అం‌దరికీ అందేనా…!? : కరోనా టీకా

  • అందరికీ వ్యాక్సిన్లు ఇప్పట్లో సాధ్యమేనా?
  • 45 ఏళ్లు పైబడ్డ వారికి తొలిదశ ఇంకా పూర్తి కాలేదు
  • 18 ఏళ్లు పైబడ్డ వారికి ఇస్తే డిమాండ్‌ అం‌దుకోగలమా
  • సర్వత్రా ఇప్పుడు అందరిలోనూ ఇదే ప్రశ్న

న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :
‌కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఆస్పత్రులు నిండిపోతున్నా యి. యాంటీ వైరల్‌ ‌మందులు, ఆక్సిజన్‌కు కొరత తలెత్తింది. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ వ్యాక్సినేషన్‌ అవస రాన్ని కేంద్రం గుర్తించింది. మే 1నుంచి 18ఏళ్లు పైబడి వారికి ఇవ్వాలని ప్రభుత్వం సంకల్సించింది. కానీ 45 ఏళ్లు పైబడ్డ వారికే ఇప్పటికీ పూర్తి కాలేదు. కేంద్రం వ్యాక్సిన్‌ ‌విషయంలో స్పష్టమైన ప్రణాళికతో లేదని తెలుస్తోంది.దీంతో వ్యాక్సిన్లు అందరికీ అందుతాయా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరిగి అందరికీ అందుబాటులోకొచ్చే వరకు ఓపిక పట్టడం తప్పదని నిపుణులు అంటున్నారు. దేశంలో ఈఏడాది జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్‌ ‌మొదలైంది. అప్పటి నుంచి ఈ నెల 26 నాటికి.. అంటే సుమారు 102 రోజుల్లో వైద్యులు, సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ ‌వర్కర్లు, 45 ఏళ్లు పైబడినవారికి కలిపి 14.50 కోట్ల మందికి మాత్రమే టీకాలు అందాయి. ఇందులోనూ 12 కోట్ల మందికి ఒకే డోసు వేశారు, రెండు డోసులు పూర్తయిన వారి సంఖ్య సుమారు రెండున్నర కోట్లు మాత్రమే. సగటున లెక్కిస్తే.. దేశవ్యాప్తంగా రోజుకు 22 లక్షల మంది టీకాలు వేయగలిగారు. ఇది ఇలాగే కొనసాగితే.. దేశంలో టీకాలకు అర్హులైన 94 కోట్ల మందికి రెండు డోసులు ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. జనాభాలో కనీసం 70-80 శాతం మందికి టీకాలు వేస్తే.. వైరస్‌ ‌దాదాపు నియంత్రణలోకి వచ్చినట్టేనని, హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ లెక్కన రెండేళ్ల వరకు కరోనా ప్రభావం ఉంటుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.ఐదారు నెలలు దాటితే..: దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు వస్తాయని అంటున్నారు. ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం, మున్ముందు పెరిగే కెపాసిటీ, కొత్తగా వచ్చే వ్యాక్సిన్లు, సరఫరా పంపిణీల తీరును గమనిస్తే.. మరికొద్ది నెలల పాటు ఇప్పుడున్నట్టుగానే వ్యాక్సినేషన్‌ ‌కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది.

