హరిత..ఆహారం

మొక్కలు బొక్కేస్తున్న దళారులు…అధికారుల చేతివాటం 

-అత్యంత ప్రతిష్టాత్మక హరితహారం పథకం 
-ఒక్కో పెద్ద మొక్కపై రూ.330 ఖర్చుపెడుతున్న సర్కారు 
-నాలుగేళ్లుగా పాతిన మొక్కలు 4.5 కోట్లు 
-బతికి పెరిగిన మొక్కలు చాలా తక్కువ 
-దేశవ్యాప్తంగా కురిపిస్తున్న ప్రశంసలు 
-పచ్చని పథకాన్ని నీరుగార్చే ప్రయత్నాలు 
-అధికారుల అండతో దళారుల ఇష్టారాజ్యం 
-తూతూ మంత్రంగా అధికార కార్యక్రమాలు 
-పర్యవేక్షణ లోపంతో దళారులకు కాసుల పంట 
-హెచ్‌ఎండిఏ నిలువెత్తు నిర్లక్ష్యానికి సాక్ష్యం 

”మొక్కల పెంపకం పేరు చెప్పి కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సుమారు 160 రకాలకు చెందిన మొక్కలను అందుబాటులో ఉంచుతున్నామంటూ అధికారులు చెబుతున్నారు. తీరా.. హరితహారం పంపిణీ కార్యక్రమానికి వచ్చేసరికి ఏవో కొన్ని రకాలతోనే సరిపెడుతున్నారు. నర్సరీల నిర్వహణలో భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు ఎప్పటి నుంచో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పట్లోనూ హెచ్‌ఎండీఏ అధికారులకు అనేక ఫిర్యాదులు అందాయి. అసలు కాగితాల్లో ఉన్న లెక్కలకు.. నర్సరీల్లో ఉన్న మొక్కలకు భారీగా తేడా ఉంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి” 

