అభిమానులకు తీవ్ర నిరాశ

మాంచెస్టర్‌ : ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌ చేరకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. లీగ్‌ దశలో అమోఘమైన రీతిలో ప్రదర్శన చేసిన జట్టు సెమీస్‌లో న్యూజిలాండ్‌ వంటి జట్టు చేతిలో ఓడిపోతుందని ఫ్యాన్స్‌ ఏమాత్రం ఊహించలేదు. కానీ, కివీస్‌ అనూహ్యంగా భారత్‌ను ఓడించి ఫైనల్‌ చేరింది. మరోవైపు, ఆతిథ్య ఇంగ్లాండ్‌ కూడా ఆస్ట్రేలియాను మట్టికరిపించి టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. అయితే, వరల్డ్‌ కప్‌ నిర్వాహకుల ముందు ఇప్పుడో విచిత్రమైన పరిస్థితి నిలిచింది. లీగ్‌ దశలో టీమిండియా ఊపు చూసిన అభిమానులు కచ్చితంగా ఫైనల్‌ చేరుతుందని భావించి జూలై 14న జరిగే టైటిల్‌ పోరుకు టికెట్లు భారీగా కొనేశారు. అంతిమ సమరానికి ఆతిథ్యమిస్తున్న లార్డ్స్‌ స్టేడియంలో 80 శాతం టికెట్లు భారత అభిమానులే కొనుగోలు చేశారు. కానీ భారత్‌ సెమీస్‌ లోనే వెనుదిరగడంతో వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఫైనల్లో భారత్‌ ను చూడాలని భావించిన వాళ్లు, ఇప్పుడు ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్లు టైటిల్‌ కోసం ఆడుతుంటే స్టేడియానికి వచ్చి మరీ మ్యాచ్‌ చూస్తారని ఎవరూ భావించడంలేదు. 
ఈ నేపథ్యంలో, ఐసీసీ వెబ్‌ సైట్‌లో భారీగా టికెట్‌ రీసేలింగ్‌ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకైతే రీసేల్‌ విభాగంలో ట్రాఫిక్‌ తక్కువగానే ఉందని, కానీ రీసేల్‌లో టికెట్లు కొనాలని కోరుకుంటున్నవాళ్ల సంఖ్య మాత్రం పెరుగుతోందని ఐసీసీ వర్గాలంటున్నాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఫైనల్లో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ ఆడుతున్నా ఆ రెండు జట్ల అభిమానులకు టికెట్లు దొరకని పరిస్థితి తలెత్తింది. టీమిండియా అభిమానులు తమ వద్ద ఉన్న టికెట్లు అమ్మకానికి పెడితే తప్ప ఇంగ్లాండ్‌, కివీస్‌ ఫ్యాన్స్‌ అందరికీ మ్యాచ్‌ చూసే అవకాశం లభించకపోవచ్చు. 
‘డియర్‌ భారత్‌ ఫ్యాన్స్‌.. ఫైనల్‌ టికెట్లు అమ్మండి’ 
ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లు కొన్న భారత అభిమానులు వాటిని తిరిగి అమ్మాలని న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జిమ్మీ నీషమ్‌ ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశాడు. ఆదివారం జరిగే ఈ మెగా సంగ్రామంలో ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్లు అమితుమీ తెల్చుకోనున్న విషయం తెలిసిందే. అయితే టోర్నీ ఆధ్యాంతం ఆధిపత్యం కనబర్చిన భారత జట్టుకు ఫైనల్‌ బెర్త్‌ ఖాయమని ఇటు అభిమానులు, అటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు భావించారు. దీంతో భారీ ఎత్తున్న ఫైనల్‌ మ్యాచ్‌కు భారత అభిమానులు టికెట్లు కొనుగోలు చేశారు. కానీ కోహ్లిసేన పోరాటం సెమీస్‌తోనే ముగియడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఫైనల్‌ మ్యాచ్‌కు రాని భారత అభిమానులు ఆ టికెట్లను తిరిగి అమ్మివేయాలని నిషమ్‌ ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశాడు. 
‘డియర్‌ భారత క్రికెట్‌ అభిమానులారా.. మీరు ఫైనల్‌ మ్యాచ్‌కు రాకపోతే దయచేసి ఆ టికెట్లను అధికారిక ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా తిరిగి అమ్మండి. అధిక లాభానికి అమ్ముకోవాలని అందరికి అనిపిస్తుంది. కానీ దయచేసి సంపన్నులే కాకుండా నిజమైన అభిమానులు మ్యాచ్‌కు వచ్చేలా చేయండి.’ అంటూ నీషమ్‌ ట్వీట్‌ చేశాడు. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌ పోరులో భారత్‌ 240 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 18 పరుగుల తేడాతో ఓడి మెగా టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.