కరోనా టీకా

ప్రస్తుతం 45 ఏళ్లు పైబడినవారికి టీకా తీసుకునే అనుమతి ఉండగా.. మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారికీ వ్యాక్సిన్‌ ‌వేసేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ లెక్కన మొత్తం 94 కోట్ల మంది టీకాలకు అర్హులు. ఇందులో 45 ఏళ్లుపైబడినవారు సుమారు 26 కోట్ల మంది. వీరిలో ఇప్పటివరకు సుమారు 11.97 కోట్ల మందికి టీకాలు వేయగా.. ఒక డోసు తీసుకున్నవారు సుమారు 10 కోట్లు, రెండు డోసులూ పూర్తయినవారు దాదాపు 2 కోట్ల మంది. అంటే 45 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సిన్‌ ‌రెండు డోసులు పూర్తి కావడానికి సుమారు 38 కోట్ల డోసుల టీకాలు కావాలి. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్‌, ‌కోవిషీల్డ్ ‌రెండింటి ఉత్పత్తి సామర్థ్యం కలిపి నెలకు సుమారు ఏడు కోట్ల డోసులే. జూన్‌, ‌జూలై నెలల నుంచి ఈ సంఖ్య 15?16 కోట్ల డోసులకు పెరుగుతుందని అంచనా. వీటికితోడు స్పుత్నిక్‌-‌వి వ్యాక్సిన్‌ అం‌దుబాటు లోకి రానుంది. అంటే మొత్తంగా ఐదారు నెలల తర్వాత వ్యాక్సినేషన్‌ ఓ ‌కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సెకండ్‌ ‌వేవ్‌ ‌కరోనా కేసుల విషయంలో భారత్‌ ‌ప్రపంచంలోనే అత్యంత బాధిత దేశంగా మారిపోయింది. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆస్పత్రులు నిండిపోయి.. బెడ్లకు, ఆక్సిజన్‌కు, అత్యవసర మందు లకు కొరత ఏర్పడింది. ఆక్సిజన్‌, ‌తగిన చికిత్స అందక రోగులు చనిపోతున్నారు. మరోవైపు కోవిడ్‌ ‌నుంచి కోలుకుం టున్న వారి సంఖ్య తగ్గిపోతూ ఉండటంతో యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 24 లక్షలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మే ఒకటో తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు దాటిన అందరికీ టీకాలిచ్చే కార్యక్రమానికి పచ్చజెండా ఊపింది. కానీ టీకాల సరఫరా, పంపిణీలో లోపాలతో వ్యాక్సినేషన్‌ ‌చాలా నెమ్మదిగా సాగుతోంది. వ్యాక్సినేషన్‌ ‌మొదట్లో రోజుకు మూడు, నాలుగు లక్షల డోసులతో ప్రారంభమైనా.. 45 ఏళ్లుపైబడ్డ వారికి ఇవ్వడం మొదలయ్యాక ఊపందుకుంది. కానీ ఏప్రిల్‌ ‌పదో తేదీ తర్వాత మళ్లీ వేగం తగ్గింది. ఇది చూస్తుంటే జూలై 31 నాటి దేశంలో యాభై కోట్ల మందికి టీకాలివ్వాలన్న లక్ష్యం నెరవేరే అవకాశం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాది చివరికల్లా అర్హులైన అందరికీ టీకాలు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అది నెరవేరాలంటే నెలకు 17 కోట్ల మందికి టీకాలు ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం 94 కోట్ల మంది అర్హులకు రెండు డోసులు పూర్తిచేసేందుకు దాదాపు 188 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ అవసరం. ఇప్పుడున్నట్టుగా రోజుకు 22 లక్షల డోసుల చొప్పున వేస్తే..94 కోట్ల మందికి రెండు డోసుల చొప్పున ఇచ్చేందుకు అటు ఇటుగా వెయ్యి రోజులు పడుతుంది. అదే ఉత్పత్తి పెంచితే ముందుగా పూర్తవుతుంది. కానీ డిమాండ్‌కు తగినంతగా టీకాల ఉత్పత్తి జరగడం లేదు. దీనితో సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కోవాగ్జిన్‌, ‌కోవిషీల్డ్ ‌టీకాలు మాత్రమే అందుబాటు లో ఉన్నాయి. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‌నెలకు దాదాపు ఆరు కోట్ల టీకాలు ఉత్పత్తి చేయగలదు. కేంద్రం ఇటీవల మంజూరు చేసిన రూ.3 వేల కోట్లతో మరింత ఇన్‌‌ఫ్రాస్టక్చ్ర ‌సమకూర్చుకుని, మే నెలాఖరుకల్లా ఉత్పత్తిని పది కోట్ల డోసుల వరకు పెంచుతామని సీరమ్‌ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు భారత్‌ ‌బయోటెక్‌ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం నెలకు అరవై లక్షల నుంచి నుంచి కోటీ డోసుల వరకు ఉంది. మే నెలాఖరుకు మూడు కోట్ల డోసులకు, ఆగస్టుకల్లా ఆరు కోట్ల డోసులకు చేరుతుందని అంచనా. మొత్తంగా చూస్తే.. ప్రస్తుతం నెలకు ఏడు కోట్ల డోసుల వరకు అందుబాటులో ఉంటోంది. మరిన్ని విదేశీ వ్యాక్సిన్లు కూడా భారత్‌లో అనుమతి కోసం వేచి ఉన్నాయి. వాటిల్లో దేనికైనా అనుమతి వస్తే మరిన్ని టీకాలు అందుబాటులోకి వస్తాయి. అదే జరిగితే వ్యాక్సినేషన్‌ అనుకున్న మేరకు కొనసాగే అవకాశం ఉంటుంది. మరోవైపు భారత వైద్య పరిశోధన సమాఖ్య సహకారంతో భారత్‌ ‌బయోటెక్‌ ‌తయారుచేసిన కోవాగ్జిన్‌ను ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉత్పత్తి చేసే అంశాన్ని పరిశీలించాలని కొంతమంది నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఆ దిశగా కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటే వ్యాక్సినేషన్‌ ‌మరింత వేగంగా సాగే అవకాశం ఉంది. వ్యాక్సిన్లు పూర్తిగా అందుబాటులోకి వచ్చేందుకు కొద్ది నెలలు సమయం పడుతుంది. అప్పటివరకు నిబంధనల ప్రకారం అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకోవాలి. కచ్చితంగా మాస్కు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడటం వంటివి అలవాటుగా చేసుకోవాలి. ఇదే సమయంలో నిత్య జీవితాన్ని యథావిధిగా కొనసాగించాలి.