ఆనందయ్య కరోనా మందుపై ఉన్నతస్థాయి అధ్యయనం
- శాస్త్రీయ పరిశీలన అవసరం
- శాస్త్రీయ నిర్ధారణతో కోసం అధికారులకు ఆదేశాలు
- బ్లాక్‌ఫంగస్‌పై అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
- ఆస్పత్రుల్లో బెడ్ కెపాసిటీకి అనుగుణంగా ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లు
- ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కోనేందుకు సిద్దపడాలి
- కరోనాపై ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలు
అమరావతి,జ్యోతిన్యూస్ :
ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఉన్నతస్థాయి అధ్యయనానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. నెల్లూరు ఆయుర్వేదంపై శాస్త్రీయ నిర్దారణ చేయించాలని అధికారులను ఆయన ఆదేశించారు. నెల్లూరుకు వైద్యులు, శాస్త్రవేత్తల బృందాన్ని పంపించాలన్నారు. కరోనా నియంత్రణ, వాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో సక్ష చేపట్టారు. బ్లాక్ ఫంగస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఆక్సిజన్ తీసుకునేటప్పుడు వినియోగించే నీటి విషయంలో జాగ్తత్తలు తీసుకోవాలనే సమాచారం వస్తోందని.. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పటిష్టమైన ప్రోటోకాల్స్ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరా పైపులు, మాస్క్‌లు ఇవన్నీ కూడా నిర్ణీత ప్రమాణాలున్న వాటినే వినియోగించాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా బెడ్ కెపాసిటీకి అనుగుణంగా ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. జనరేటర్లను ఏర్పాటు చేసుకునే ఆస్పత్రులకు 30శాతం ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ముందస్తుగానే వారికి ఇన్సెంటివ్‌లు ఇవ్వడం ద్వారా చురుగ్గా ఆక్సిజన్ జనరేటర్‌ల్లను ఏర్పాటు చేసుకునేలా వారిని ప్రోత్సహించ వచ్చని సీఎం అన్నారు. కనీసం నాలుగు నెలల వ్యవధిలో అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేటర్లు ఏర్పాటయ్యేలా చూడాలని సీఎం సూచించారు. 50 పడకలు, అంతకన్నా ఎక్కువ ఉన్న ఆస్పత్రుల్లో కచ్చితంగా ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లు పెట్టాలని సీఎం ఆదేశించారు. కొత్తగా 100 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే కంపెనీలు పెడితే 20 శాతం ఇన్సెంటివ్ ఇస్తామని సీఎం తెలిపారు. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో పిల్లల చికిత్స కోసం ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం పైనా దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కోనేందుకు ఈ ఏర్పాట్లు ఉండాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు తగినట్టుగా ఆక్సిజన్ రాష్ట్రంలోనే ఉత్పత్తి అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్సిజన్ తయారీలో వినియోగించే జియోలైట్ కొరతను ఎదుర్కొనేందుకు కడపలో తయారీ పరిశ్రమను త్వరలో తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. రోగులకు మంచి ఆహారం, ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం బాగుండాలని సీఎం అన్నారు. ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం కాబట్టి, చిన్న చిన్న విషయాల్లో ఎలాంటి కొరత లాకుండా ఉండాలన్నారు. ఆస్పత్రుల్లో పారిశుద్ద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి ఆస్పత్రి నుంచి నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకోవాలన్నారు. రోగులకు అసౌకర్యంగా, అపరిశుభ్ర వాతావరణం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. రోగులకు నాణ్యమైన సేవలు అందాలని సీఎం స్పష్టం చేశారు. ఆక్సిజన్ సేకరణ, సరఫరా, నిల్వలపై సీఎం సక్షించారు. 2 ఆక్సిజన్ ట్రైన్లు నడుస్తున్నాయని సీఎంకు అధికారులు వివరించారు. ఈ వారంలో మరో ఆక్సిజన్ ట్రైన్ కూడా ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. దీంతోపాటు భువనేశ్వర్‌కు ప్రతి రోజూ కూడా ట్యాంకర్లను ఎయిర్ లిప్ట్ చేస్తున్నామని అధికారులు వివరించారు. దేశంలో ఎక్కడ ఆక్సిజన్ కేటాయించినా డ్రా చేయగలుగుతున్నామని అధికారులు తెలిపారు.ఐఎస్‌ఓ ట్యాంకర్లను వినియోగించుకుని సమర్థవంతంగా ఆక్సిజన్ సేకరించుకోగులుగుతున్నామని అధికారులు తెలిపారు. అలాగే ఆస్పత్రుల్లో ఆక్సిజన్ వినియోగంపై ఆడిట్ చేస్తున్నామని అధికారులు వివరించారు. ఎక్కడ వృథా అవుతున్నా అప్రమత్తం చేస్తున్నామని, వృథాను అరికట్టడంపై దృష్టిపెడుతున్నామన్న అధికారులు వివరించారు. ఆక్సిజన్ సేకరణ, సరఫరా, పంపిణీ, ఆస్పత్రుల్లో వినియోగం.. వీటన్నింటినీ కూడా పూర్తిగా కంప్యూటరైజ్ చేశామని అధికారులు తెలిపారు. 9 పీఎస్‌ఏ యూనిట్లను పునరుద్ధరించడం ద్వారా 52.75 మెట్రిక్ టన్నుల
ఉత్పత్తి లభించిందని అధికారులు తెలిపారు. మరో 5 పీఎస్‌ఏ యూనిట్లను పునరుద్ధరించే పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. 12 నైట్రోజన్ యూనిట్లను కూడా మార్పు చేయడం ద్వారా మరో 11.41 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అదనంగా వస్తుందన్నారు. కొత్తగా నాలుగు కంపెనీలు ఆక్సిజన్ ఉత్పత్తికి ముందుకొస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులు, అలాగే రెమ్‌డెసివర్ లాంటి ఇంజక్షన్ల ఇషయంలో అక్రమాలకు పాల్పడ్డ ఆస్పత్రులపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇంటెలిజెన్స్ అధికారులు బుక్ చేసిన కేసులపై చర్యలుండాలని సీఎం అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్) ఎం.రవిచంద్ర, ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్,104 కాల్ సెంటర్ ఇంఛార్జ్ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఎ.మల్లికార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జువ్వాది సుబ్రమణ్యం, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.