కేంద్రానికి పెద్దమొత్తంలో ఆర్బిఐ నిధులు బదిలీ
- రూ.99,122 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి బదిలీకి అంగీకారం
- కోవిడ్ వల్ల పడనున్న ఆర్థిక ప్రతికూలతను అధిగమించే చర్య
ముంబాయి,జ్యోతిన్యూస్ :
కేంద్ర ప్రభుత్వానికి భారతీయ రిజర్వు బ్యాంకు శుక్రవారం పెద్ద మొత్తంలో నిధులను బదిలీ చేసింది. మార్చి 31తో ముగిసిన తొమ్మిది నెలల అకౌంటింగ్ పీరియడ్లో మిగులు నిధులు రూ.99,122 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి ఆమోదం తెలిపింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన ఆర్బీఐ డైరెక్టర్ల కేంద్ర బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ఆర్బీఐ బోర్డు సక్షించినట్లు ఈ ప్రకటన పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం వల్ల పడే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు ఆర్బీఐ ఇటీవల తీసుకున్న విధానపరమైన చర్యలు, అంతర్జాతీయ, దేశీయ సవాళ్ళ గురించి చర్చించినట్లు తెలిపింది. భారతీయ రిజర్వు బ్యాంకు అకౌంటింగ్ ఇయర్ గతంలో జూలై-జూన్ ఉండేది. ప్రస్తుతం ఏప్రిల్-మార్చికి మారింది. ఈ నేపథ్యంలో 2020 జూలై నుంచి 2021 మార్చి వరకు గల తొమ్మిది నెలల్లో ఆర్బీఐ పని తీరును ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని బోర్డు చర్చించింది. ఈ తొమ్మిది నెలల కాలానికి ఆర్బీఐ వార్షిక నివేదికను, ఖాతాలను ఆమోదించింది. ఈ తొమ్మిది నెలల కాలంలో మిగులు నిధులు రూ.99,122 కోట్లును కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. 5.5 శాతం కంటింజెన్సీ రిస్క్ బఫర్ను నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. బోర్డు సమావేశంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు మహేశ్ కుమార్ జైన్, మైఖేల్ దేబబ్రత పాత్రా, ఎం. రాజేశ్వర్ రావు, టీఆర్ శంకర్ పాల్గొన్నారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్లు ఎన్ చంద్రశేఖరన్, సతీశ్ కే మరఠే, ఎస్ గురుమూర్తి, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది, డిపార్ట్మెంట్ ఆఫ్గ్•నాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ దేబశిశ్ పాండా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ గ్•ర్స్ సెక్రటరీ అజయ్ సేఠ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.