నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఎలా విచారిస్తారు?
- దొడ్డిదారిన విచారణ జరపడమేంటని ప్రభుత్వానికి ప్రశ్న
- ఈటెల భూముల్లో విచారణపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
- నిబంధనలు ఉల్లంఘించి జరిపిన విచారణ చెల్లదని స్పష్టీకరణ
- భూములు, వ్యాపారాల్లో జోక్యం తగదని ఆదేశాలు
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
జమున హ్యాచరీస్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూముల్లో ప్రభుత్వం సర్వే జరిపిన తీరును తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. సర్వే చేసే ముందు ఆయనకు నోటీసు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సహజ న్యాయసూత్రాలను అధికారులు తీవ్రంగా ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. జమున హేచరీస్ భూములు, వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మంగళవారం హైకోర్టు జమున హ్యాచరీస్ కేసును విచారణ చేపట్టింది. జమున హ్యాచరీస్‌కు సరైన పద్ధతిలో నోటీసులు సర్వ్ చేసి ప్రభుత్వం విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలని కోరింది. శుక్రవారం ఇచ్చి సోమవారం రిప్లై ఇవ్వమనేలా ఉండకూడదని షరతు విధించింది. వెనుక గేటు నుంచి కాదు.. రాచమార్గంలో వెళ్లి విచారణ జరపాలని ఆదేశించింది. మే 1, 2వ తేదీల్లో జరిగిన విచారణను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పింది. ప్రభుత్వ నివేదిక చెల్లదని పేర్కొంది. అధికారులు ఉల్లంఘనకు పాల్పడినట్టు హైకోర్టు అభిప్రాయపడింది. ప్రతివాదులందరికీ హైకోర్టు నోటీసులు పంపించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తన కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ కోసం మాజీమంత్రి ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన మే 1, 2 తేదీల్లో మెదక్ కలెక్టర్ హరీశ్ విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక చెల్లదని పేర్కొంది. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది.ఈ కేసు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈటల కుటుంబం అత్యవసర పిటిషన్‌పై న్యాయమూర్తి వినోద్ కుమార్ తన నివాసంలోనే విచారణ చేపట్టారు. ఈటల కుటుంబం తరఫున సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. సర్వే చేసేముందు తమకు నోటీసు ఇవ్వలేదని తెలిపారు. అధికారులు తమ భూముల్లోకి అక్రమంగా చొరబడ్డారని కోర్టుకు తెలిపారు. కలెక్టర్ నివేదికను కూడా తమకు ఇవ్వలేదని పేర్కొన్నారు. మరోవైపు ఈటలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందుకే విచారణ చేపట్టామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ వాదించారు. అయితే విచారణ జరిగిన తీరును హైకోర్టు తప్పుబట్టింది. సర్వే చేసేందుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదా?అని ప్రశ్నించింది. రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తయిందని అడిగింది. ఫిర్యాదు వస్తే ఎవరి ఇంట్లోకైనా వెళ్లి విచారణ చేయొచ్చా? అని వ్యాఖ్యానించింది. ఈ నివేదిక అధికారులు కారులో కూర్చుని రూపొందించినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.