బైక్ బేబీస్
బైక్‌ల మీద రయ్యంటూ దూసుకుపోతున్న అమ్మాయిలు సిటీల్లో ఎక్కువయ్యారు. మగవాళ్లు మాత్రమే నడిపే బడా బడా బైకులను సైతం అవలీలగా నడిపేస్తున్నారు. అంతేనా.. మేఘాలతో తేలిపోతూ బైక్ రైడింగ్‌ను మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. తమని అబ్బాయిలనుకుని లిఫ్ట్ అడిగిన మగవాళ్లూ ఉన్నారని చెబుతున్నారు ఈ బైక్ రాణులు.
అమ్మాయిలు రోదసిలో ప్రయాణిస్తున్న ఈ రోజుల్లో.. బైక్ నడపడం అంత కష్టమైన పనేం కాదు. అయినా బైక్ రైడింగ్‌కు జండర్‌తో పనిలే దంటున్నారు బైకర్ని అనే విమెన్ రైడర్స్ గ్రూప్ సభ్యులు. ఆత్మవిశ్వాసం తోడుగా ఉంటే బైక్ మీద దేశాలు చుట్టేస్తామని చెబుతున్నారు. ప్రపంచంలో స్త్రీకి సరైన రక్షణ లేదు. ఆకాశంలో సగమనే మాటలు కేవలం అక్షరాలకే పరిమితమయ్యాయి. దక్కాల్సిన గౌరవం నేటికి దక్కడం లేదు. మాపై ఎందుకీ వివక్ష అని ఆలోచించారు. ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం వెతకాలి అనుకున్నారు. అందుకోసం భిన్న మార్గాన్ని ఎంచుకున్నారు.
‘స్తీలకు సరైన రక్షణ కల్పించాలి, వారికి తగిన గౌరవం దక్కాలి’ అనే సందేశాన్ని ఇస్తూ 25 దేశాల్లో, 90 రోజులు బైక్ యాత్ర చేయాలని ముగ్గురు మహిళలు నిర్ణయించుకున్నారు. వాళ్లే గుజరాత్‌కు చెందిన డాక్టర్ సారికా మెహతా, జినాల్ షా, రుతాలీ పటేల్. వారి యాత్రా విశేషాలేంటో తెలుసుకుందాం పదండి..
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన డాక్టర్ సారికా మెహతా పురుషుడికన్నా స్త్రీ ఎందులోనూ తక్కువ కాదంటారు. మహిళా సాధికారత, సామాజిక అంశాలపై అందరికీ అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం 2015లోనే ‘బైకింగ్ క్వీన్స్’ అనే సంస్థను స్థాపించారు. బైక్ రైడింగ్ తెలిసిన మహిళలు ఈ సంస్థలో సభ్యులుగా చేరవచ్చు. వీరంతా కొన్ని ప్రాంతాలను ఎంచుకుని, బైక్‌పై అక్కడికి వెళతారు. కుటుంబాల్లోనూ, ఆఫీసుల్లో, ఇతర ప్రదేశాల్లో సమస్యలను ఎదుర్కొం టున్న మహిళలందరినీ ఒక్కచోటుకు చేరుస్తారు. సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలి? వంటి మరెన్నో విషయాలపై వారికి అవగాహన కలిగిస్తారు.
యాత్ర మొదలైందిలా..
సారికా మెహతా ఆలోచన నచ్చిన కొందరు మహిళలు ఆ సంస్థలో భాగస్వాములయ్యారు. వారిలో గహిణులు, విద్యార్థినులు ఉన్నారు. ఆమె తాజాగా ‘స్త్రీలకు సరైన రక్షణ కల్పించాలి, వారికి తగిన గౌరవం దక్కాలనే’ సందేశాన్ని ఇస్తూ ప్రపంచ యాత్ర చేయాలనుకున్నారు. బైక్‌పై 25 దేశాల్లో 90 రోజులు ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. ఈ యాత్ర చేయడానికి జినాల్ షా (గహిణి), రుతాలీ పటేల్ (విద్యార్థిని) ముందుకొ చ్చారు. ఆ సంస్థ గహిణులలో దాగున్న నైపుణ్యాల్ని బయటకు తీసుకురావడంలో విజయం సాధించారు అనడానికి ‘జినాల్ షా’నే ఒక ఉదాహరణ. ఈ యాత్ర జూన్ 5న వారణాసిలో ప్రారంభమై, ఆగస్టు 26న లండన్‌లో ముగుస్తుంది. వీరు 25 దేశాల్లో 25 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాలని నిర్దేశించుకున్నారు.
మాకు సవాలే..
‘ఈ ప్రయాణం రష్యాలోని వోల్గోగ్రాడ్ నుంచి మాస్కో వరకు ప్రయాణం చేసే వెయ్యి కిలోమీటర్లు మాకు సవాలుగా మారనున్నాయి. ప్రతి దేశంలోనూ అక్కడి స్థానిక మహిళా ప్రభుత్వాధికారులను, ఉన్నతాధికారులను కలిసి, వారికి దక్కాల్సిన గౌరవం దక్కుతుందా? లేదా? అనేది తెలుసుకుంటున్నాం. ఒకవేళ అవి వారికి దక్కకపోతే, దానికి ఎదురయ్యే పరిస్థితులేంటో తెలుసుకుని, వాటిని ఎలా ఎదుర్కోవాలో వారికి వివరిస్తున్నాం. ఎవరెన్ట్ బేన్‌క్యాంప్, ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లోని ఎడారులు, వివిధ వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకున్నాం. ఈ యాత్ర రూటుమ్యాప్ కోసం మేమెంతో కష్టపడ్డాం. గూగుల్‌తోపాటు ఆ ప్రాంతాల్లో ప్రయాణించిన బైక్ రైడర్ల సలహాలు, సూచనలు తీసుకున్నాం. ఈ యాత్రకు ‘కేటీఎం 390′ బైక్‌ను ఎంచుకున్నాం. ఈ బైక్ మీద 18 వేల అడుగుల ఎత్తు నుంచి బ్రేక్ వేయకుండా సులువుగా కిందికి దిగవచ్చు. వేల కిలోమీటర్ల ప్రయాణం కాబట్టి రక్షణ కోసమూ అనేక చర్యలు తీసుకున్నాం’ అంటున్నారు ఈ ముగ్గురు నారీమణులు.
మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్న ఈ ముగ్గురిని అభినందించకుండా ఉండలేం. సెల్యూట్ టూ బైక్ క్వీన్స్!
బైక్ రైడింగ్‌లోనూ ఫాస్టే
అమ్మాయిలు బైక్ నేర్చుకోవడానికి కారణాలు బోలెడు. కొందరు థ్రిల్ కోసం నేర్చుకుంటే.. ఇంకొందరు నలుగురిలో ప్రత్యేకంగా నిలవాలని.. మరికొందరు మహిళలు సైతం పురుషులకు మల్లే బైక్ నడపగలరని నిరూపించడానికి మోటర్ సైకిల్ నేర్చుకుంటున్నారు. అంతేకాదు ఇలా బైక్‌పై పట్టుసాధించిన అమ్మాయిలు.. మరింత మంది అమ్మాయిలకు మోటర్‌సైకిల్ నడపడం నేర్పిస్తున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన అంజలి ఈ కోవలోకే వస్తుంది. బైక్ రైడింగ్‌లో సిద్ధహస్తురాలైన అంజలి.. తన తల్లి శైలారాజన్‌కి గురువైంది. భర్తలా తనూ బైక్ నడపాలన్న శైలా కలలను ఆమె కూతురు నెరవేర్చింది. తన తల్లికే కాదు.. 2012లో రైడర్ని అనే రైడింగ్ గ్రూప్‌ను స్థాపించి.. మరెందరో మహిళల మక్కువను తీరుస్తోంది. ‘నేను బైక్ మీద వెళ్లినప్పుడల్లా.. మాకూ బైక్ నేర్చుకోవాలని ఉందంటూ చాలామంది ఆడవాళ్లు అడిగేవారు. అందుకే రైడర్ని గ్రూప్ స్థాపించాను. మా అమ్మకు కూడా బైక్ రైడింగ్ నేర్పించాను. ఇప్పుడు మేమిద్దరం సిటీలో చక్కర్లు కొట్టేస్తుంటాం’ అని చెప్పుకొచ్చింది 27 ఏళ్ల అంజలి.
ఒత్తిడికి చెక్
బైక్ రైడింగ్ ఒత్తిడికి చెక్ పెడుతుందని చెబుతుంది సీమా శర్మ డోరా. విమెన్ ఓన్లీ బైకర్స్ గ్రూప్ స్థాపకురాలిగా ఎందరో మహిళలకు బైక్ రైడింగ్‌ని పరిచయం చేసిందామె. ‘వారంలో ఆరు రోజులు పని ఒత్తిళ్లకు.. ఆదివారం బైక్ రైడర్స్‌తో చేసే ట్రావెల్ పునరుత్తేజాన్ని కలిగిస్తుంద’ని చెబుతోంది మరో బైకర్ అమందా బ్రౌన్ గుప్త. జైపూర్‌కు చెందిన వీను పాలివాల్ హార్లే బైక్‌పై ఎంచక్కా చక్కర్లు కొట్టేస్తుంటుంది. ‘ఇక్కడ హార్లే రైడర్‌ని నేనొక్కదాన్నే. అందుకే నేను రోడ్డుపై వెళ్తుంటే జనాలంతా ఇట్టే గుర్తుపట్టేస్తార’ని అంటారు పాలివాల్. ఈ ఇద్దరు పిల్లల తల్లి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత బైక్ రైడింగ్ నేర్చుకుంది.
నాన్‌స్టాప్ రైడర్..
మోపెడ్‌పై మదువుగా వెళ్లే పూజా దాభి అనే యువతి ఓసారి ఫ్రెండ్ బైక్ నడిపింది. అంతే లవ్ ఎట్ ఫస్ట్ రైడ్. ఎలాగైనా బైక్ నేర్చుకోవాలని అనుకుంది. పట్టుదలతో అనుకున్నది సాధించింది. ప్రస్తుతం కేటీఎం డ్యూక్ 200పై నాన్‌స్టాప్ ట్రిప్స్ వెళ్లొస్తుంటుంది. గోకర్ణం నుంచి పుణె వరకు ఎక్కడా ఆపకుండా రైడ్ చేసింది. వందలాది కిలోమీటర్లు నాన్‌స్టాపగా వెళ్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే పొట్టిగా ఉండేవాళ్లు బైక్ నడపడం కష్టం. పూజది కూడా అదే పరిస్థితి. అయితే తన ఆత్మవిశ్వాసంతో ఆ లోపాన్ని అధిగమించి బైక్ మీద రివ్వు రివ్వున దూసుకుపోతోంది. ఇదంతా చదివిన తర్వాత మీకు కూడా బైక్ రైడింగ్ నేర్చుకోవాలని అనిపించి ఉంటుంది. ఇక ఆలస్యం ఎందుకు అమ్మాయిలూ.. బైక్ కొనండి.. రోడ్‌పై దూసుకుపోండి.. బెస్ట్ ఆఫ్ లక్.