన్న ప్రాంతాలలో వీరి దందా కొనసాగుతోంది. ఇందులో కొన్ని ఏజెన్సీలు నకిలీ ఔషధ దందా సాగిస్తున్నాయి. కాంట్రాక్టు బేసిస్‌ మెడిసిన్‌ పేరుతో ఈ దందా సాగుతోంది. ఏజెన్సీలతో పాటు మందుల తయారీ కంపెనీలు కొన్ని నేరుగా వైద్యులతో సంబంధాలు పెట్టుకుని, వారు నడుపుతున్న ఆస్పత్రులకు నకిలీ మందులను సరఫరా చేస్తున్నాయి. వీటికి ఎలాంటి బిల్లులు ఉండవు. మరికొందరు వైద్యులు మందుల దుకాణాల యజమానులతో కుమ్మక్కై అధిక లాభాలు వచ్చే కొన్ని రకాల నకిలీ మందులనే రాసిస్తున్నారు. ప్రతి ఫలంగా భారీ పర్సెంటేజీలు అందుకుంటున్నారు. ఈ వ్యవహారం డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులకు తెలిసినా కాసుల కక్కుర్తితో దుకాణాలపై దాడులు చేయడం లేదు. వైద్యులకు భారీ నజరానాలు..! డాక్టర్ల అండతో రెచ్చి పోతున్న కల్తీ గాళ్లు..!! కాంట్రాక్ట్‌ బేసిస్‌ మందులు సిఫారసు చేసినందుకు డాక్టర్లకు కంపెనీ ప్రతినిధులు ప్రతి మూడు నెలలకు ఒకసారి లక్ష రూపాయల వరకూ ముట్టజెబుతున్నారు. 
అలాగే ఖరీదైన బహుమతులు అందజేస్తున్నారు. ఏడాదికి రెండుసార్లు థాయ్‌లాండ్‌, దుబాయ్‌, మలేషియా, సింగపూర్‌, హాంకాంగ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వంటి విదేశీ పర్యటనలకు పంపుతున్నారు. అలాగే దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో సమావేశాల పేరుతో స్టార్‌ హోటళ్లలో విందులు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యుల అండ కోసం కంపెనీలు ఇంత భారీగా వ్యయం చేస్తున్నాయంటే వారికి ఏ స్థాయిలో లాభాలు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అవసరార్థం వచ్చే రోగుల నుంచి మెడికల్‌ కంపెనీలు అడ్డగోలుగా దండుకున్న సొమ్మునే ఇలా ఖర్చు చేస్తున్నారని స్పష్టమవుతోంది. సంగారెడ్డి, మెదక్‌ నుంచి సరఫరా..! ఏపి పాకిన కల్తీ వ్యాధి..!! నకిలీ మందులు ఎక్కువగా సంగారెడ్డి, మెదక్‌ కేంద్రంగా కర్నూలు జిల్లాకు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ పరిసరాల్లో డ్రగ్స్‌ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో కొన్నింటిలో నకిలీ మందులు తయారు చేసి పంపుతున్నట్లు తెలుస్తోంది. 
ఈ మందులు వాడటం వల్ల రోగులకు కొత్తగా ఎలాంటి దుష్పరిణామాలూ ఉండవు. ఆరోగ్యానికి హానికరం కాని పౌడర్లను ఉపయోగించి తయారుచేస్తుండడమే ఇందుకు కారణం. ఈ నకిలీ మందుల తయారీకి అయ్యే ఖర్చు తక్కువ. కానీ ఎమ్మార్పీ మాత్రం భారీగా ఉంటుంది. ఈ మందులు వాడితే రోగికి ఉన్న జబ్బు నయం కాదు. పైగా మరింత ముదిరి రోగి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమయ్యే పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది. ఎక్కడ చూసినా నకిలీ మందులే..! మొద్దు నిద్రలో విజిలెన్స్‌ అదికారులు..!! నొప్పి నివారణకు వాడే అసిక్లోఫినాక్‌ మందు స్థానంలో ‘ఎ…ఆ…’ అనే రెండురకాల కంపెనీల పేర్లతో ఉన్న మందులు అంటగడుతున్నారు. జలుబు, అలర్జీ నియంత్రణకు వాడే సిట్రిజిన్‌న్‌స్థానంలో ఓ..సె.., ఆ.. పేర్లతో ఉండే మందులను, కడుపులో మంట నివారణకు వాడే ఫాంటాప్రిజోల్‌ స్థానంలో ‘ ఫా’ పేరుతో ఉండే మరో మూడు రకాల నకిలీ మందులను రాసిస్తున్నారు. ఇలా చాలా రకాల నకిలీ మందులు మెడికల్‌ స్టోర్ల నుంచి రోగులకు చేరుతున్నాయి. వీటిపై లాభాల శాతం అధికంగా ఉంటోంది. దీంతో మందుల దుకాణ యజమానులు భారీగా దండుకుంటున్నారు. ఇందులో కొంత పర్సెంటేజీ వైద్యులకు ముట్టజెప్పుతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో మెడికల్‌ స్టోర్లు ఏర్పాటు చేసిన వారు ఆస్పత్రి కరెంటు బిల్లు, ఇతర ఖర్చులను కూడా భరిస్తున్నారు. రుగ్మతలతో డాక్టర్ల వద్దకు వచ్చే రోగులను డాక్టర్లు, మెడికల్‌స్టోర్‌ నిర్వాహకులు కలిసి నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదంతా తెలిసినా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు మాత్రం చర్యలు తీసుకోకుండా నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. 
మందుల ధరలు తగ్గిస్తే.. 
ప్రజలకు తక్కువ ధరలకు మందులు ఇస్తామని హోల్‌సేల్‌ వ్యాపారులు పోటీ వ్యాపారం వల్ల ముందుకొచ్చారు. రిటైల్‌షాపుల వారికి నష్టం వాటిల్లుతుందని వారికి వత్తాసుగా ఔషధ నియంత్రణశాఖ అధికారులు 2018 డిసెంబర్‌ మొదటి వారంలో తమ కార్యాలయంలో సమావేశంపెట్టి మందులపై డిస్కౌంట్‌లు ఎక్కువ ఇస్తే ఊరుకోమని హెచ్చరించారు. చేయాల్సిన విధులు నిర్వహించకుండా ఔషధ నియంత్రణ అధికారులు ఎలాంటి పనులు చేస్తున్నారో ఈ మీటింగ్‌ను బట్టి చెప్పకుండానే అర్ధం చేసుకోవచ్చు. 
ఆన్‌లైన్లో దరఖాస్తు చేస్తే చుక్కలే.. 
మందుల షాపులకు ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారికి సవాలక్ష నిబంధనలు చూపించి లైసెన్స్‌ను మంజూరు చేయకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. మందులషాపుల యూనియన్‌ కార్యాలయంలో సంప్రదిస్తే తక్షణమే మందులషాపులకు అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. 
విజిలెన్స్‌ తనిఖీల్లో ఇలా.. 
విజిలెన్స్‌ అధికారులు పలు మందులషాపుల్లో మూడు సార్లు తనిఖీలు చేసి అర్హతలేని వ్యక్తులు మందులు అమ్మటం, కాల పరిమితిదాటిన మందులు అమ్మటం, మందులు అమ్ముతున్నట్లు రికార్డుల్లో చూపకపోవటం, మందులను సరైన విధానంలో నిల్వచేయకపోవటం, రోగులకు కంపెనీవారు ఉచితంగా అందించే శాంపిల్‌ మాత్రలు అమ్మటం, అనుమతులు లేకుండా మందులను అమ్మటం ఇతర లోపాలను గుర్తించారు. 
నిబంధనలకు తిలోదకాలు.. 
ఫార్మాసిస్టుల షాపుల నిర్వాహకులు, ఔషధనియంత్రణ, పరిపాలనశాఖ అధికారులు ఇరువురు కూడా నిబంధనలకు నీళ్లు వదిలారు. లైసెన్స్‌ల మంజూరుకు రూ.30 వేల వరకు వసూలు చేస్తూ నిబంధనలు పాటించకపోయినా పట్టించుకోవటం లేదు. ఫార్మాసిస్టు కోర్సు చేయని వారు, మందుల గురించి తెలియని వారు మందులు విక్రయిస్తున్నారు. కొంత మంది వ్యాపారులు ఫార్మసిస్టుల సర్టిఫికెట్‌ను అద్దెకు తీసుకుని షాపులను నిర్వహిస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో మందులను వైద్యులే తమ అసిస్టెంట్స్‌తో అమ్మకాలు చేయిస్తున్నారు. షాపు పెట్టకుండా కొద్దిపాటి గదుల్లోనే మందులు అమ్మిస్తున్నారు. 
ఆస్పత్రుల తనిఖీ సమయంలో.. 
గతంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రుల్లో తనిఖీలు చేసిన సమయంలో పదోతరగతి కూడా ఉత్తీర్ణత చెందని వ్యక్తి మందులు అమ్ముతూ పట్టుబడ్డాడు. ఔషధ నియంత్రణ పరిపాలనశాఖ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఫార్మాశిస్టులే మందులు విక్రయాలు చేసేలా చూడాలని, నకిలీ మందులను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.