సీఎం స్పందించినా ఈ సమస్యకు పరిష్కారం ఏదీ…?
- అక్బర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం
- కర్నూలు జిల్లా చాగలమర్రి ఆస్పత్రికి తరలింపు
సోషల్ మీడియాలో వీడియో చూసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించినా తనకు న్యాయం జరగలేదని అక్బర్ భాషా కుటుంబం సోమవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో విశ్వ ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
విష ద్రావణం తాగిన విషయాన్ని అక్బర్ తమ్మునికి తెలియజేయడంతో స్తానికులు చాగలమర్రి లోని అక్బర్ ఇంటి వద్దకు వచ్చి తలుపులు పగలగొట్టి విషమ పరిస్థితిలో ఉన్న అక్బర్, ఆయన భార్య , ఇద్దరు కుమార్తెలను 108 వాహనాల్లో చాగలమర్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కర్నూలు జిల్లా చాగలమర్రి లో సోషల్ మీడియా వేదికగా ఈనెల 10వ తేది శుక్రవారం రాత్రి 11 గంటలకు మిద్దె అక్బర్ బాషా దువ్వూరు మండలం ఎర్రబెల్లి పంచాయతీ మాచాన పల్లి కి చెందిన భూమి కి సంబంధించి ‘స్పందన’లో ఇచ్చిన ఫిర్యాదుపై మైదుకూరు రూరల్ సి.ఐ కొండారెడ్డి, వైసిపి నాయకులు తిరుపాల్రెడ్డి వారి కుటుంబ సభ్యులు తనకు అన్యాయం చేస్తున్నట్లు ఆరోపణ చేస్తూ, కుటుంబం ఆత్మహత్యాయత్నం ప్రకటన తో వీడియోను పంపారు. స్పెషల్ బ్రాంచ్ విభాగంలోని సోషల్ మీడియా మోనిటరింగ్ సెల్ సిబ్బంది ఆత్మహత్యాయత్నం చేసుకునే ఆలోచనను గుర్తించి జిల్లా ఎస్.పి దృష్టికి ఈ పోస్ట్ పెట్టిన కొద్ది నిమిషాల్లోనే తీసుకెళ్లారు. తక్షణం జిల్లా ఎస్.పి సంబంధిత దువ్వూరు ఎస్.ఐ కె.సి రాజు కు వెంటనే బాధిత వ్యక్తి ఇంటివద్దకు వెళ్లాలని ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన దువ్వూరు ఎస్.ఐ, చాగలమర్రి పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి కేవలం 20 నిమిషాల్లో చాగలమర్రిలో నివాసం ఉండే బాధితులు మిద్దె అక్బర్ బాషా ఇంటికి చేరుకొని అతనితో మాట్లాడి జిల్లా ఎస్.పి వద్దకు తీసుకెళతామని వారి ఆలోచనలు మార్చి ఆత్మహత్య ప్రయత్నం నుంచి వారిని కాపాడారు. శనివారం ఉదయం 11 గంటలకు జిల్లా ఎస్.పి ని జిల్లా పోలీస్ కార్యాలయంలో కలిసి జరిగిన విషయాన్ని వివరించారు. విచారించి కచ్చితంగా న్యాయం చేస్తామని అని చెప్పి అక్బర్ భాషను సముదాయించారు.
అడిషనల్ ఎస్పీ తో విచారణ….
మైదుకూరు రూరల్ సి.ఐ పై ఆరోపణలను అదనపు ఎస్.పి (ఆపరేషన్స్) దేవ ప్రసాద్ ను విచారణాధికారిగా నియమించినట్లు ఎస్.పి తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకూ మైదుకూరు రూరల్ సి.ఐ ని విధుల నుండి తప్పిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ సంఘటనతో స్పందించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు, రాష్ట్ర డిజిపి కి, అక్బర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
సీఎం చెప్పిన సమస్యకు పరిష్కారం లేదా…?
అదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్ బాబు అక్బర్ కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ డీ 10 రోజులు దాటినా ఇప్పటివరకు తన తల సమస్యపై ఎవరూ స్పందించలేదు అంటూ సోమవారం రాత్రి అక్బర్ కుటుంబం విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. విషయం తెలుసుకున్న కడప పోలీసులు చాగలమర్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వెళ్లినట్లు సమాచారం. వారిని మెరుగైన వైద్యం కోసం కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తీసుకువస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినా కూడా ఒక కుటుంబానికి సంబంధించిన సమస్య పరిష్కరించడంలో ఎవరు విఫలమయ్యారు అన్నది తెలియాల్సి ఉంది….