హైదరాబాద్‌: 
4.5 కోట్లు.. నాలుగేళ్లుగా హరితహారం కార్యక్రమంలో హైదరాబాద్‌ మహానగరాభివద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) నాటిన మొక్కల సంఖ్య ఇది. ఈ దఫా మరో 1.16 కోట్లు నాటేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ లెక్కలు చూస్తే ఎవరైనా ఆహో.. ఓహో అనాల్సిందే. కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి విభిన్నంగా ఉంది. కాగితాల్లో మొక్కలు నాటేసి చేతులు దులుపుకుంటారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నాలుగేళ్లలో కనీసం తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేకపోవడం పలు అనుమానాలు తావిస్తోంది. ఎన్ని మొక్కలను పంపిణీ చేశారు.. ఎక్కడెక్కడ నాటారు.. వాటిలో ఎన్ని బతికి బట్టకట్టాయనే లెక్క లేదంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 
తెలంగాణకు హరితహారం ద్వారా రాష్టాన్న్రి హరిత తెలంగాణగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి హెచఎండీఏ అధికారులు ఆరంభంలోనే తూట్లు పొడుస్తున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం హెచ్‌ఎండీఏ పరిధిలో అక్రమాల పుట్టగా మారింది. నర్సరీలో మొక్కల పెంపకం పేరుతో.. బ్యాంకుల నుంచి రూ.లక్షలు డ్రా చేస్తున్న అధికారులు అందులో సగం కూడా మొక్కల పెంపకానికి ఖర్చు చేయకుండా మింగేస్తున్నారు. ఏ శాఖలోనూ లేనివిధంగా.. నిధులన్నీ నగదు రూపంలోనే అందుకునే వెసులుబాటు ఉండటంతో హెచఎండీఏలోని అర్బన ఫారెస్టరీ అధికారులకు అక్రమాలకు పాల్పడే అవకాశం కలుగుతోంది. హెచఎండీఏ పరిధిలో ఈ ఏడాది భారీఎత్తున మొక్కలు నాటాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. అందుకు తగ్గట్టుగా మొక్కల పెంపకానికి భారీ బడ్జెట్‌ కూడా కేటాయించారు. దీంతో నేరుగా నగదు డ్రా చేసుకునే అధికారం ఉండటంతో.. హెచఎండీఏ అధికారుల కన్ను హరితహారం బడ్జెట్‌పై పడింది.. 
లక్షల్లో డ్రా.. వేలల్లో చెల్లింపులు 
ఎక్కడైనా పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెక్కుల రూపంలో బిల్లులు చెల్లిస్తారు. కానీ హెచఎండీఏలో మాత్రం.. అర్బన ఫారెస్టరీ విభాగం మేనేజర్లే కాంట్రాక్టర్లకు నేరుగా నగదు చెల్లిస్తారు. పైగా ఈ పేరిట రూ.లక్షల్లో డ్రా చేస్తూ.. కేవలం రూ.వేలల్లో మాత్రమే చెల్లిస్తున్నారు. నెలాఖరుకో, 15 రోజులకోసారో బిల్లు చెల్లించే అవకాశమున్నా.. అధికారులు ప్రతిరోజూ బ్యాంకు నుంచి రూ.లక్షలు డ్రా చేస్తున్నారు. మొక్కల పెంపకానికి సంబంధించి సుమారు రూ.25 కోట్ల వరకు నిధులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఎవరికి ఎంత చెల్లించారనే వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. కాగా నేరుగా నగదు డ్రా చేసుకునే అధికారం ఉండటంతో.. ఇతర ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన అధికారులు ఏళ్ల తరబడి హెచఎండీఏలో అర్బన ఫారెస్టరీ మేనేజర్లుగా కొనసాగుతున్నారు. ఒక మేనేజరైతే 20ఏళ్లుగా పదోన్నతి కూడా తీసుకోకుండా కొనసాగుతున్నట్లు తేలింది. ఈయన హార్టికల్చర్‌ నుంచి డిప్యుటేషనపై వచ్చి అక్రమార్జనకు పాల్పడుతూ హెచఎండీఏలోనే పర్మినెంట్‌గా సెటిలయ్యాడు. మరో నలుగురు మేనేజర్లు అటవీశాఖ నుంచి డిప్యుటేషనపై వస్తూ.. వెళ్తుంటారు. ఏళ్ల తరబడి వీరిది ఇదే తంతు. ఇక వీరిపై ఉండే ఇద్దరు బాసులది మరీ విచిత్రం. డైరెక్టర్‌ హోదాలో మాత శాఖలో పనిచేసిన ఓ అధికారి ఇక్కడికి అసిస్టెంట్‌ హోదాలో వచ్చారు. మరో అధికారి అయితే ఏకంగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టు లేకపోయినా క్రియేట్‌ చేసుకొని మరీ సెటిలయ్యాడు. 
మొక్కల పెంపకం సాకుతో నిధులు స్వాహా… 
అన్ని సంస్థల్లోలాగే హెచఎండీఏలో లిస్టయిన కాంట్రాక్టర్లు ఉంటారు. ఇక్కడ జరిగే పనులన్నీ వీరితోనే చేయించాల్సి ఉంటుంది. కానీ, నర్సరీల్లో మొక్కల పెంపకంలో కాంట్రాక్టర్ల పాత్ర ఉండదు. అంతా అధికారులే నిర్వహిస్తారు. దీనినే ఆసరాగా చేసుకొని.. ప్లాస్టిక్‌ కవర్లు, మట్టి, ఎరువులు, విత్తనాల కొనుగోలు పేరిట భారీస్థాయిలో నిధులు కొల్లగొడుతున్నారు. 4…7 సైజు బ్యాగులో ఒక మొక్క ఏడాది పెరగడానికి రూ.13 నుంచి రూ.17 వరకు ఖర్చు అవుతుంది. ఏడాదిలో అంటే.. మొక్క మీటరు ఎత్తు పెరగాలి. కానీ ఇక్కడ నర్సరీలోని ఏ మొక్క కూడా మీటరు ఎత్తు పెరగదు. కోట్లాది మొక్కలు పెంచాలన్నపుడు ముడి పదార్థాలను పెద్దమొత్తంలో ఒకేసారి కొనాల్సి ఉంటుంది. ఇందుకు టెండర్‌ పిలవాలి. దీంతో అలాంటి చిక్కులు రాకుండా తక్కువ మొత్తాల్లో కొనుగోలు చేసినట్లు బిల్లులు చూపిస్తున్నారు. రూ.లక్ష లోపు కొనుగోళ్లపై పర్యవేక్షణ లేకపోవడం వీరికి వరంలా మారింది. అర్బన ఫారెస్టరీ మేనేజర్లకు రూ.లక్ష వరకు చెక్‌ పవర్‌ ఉంటుంది. దీంతో.. ఒక్కొక్కరికి లక్ష చొప్పున రూ.కోట్లను మింగేస్తున్నారు. మొక్కల పెంపకంపై పర్యవేక్షణ, ఆపై ఆడిటింగ్‌ విధానం లేకపోవడంతో అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. 

ఖర్చు భారీగా..! 
హరితహారం కార్యక్రమాన్ని ఏటా హెచ్‌ఎండీఏ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఇందుకోసం భారీగానే నిధులను వెచ్చిస్తోంది. మొక్కలు పెంచేందుకు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక నర్సరీలను నిర్వహిస్తోంది. మొక్కల నాటిన తర్వాత నిర్వహణ పేరిట కూడా భారీగానే నిధులను వెచ్చిస్తోంది. అవుటర్‌పై నిర్వహణతోపాటు అన్ని ఖర్చులను కలుపుకుని ఒక్కో పెద్ద మొక్కపై రూ.330.. ఒక్కో చిన్న మొక్కపై రూ.120 వరకు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధాన మార్గంపై మొక్కల నిర్వహణకుగాను ఒక్కో కి.మీకు ప్రతినెలా రూ.50 వేల వరకు వెచ్చిస్తున్నట్లు పేర్కొంటున్నారు. 158 కి.మీల ప్రధాన మార్గంపై ఎంత ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్లనేమో మొక్కల నిర్వహణను.. వాటిని నాటిన గుత్తేదారు సంస్థలే చూసుకుంటున్నాయి. 

పరిరక్షణ తూతూమంత్రం..! 
అవుటర్‌ రింగ్‌ రోడ్డుపై హెచ్‌ఎండీఏ అధికారులు ప్రధానంగా ద ష్టి సారించారు. సుమారు కోటికి పైగానే మొక్కలు నాటారు. హెచ్‌ఎండీఏకు సంబంధించిన ఖాళీ భూములు, లేఅవుట్లు, పారిశ్రామికవాడల్లో, గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు, రేడియల్‌ రోడ్లు, సర్వీస్‌ రోడ్లు తదితర ప్రాంతాల్లో నాటుతున్నారు. ఎక్కడ స్థలం దొరికితే అక్కడ నాటుకుంటూ పోతున్నారు.. కానీ పరిరక్షణపై ద ష్టి సారించడం లేదు. తూతుమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. ట్రీ గార్డులు లేదా ఇతర రక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పశువులకు మేతగా మారుతున్నాయి. నిర్మాణ, ఇతర వ్యర్థాలను మొక్కలపైనే వేయడంతో మొక్కలు మొదట్లోనే చచ్చిపోతున్నాయి. వచ్చే ఏడాది మరోసారి అదే ప్రాంతంలో మొక్కలు నాటుతున్నారు. ఇదొక తంతులా మారిపోయింది. మొక్కల వాస్తవ పరిస్థితిపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. ప్రతిసారి గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలకు భారీగా పంపిణీ చేస్తున్నామంటూ ప్రకటిస్తున్నారు. కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటిదేం జరగడం లేదు. 
గుప్పుమంటున్న ఆరోపణలు..! 
హరితహారం పేరిట నిధుల స్వాహాపర్వం జరుగుతున్నట్లు ఎప్పటి నుంచో హెచ్‌ఎండీఏపై ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఉద్యోగులు, గుత్తేదారులు కుమ్మక్కై కాగితాల్లోనే మొక్కలను చూపిస్తూ నిర్వహణ పేరిట భారీగా నిధులను స్వాహా చేస్తున్నారని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. కోట్ల మొక్కలు నాటామని ఘనంగా చెప్పుకొంటున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుందని వివరిస్తున్నారు. నాటిన మొక్కలను రక్షించుకోవడంపై కాకుండా ఆ ఏడాది లక్ష్యాన్ని చేరుకున్నామా లేదా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. 

90 శాతం మొక్కలు బతికాయి 
హెచ్‌ఎండీఏ అధికారులు 
హరితహారం కార్యక్రమంలో ఇప్పటి వరకు నాటిన మొక్కల్లో 90 శాతం వరకు బతికాయి. నాటిన ప్రతి మొక్కను బతికించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ట్రీగార్డులు ఏర్పాటు చేయడంతోపాటు క్రమం తప్పకుండా నీళ్లు పోయిస్తున్నాం. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. చనిపోయిన మొక్కల స్థానంలో అప్పటికప్పుడు కొత్తవాటిని నాటుతున్నాం. గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలకు ఏటా మొక్కలను పంపిణీ చేస్తున్నాం. నర్సరీల నిర్వహణలోనూ ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం.